Fake News, Telugu
 

పాత ఫోటోలు పెట్టి, హాలీవుడ్ హీరో విల్ స్మిత్ హిందూ ధర్మాన్ని స్వీకరించినట్టు తప్పుగా ప్రచారం చేస్తున్నారు

0

‘క్రైస్తవ మతం అంత దౌర్బాగ్యం మతం ఇంకొకటి లేదు. అందుకే నేను హిందూ ధర్మాన్ని స్వీకరించాను’, అని హాలీవుడ్ హీరో విల్ స్మిత్ అన్నాడని చెప్తూ, కొన్ని ఫోటోలతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: హిందూ ధర్మాన్ని స్వీకరించినట్టు చెప్పిన హాలీవుడ్ హీరో విల్ స్మిత్. దానికి సంబంధించిన ఫోటోలు.

ఫాక్ట్: హిందూ ధర్మాన్ని స్వీకరించినట్టు విల్ స్మిత్ ఎక్కడా కూడా చెప్పలేదు. పోస్ట్ లోని ఫోటోలు విల్ స్మిత్ 2018 లో హరిద్వార్ సందర్శించినప్పుడు తీసినవి.  కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

హాలీవుడ్ హీరో విల్ స్మిత్ క్రైస్తవ మతాన్ని తప్పు బట్టి, హిందూ ధర్మాన్ని స్వీకరించాడా అని ఇంటర్నెట్ లో వెతకగా, పోస్ట్ లోని వ్యాఖ్యలు విల్ స్మిత్ చేసినట్టు ఎక్కడ కూడా సమాచారం  దొరకలేదు. తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో కూడా ఈ వ్యాఖ్యలు చేసినట్టు కనపడలేదు. పోస్ట్ లోని వ్యాఖ్యలు విల్ స్మిత్ చేసి ఉంటే, ప్రపంచంలోని మీడియా సంస్థలు అన్నీ ఆర్టికల్స్ ప్రచురించేవి. 2013 లో ఒక ఇంటర్వ్యూ లో ‘మీరు మతాన్ని అనుసరిస్తున్నారా?’ అనే ఒక ప్రశ్నకి బదులిస్తూ, ‘లేదు, మేము ప్రపంచ మతం యొక్క విద్యార్థులము. మేము అన్ని మతాలను గౌరవిస్తాము’, అని విల్ స్మిత్ సమాధానమిచ్చినట్టు ఇక్కడ చదవొచ్చు.

అంతేకాదు, 2007 లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘నేను బాప్టిస్ట్ ఇంట్లో పెరిగాను మరియు కాథలిక్ పాఠశాలకు వెళ్ళాను, కానీ బైబిల్ యొక్క ఆలోచనలు 98 శాతం సైంటాలజీ వలె అదే ఆలోచనలు; 98 శాతం బౌద్ధమతం మరియు హిందూ మతం వంటి ఆలోచనలు’, అని విల్ స్మిత్ అన్నాడు. ఇదే విషయం లిసా రాసిన విల్ స్మిత్ బయోగ్రఫీ బుక్ లో కూడ చదవొచ్చు.

పోస్ట్ లోని ఫోటోలు విల్ స్మిత్ 2018 లో హరిద్వార్ సందర్శించినప్పుడు తీసినవి. ఆ ఫోటోలను విల్ స్మిత్ తన ఇన్‌స్టాగ్రామ్ లో పెట్టుకున్నాడు. అయితే, ఎక్కడా కూడా తను హిందూ ధర్మాన్ని స్వీకరించినట్టు రాయలేదు.

‘విల్ స్మిత్స్ బకెట్ లిస్ట్’ ప్రోగ్రాం లో భాగంగా భారత్ కి వచ్చిన విల్ స్మిత్,  హరిద్వార్ ని సందర్శించాడు. ఆ ప్రోగ్రాం కి సంబంధించిన వీడియోని విల్ స్మిత్ తన ఫేస్బుక్ అకౌంట్ లో ఏప్రిల్ 2019 లో పోస్ట్ చేసిన్నట్టు ఇక్కడ చూడవొచ్చు. ఆ వీడియోలో తను ఆధ్యాత్మిక గురించి మాట్లాడినట్టు తెలుస్తుంది.

అయితే, హరిద్వార్ లో వేద జ్యోతిష్కుడు దగ్గర విల్ స్మిత్ జ్యోతిష్యం చూయించుకొని, జ్యోతిష్కుడు చెప్పిన విధంగా తగిన పూజలు నిర్వహించినట్టు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఆర్టికల్ లో చదవొచ్చు. విల్ స్మిత్ పర్యటన గురించి జ్యోతిష్కుడు చెప్పిన విషయాలను ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, హిందూ ధర్మాన్ని స్వీకరించినట్టు విల్ స్మిత్ ఎక్కడా కూడా చెప్పలేదు. పోస్ట్ లోని ఫోటోలు విల్ స్మిత్ 2018 లో హరిద్వార్ సందర్శించినప్పుడు తీసినవి.

Share.

About Author

Comments are closed.

scroll