గుడిలో సిగరెట్ తాగిన ఒక యువతికి వెంటనే కర్మ ఫలితం అనుభవించింది అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది. ఒక యువతి గుడిలో సిగరెట్ తాగుతూ మొబైల్ ఫోన్ మాట్లాడుతుండగా జారిపడి పడిన దృశ్యాలు ఈ వీడియోలో చూడొచ్చు (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: గుడిలో సిగరెట్ తాగిన యువతి వెంటనే జారిపడి పడి కర్మ ఫలితాన్ని అనుభవించిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోలోని దృశ్యాలు నిజంగా జరిగినవి కావు. ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో, దీనిని నటీనటులతో చిత్రీకరించారు. దీనిని రూపొందించిన సంస్థ ఇదే విషయాన్ని ఒక వివరణ ద్వారా స్పష్టంగా పేర్కొన్నారు. వీరి యూట్యూబ్ ఛానల్‌లో ఇలాంటి స్క్రిప్టెడ్ వీడియోలు చాలా ఉన్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోలో ఒక అమ్మాయి గుడిలో సిగరెట్ తాగుతూ, ఆ తరవాత జారి కింద పడిన దృశ్యాలు చూడొచ్చు. ఐతే ఇది నిజంగా జరిగిన ఘటన కాదు, ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. పలు మీడియా సంస్థలు కూడా ఈ వీడియోలో జరిగింది నిజం అనుకొని వార్తలు రాయడంతో ఇది చాలా వైరల్ అయ్యింది (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ).
ఈ వీడియో స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియో ‘3RD EYE’ పేరుతో ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్‌లో కనిపించింది. ఐతే ఈ ఛానల్‌లో షేర్ చేసిన వీడియోలో ‘ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో అని, ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించినట్టు స్పష్టంగా ఒక వివరణ అందించారు.
ఈ ఛానల్‌లో ఇలాంటి స్క్రిప్టెడ్ వీడియోలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోలో కనిపించిన గుడి మరియు వ్యక్తులను ఈ ఛానల్‌లోని మరికొన్ని వీడియోలలో కూడా చూడొచ్చు (ఇక్కడ). ఈ సంస్థ ‘Ideas Factory’ పేరుతో తమ ఫేస్‌బుక్ పేజీలో కూడా ఇలాంటి స్క్రిప్టెడ్ వీడియోలు షేర్ చేసింది. వీటన్నిటి బట్టి ఈ వీడియోలోని దృశ్యాలు నిజంగా జరిగిన ఘటనకు సంబంధించినవి కావని, నటించి తీసారని స్పష్టమవుతుంది. గతంలో కూడా ఇలాంటి స్క్రిప్టెడ్ వీడియోను FACTLY ఫాక్ట్-చెక్ చేస్తూ రాసిన కథనాలు ఇక్కడ చూడొచ్చు.
చివరగా, అమ్మాయి గుడిలో సిగరెట్ తాగుతున్న స్క్రిప్టెడ్ వీడియోను నిజమైన సంఘటనగా తప్పుగా షేర్ చేస్తున్నారు.