Fake News, Telugu
 

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అయోధ్యలో రామ మందిర శంకుస్థాపన సందర్భంగా రాముడి విగ్రహానికి అభిషేకం చేయలేదు

0

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన, భూమి పూజ నిర్వహించిన శుభ సందర్భంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సతీసమేతంగా రాముడి బంగారు విగ్రహానికి అభిషేకం చేస్తున్న ఫోటో, అని షేర్ చేస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన శుభ సందర్బంలో బ్రిటన్ ప్రధాని సతీసమేతంగా రాముడి విగ్రహానికి అభిషేకం చేస్తున్న ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఫోటోలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అభిషేకం చేస్తున్నది శ్రీ నిల్కాంత్ వర్ని స్వామిజి విగ్రహానికి, రాముడి విగ్రహానికి కాదు. ఈ ఫోటో 2019లో బోరిస్ జాన్సన్ లండన్ లోని స్వామి నారాయణ మందిరాన్ని సందర్షించినప్పుడు తీసిన ఫోటో అని విశ్లేషణలో తెలిసింది. ఫోటోలో బోరిస్ జాన్సన్ తో కలిసి అభిషేకం చేస్తున్నది బ్రిటన్ హోంసెక్రటరీ, తన సతీమణి కాదు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ‘BAPS Swami Narayana Sanstha’ వారి అధికారిక వెబ్సైటులో ఈ ఫోటో దొరికింది. 2019లో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ లండన్ లోని స్వామి నారాయణ మందిరాన్ని సందర్షించినప్పుడు ఈ ఫోటో తీసినట్టు అందులో తెలిపారు. పోస్టులోని ఈ ఫోటోలో బ్రిటన్ ప్రధాని శ్రీ నిల్కంత్ వర్ని స్వామిజి విగ్రహానికి అభిషేకం చేస్తున్నట్టు అందులో తెలిపారు. కావున, ఫోటోలో కనిపిస్తున్నది రాముడి విగ్రహం కాదు.

ఫోటోలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తో పాటు అభిషేకం చేస్తున్నది  బ్రిటన్ హోం సెక్రటరీ ప్రీతి పాటిల్, బోరిస్ జాన్సన్ సతీమని కాదు. బోరిస్ జాన్సన్ తన భాగస్వామితో కలిసి నిల్కంత్ వర్ని స్వామిజి విగ్రహానికి అభిషేకం చేస్తున్న ఫోటోని అదే వెబ్సైటులో మనం చూడవచ్చు.

చివరగా, 2019లో బ్రిటన్ ప్రధాని హోం సెక్రటరీ తో కలిసి శ్రీ నిల్కాంత్ వర్ని స్వామిజి విగ్రహానికి అభిషేకం చేస్తున్న ఫోటోని చూపిస్తూ సతీసమేతంగా రాముడి విగ్రహానికి అభిషేకం చేస్తున్న బ్రిటన్ ప్రధాని, అని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll