1971 ఇండో-పాక్ యుద్ధంలో 177 దేశాలు భారత్‌ను వ్యతిరేకిస్తే, మనకు తోడుగా నిలిచిన ఏకైక దేశం రష్యా అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: 1971 భారత్-పాక్ యుద్ధంలో 177 దేశాలు భారత్‌ను వ్యతిరేకిస్తే కేవలం, రష్యా మాత్రమే భారత్‌కు తోడుగా నిలిచి సహాయం చేసింది.
ఫాక్ట్ (నిజం): 1971 భారత్-పాక్ యుద్ధానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదించిన తీర్మానానికి పోలాండ్ అలాగే, అప్పటి సోవియెట్ యూనియన్ (USSR) దేశం అంగీకారం తెలుపలేదు. ఈ తీర్మానం ఆమోదించడానికి నిర్వహించిన వోటింగుకు ఈ రెండు దేశాలు దూరంగా ఉన్నాయి. భారత్-పాక్ యుద్ధానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానానికి భారత్, సోవియెట్ యూనియన్‌తో సహా పదకొండు దేశాలు వ్యతిరేకించాయి. అంతేకాదు, 1971 వరకు కేవలం 132 దేశాలు మాత్రమే ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వాన్ని పొందాయి. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వెబ్సైటులో వెతికితే, 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వోటింగ్ నిర్వహించి 21 డిసెంబర్ 1971 నాడు ఒక తీర్మానాన్ని ఆమోదించినట్టు తెలిసింది. భారత్, పాకిస్థాన్ దేశాలు వెంటనే కాల్పుల విరమణ చేసి తమ దేశంలో బంధించబడిన శత్రు సైన్యాలని వారి దేశాలకు పంపించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఈ తీర్మానం ద్వారా డిమాండ్ చేసింది. ఈ తీర్మానాన్ని అమలు ప్రక్రియను పర్యవేక్షించడానికి ఐక్యరాజ్యసమితి ప్రత్యేకంగా ‘యునైటెడ్ నేషన్స్ మిలిటరీ అబ్సర్వర్ గ్రూప్’(UNMOGIP)ని స్థాపించింది. 15 మంది సభ్య దేశాలు గల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 13 మంది ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా, పోలాండ్ మరియు సోవియెట్ యూనియన్ (USSR) దేశాలు ఈ వోటింగ్‌కు దూరంగా ఉన్నాయి.
1971 చివరలో ఈస్ట్ పాకిస్థాన్ స్వాతంత్రానికి సంబంధించి భారత్ మరియు పాకిస్థాన్ మధ్య యుద్ధం మొదలయ్యింది. అయితే, 1971 ఆగష్టు నెలలో భారత్‌తో చేసుకున్న ‘పీస్ అండ్ ఫ్రెండ్షిప్’ ఒప్పందాన్ని అనుసరిస్తూ అప్పటి సోవియట్ యూనియన్ భారత్‌కు మద్దతుగా నిలిచి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి సహాయం చేసినట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ప్రస్తుతం పరస్పరం యుద్ధం చేస్తున్న రష్యా అలాగే, ఉక్రెయిన్ దేశాలు అప్పటి సోవియట్ యూనియన్ దేశంలో భాగంగా ఉన్నాయి. 1991లో కోల్డ్ వార్ (ప్రచ్ఛన్న యుద్ధం) ముగిసిన తరువాత రష్యా మరియు ఉక్రెయిన్ వేర్వేరు దేశాలుగా ఏర్పడ్డాయి.
అంతేకాదు, 1971 వరకు కేవలం 132 దేశాలు మాత్రమే ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వాన్ని పొందాయి. 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో జరిగిన చర్చలో, 104 దేశాలు భారత్, పాకిస్థాన్ దేశాలు వెంటనే కాల్పుల విరమణ చేయాలనీ వోట్ వేయగా, 11 దేశాలు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించినట్టు తెలిసింది. భారత్, USSR, భూటాన్ మొదలగు దేశాలు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించాయి. ఫ్రాన్స్, యూకే, నేపాల్‌తో సహా పది దేశాలు ఈ వోటింగ్లో పాల్గొనలేదు. ఈ వివరాల ఆధారంగా 1971 భారత్-పాక్ యుద్ధంలో 177 దేశాలు భారత్‌ను వ్యతిరేకించాయని, కేవలం రష్యా మాత్రమే భారత్‌కు మద్దతు పలికిందని పోస్టులో తెలుపుతున్న సమాచారం అవాస్తవమని చెప్పవచ్చు.
చివరగా, 1971 భారత్-పాక్ యుద్ధంలో 177 దేశాలు భారత్‌ను వ్యతిరేకిస్తే కేవలం రష్యా మాత్రమే సహాయం చేసిందని షేర్ చేస్తున్న ఈ సమాచారం పూర్తిగా నిజం కాదు.