Fake News, Telugu
 

యూపీలోని చందౌలిలో ‘జై శ్రీ రామ్’ నినాదాలు చేయనందుకు ముస్లిం బాలుడికి నిప్పంటించారు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు

0

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చందౌలిలో ఖాలీద్‌ అన్సారీ అనే ముస్లిం యువకుడు ‘జై శ్రీ రామ్’ అనలేదని కొంతమంది దుండగులు అతనిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారని సోషల్ మీడియాలో ఒక వార్త చలామణీ అవుతోంది. దాంట్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): యూపీ రాష్ట్రంలోని చందౌలిలో ఖాలీద్‌ అన్సారీ అనే ముస్లిం యువకుడు ‘జై శ్రీ రామ్’ అనలేదని కొంతమంది దుండగులు అతనిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు.

ఫాక్ట్ (నిజం): సంఘటనపై దర్యాప్తు జరిపిన ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఖాలీద్‌ అనే యువకుడు మరియు అతని కుటుంబం ఆరోపించిన విషయాలు నిరాధారమైనవీ మరియు కల్పితమైనవీ అనీ, వాస్తవానికి ఆ యువకుడే తనకు తాను నిప్పంటించుకున్నాడని వెల్లడించారు. కావున, పోస్ట్ లో పేర్కొన్న విషయాల్లో నిజం లేదు.      

గూగుల్ లో “chandauli muslim khalid torched” అని వెతికినప్పుడు, “The Hindu” వారు జులై 29, 2019న పోస్టులో ఆరోపించిన సంఘటన పై ప్రచురించిన కథనం లభించింది. దాంట్లో ఆ ఘటన పై దర్యాప్తు జరిపిన ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఖాలీద్‌ మరియు అతని కుటుంబం ఆరోపించినట్లుగా అతను ‘జై శ్రీ రామ్’ అని అననందుకు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారని చెప్పిన విషయం నిరాధారమైనదీ మరియు కల్పితమైనదీ అని పేర్కొన్నారు. వాస్తవానికి ఆ యువకుడే తనకు తాను నిప్పంటించుకున్నాడని కూడా పోలీసు వారు వెల్లడించారు.

ఆ సంఘటన గురించి మరింత సమాచారం కోసం వెతికినప్పుడు,  ట్విట్టర్ లో ఉత్తర్ ప్రదేశ్ పోలీస్ శాఖ వారు పెట్టిన ట్వీట్ లభించింది. అందులో కేసు దర్యాప్తు  చేసిన చందౌలి ఎస్పీ ఆ కేసు వివరాలను వెల్లడించిన వీడియోని పొందుపరిచి, ఈ క్రింది వివరణ ఇచ్చారు- “చందౌలిలో మతపరమైన నినాదాలు చేయనందుకు ముస్లిం యువకుడిని తగలబెట్టడం గురించి మాకు వార్తలు వచ్చాయి. ఆ సంఘటన గురించి మేము దర్యాప్తు చేసాము. మా దర్యాప్తులో ఆ ఆరోపణ నిరాధారమైనది మరియు కల్పితమైనదిగా తేలింది. సోషల్ మీడియాలో ఆ పుకార్లు వ్యాప్తి చేసేవారిపై చట్టపరమైన చర్య తీసుకోబడతాయి. ఎస్పీ చందౌలి సంతోష్ కె సింగ్”.

చివరగా, యూపీలోని చందౌలిలో ‘జై శ్రీ రామ్’ నినాదాలు చేయనందుకు ముస్లిం బాలుడికి నిప్పంటించారు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll