Fake News, Telugu
 

గతంలో వేరే సందర్భంలో హిందూ ఆలయంపై జరిగిన దాడి వీడియోను ప్రస్తుతం జరుగుతున్న రైతు నిరసనలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.

0

ఇటీవల ఢిల్లీలో జరుగుతున్న రైతు అందోళనల నేపథ్యంలో హిందూ ఆలయంపై దాడి చేస్తున్న ఖలిస్తాన్ రైతు ఉగ్రవాదులు అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి మద్దతుగా హిందూ దేవాలయం పై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ఒకటి జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఇలాంటి మరొక పోస్ట్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న రైతు అందోళనలలో సిక్కు రైతులు హిందూ ఆలయంపై దాడి చేసారు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో 2022లో పంజాబ్‌లోని పాటియాలాలో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణను చూపుతుంది. 29 ఏప్రిల్ 2022న శివసేన మద్దతుదారులు పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలాలో ఖలిస్తాన్ వ్యతిరేక ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీ పాటియాలాలోని మంజీత్ నగర్‌లోని కాళీమాత ఆలయం వద్దకు చేరగానే ఖలిస్తాన్ మద్దతుదారులు శివసేన మద్దతుదారులతో ఘర్షణకు దిగిన దృశ్యాలను చూపిస్తున్న వీడియో ఇది. ఈ ఘర్షణలో ఖలిస్తాన్ మద్దతుదారులు కాళీమాత ఆలయం పై కూడా దాడి చేసారు, కానీ ఇది ప్రస్తుతం జరుగుతున్న రైతు నిరసనల నేపథ్యంలో చోటు చేసుకున్న సంఘటన కాదు మరియు రైతు నిరసనలకు ఎలాంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని అవధేష్ పారిక్ అనే వ్యక్తి తన ఫేస్‌బుక్ పేజీలో 29 ఏప్రిల్ 2022న పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియో పాటియాలా కాళీమాత ఆలయంపై ఖలిస్తాన్ మద్దతుదారులు దాడి చేస్తున్న దృశ్యాలుగా ఆయన పేర్కొన్నారు.

ఈ సమాచారం ఆధారంగా ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకితే, మాకు ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ పలు మీడియా రిపోర్ట్స్ (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) లభించాయి. ఈ రిపోర్ట్స్ ప్రకారం “29 ఏప్రిల్ 2022న, శివసేన మద్దతుదారులు పాటియాలాలో ఖలిస్తాన్ వ్యతిరేక ర్యాలీని చేపట్టారు.ఈ ర్యాలీ పాటియాలాలోని మంజీత్ నగర్‌లోని కాళీ టెంపుల్ దగ్గర చేరగానే ఖలిస్తాన్ మద్దతుదారుల కత్తులు మరియు రాళ్లతో శివసేన మద్దతుదారులు పై దాడి చేసారు.”

అలాగే 29 ఏప్రిల్ 2022న ఈ సంఘటన యొక్క వీడియోను ANI కూడా తమ X(ట్విట్టర్)లో  పోస్ట్ చేసింది.వైరల్ వీడియో మరియు వార్త సంస్థలు రిపోర్ట్ చేసిన అసలైన వీడియోను పోల్చి చూస్తే రెండు ఒకే సంఘటనను చూపిస్తున్నట్లు తెలుస్తుంది. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో ఏప్రిల్ 2022న పాటియాలాలోని కాళీమాత ఆలయం వద్ద జరిగిన ఘర్షణ దృశ్యాలను చూపిస్తున్నది అని నిర్థారించవచ్చు.

చివరగా, గతంలో వేరే సందర్భంలో హిందూ ఆలయంపై జరిగిన దాడి వీడియోను ప్రస్తుతం జరుగుతున్న రైతు నిరసనలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll