ప్రభుత్వ పాలసీలకి వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ప్రస్తుతం చేపట్టిన నిరసన నేపథ్యంలో, ఈ నిరసన ఉద్దేశాలని ప్రశ్నిస్తున్న ఒక మెసేజ్ మరియు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలో సిక్కు దుస్తులు ధరించిన కొందరు ఉన్నారు, వీరిలో ముందున్న వ్యక్తి ‘we want ‘Khalisthan’ (మాకు ఖలిస్థాన్ కావాలి) అని రాసి ఉన్న ఒక పోస్టర్ పట్టుకొని ఉన్నాడు. ‘… ప్రత్యేక దేశం ఖలిస్తాన్ ఇవ్వాలట. వీళ్ళను రైతులు అంటారా..??ఇది రైతు ఉద్యమమేనా..??’ అని చెప్తూ వైరల్ అవుతున్న ఈ ఫోటో వెనుక ఉన్న నిజానిజాలను ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసనలో ‘మాకు ఖలిస్థాన్ కావలి’ అనే పోస్టర్ పట్టుకొన్న ఒక రైతు నిరసనకారుడు.
ఫ్యాక్ట్(నిజం): ఈ ఫోటోకి ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసనకి ఎటువంటి సంబంధం లేదు. ఈ ఫోటో 2013లో తీసింది. 6 జూన్ 2013 నాడు ‘ఘల్లుఘర దివస్,’ ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ యొక్క 29వ వార్షికోత్సవం సందర్భంగా కొన్ని సిఖ్ సంస్థల కార్యకర్తలు సిక్కుల నాయకుడు జర్నైల్ సింగ్ భింద్రన్ వాలే కి మద్దతు తెలుపుతూ ‘we want ‘Khalisthan’’ (మాకు ఖలిస్థాన్ కావలి) అనే పోస్టర్ పట్టుకొన్నారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టిస్తుంది.
పోస్ట్‌లోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, అదే ఫోటోని కలిగి ఉన్న వార్తా కథనం ఒకటి దొరికింది. ఈ కథనంలో ప్రచురించబడిన చిత్రం AFPకి క్రెడిట్ చేయబడింది.
వార్తా కథనంలోని ఫోటో క్రెడిట్ నుండి హింట్ తీసుకొని, స్టాక్ ఫోటోగ్రఫీ వెబ్‌సైట్‌లో AFP కంట్రిబ్యూటెడ్ ఫోటోల కోసం వెతుకగా ‘గెట్టి ఇమేజెస్’లో ఉన్న ఇదే ఫోటోకి దారితీసింది.
ఈ ఫోటోతో పాటు ఉన్న వివరణ ప్రకారం, ఈ ఫోటో 2013లో అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ 29వ వార్షికోత్సవం సందర్భంగా క్లిక్ చేయబడింది. ఈ ఫోటోకి ప్రస్తుతం 2024లో ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనకి ఎటువంటి సంబంధం లేదని ఇది నిర్ధారిస్తుంది.
చివరిగా, ఖలిస్తాన్ అనుకూల నిరసనకి చెందిన ఒక పాత ఫోటీని ఇప్పుడు ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల నిరసనలకు తప్పుగా ఆపాదిస్తున్నారు.