Fake News, Telugu
 

చంద్రయాన్-3 ప్రయోగాన్ని అపహాస్యం చేసే విధంగా ట్వీట్ పెట్టారని కర్ణాటకలో ఫైల్ అయిన కేసులో పోలీసులు ప్రకాష్ రాజ్‌ను ఇంకా అరెస్ట్ చేయలేదు

0

నటుడు ప్రకాష్ రాజ్ చంద్రయాన్-3కి సంబంధించి పెట్టిన ఒక పోస్టు గురించి బెంగళూరు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి చితకబాదారంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా షేర్ అవుతోంది. సాయివిశ్వతేజ అనే వెబ్సైట్ పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్‌ను షేర్ చేస్తూ ఈ క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: నటుడు ప్రకాష్ రాజ్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసి చితకబాదారు

ఫాక్ట్ (నిజం): ప్రకాష్ రాజ్‌ సోషల్ మీడియా సైటు ‘X’లో పెట్టిన ఒక ట్వీట్ చంద్రయాన్-3 ప్రయోగాన్ని అపహాస్యం చేసే విధంగా ఉందని ఆరోపిస్తూ కొందరు హిందూ సంఘాల నాయకులు కర్ణాటక బాగల్‌కోట్ జిల్లాలోని బనహట్టి పోలీస్ స్టేషన్లో ప్రకాష్ రాజ్‌పై కేసు ఫైల్ చేశారు. కానీ, బనహట్టి పోలీసులు ఈ కేసుకి సంబంధించి ప్రకాష్ రాజ్‌ను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం కీ పదాలను ఉపయోగించి వెతికితే, చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించి ప్రకాష్ రాజ్‌ సోషల్ మీడియా సైటు ‘X’లో పెట్టిన ఒక పోస్టుకి సంబంధించి అతనిపై కేసు నమోదైందని తెలిసింది. కర్ణాటక రాష్ట్రం బాగల్‌కోట్ జిల్లాలో ఈ కేసు నమోదైనట్టు తెలిసింది.   

ప్రకాష్ రాజ్ ‘X’లో పెట్టిన ట్వీట్ భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగాన్ని అపహాస్యం చేసే విధంగా ఉందని ఆరోపిస్తూ శివానంద్ గైక్వాడ్ అనే వ్యక్తి, మరి కొందరు హిందూ సంఘాల కార్యకర్తలతో కలిసి బాగల్‌కోట్ జిల్లాలోని బనహట్టి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. ఆ ఆర్టికల్స్‌ను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. కానీ, బనహట్టి పోలీసులు ఈ కేసుకి సంబంధించి ప్రకాష్ రాజ్‌ను అరెస్ట్ చేసినట్టు ఎక్కడ ఆధారాలు లేవు.

విక్రమ్ ల్యాండర్ చంద్రుడి నుంచి పంపుతున్న మొదటి ఫోటో’ అంటూ ఒక వ్యక్తి ఛాయ్ (టి) తయారుచేస్తున్న ఫోటోని షేర్ చేస్తూ ప్రకాష్ రాజ్ 20 ఆగస్టు 2023 నాడు ‘X’లో ఒక ట్వీట్ పెట్టారు.  ఈ ట్వీట్‌కు వస్తున్న వ్యతిరేకత గురించి ప్రకాష్ రాజ్ స్పందీస్తూ మరొక ట్వీట్ కూడా పెట్టారు. ద్వేషం ద్వేషాన్ని మాత్రమే చూస్తుంది అని, కేరళ ఛాయ్‌వాలాల గురించి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ రోజుల నుండి చేస్తున్న ఒక జోక్‌ను సూచించే విధంగా మాత్రమే ఆ ట్వీట్ పెట్టాను అని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. ఈ కేసు వివరాలను కర్ణాటక పోలీస్ వెబ్సైటులో అందుబాటులోకి పెట్టిన వెంటనే ఈ ఆర్టికల్‌ను అప్డేట్ చేస్తాము.

చివరగా, చంద్రయాన్-3 ప్రయోగాన్ని అపహాస్యం చేసే విధంగా ట్వీట్ పెట్టారని కర్ణాటకలో ఫైల్ అయిన కేసులో ప్రకాష్ రాజ్‌ను పోలీసులు ఇంకా అరెస్ట్ చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll