నెహ్రూ కుటుంబం ఇస్లాంకి చెందిందని ఒక పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది. ఆ పోస్ట్ లోని విషయాలు ఎం. ఓ. మథాయ్ (1946 మరియు 1959 మధ్య జవహర్‌లాల్ నెహ్రూ యొక్క ప్రత్యేక సహాయకుడు) వ్రాసిన ఆత్మ కథలో నుంచి తీసుకోబడ్డాయి అని పేర్కొన్నారు. ఆ పోస్ట్‌లో ప్రకటించిన విషయాలు మథాయ్ తన పుస్తకంలో వ్రాశారో లేదో కనుక్కుందాం.
క్లెయిమ్ : ఎం. ఓ. మథాయ్ తన ఆత్మకథలో నెహ్రూ కుటుంబం ఇస్లామిక్ వంశానికి చెందిందని వ్యాఖ్యానించారు.
ఫాక్ట్ (నిజం): అసలు ఎం.ఒ. మథాయ్ తన పుస్తకాలలో పోస్ట్‌లో పేర్కొన్నటువంటి వ్యాఖ్యలు ఎక్కడా చేయలేదు. అందువల్ల పోస్ట్‌లో చెప్పింది అబద్ధం.
గూగుల్‌లో మథాయ్ యొక్క ఆత్మకథ గురించి సెర్చ్ చేసినప్పుడు, అతను రెండు పుస్తకాలు రాసినట్లు తెలిసింది: ఒకటి ‘రెమినిసెన్సెస్ ఆఫ్ ది నెహ్రూస్ ఏజ్’ (1978 లో ప్రచురించబడింది), మరొకటి ‘మై డేస్ విత్ నెహ్రూ’ (1979 లో ప్రచురించబడింది). ఈ పుస్తకాల యొక్క ఆర్కైవ్ చేసిన టెక్స్ట్ వెర్షన్లను ఇక్కడ మరియు ఇక్కడ చదవవచ్చు. పోస్ట్‌లోని స్టేట్మెంట్లు ఈ పుస్తకాల నుండే తీసుకున్నారా లేదా అని పరిశీలిద్దాం. పోస్ట్‌లలోని స్టేట్మెంట్లను స్థూలంగా మూడు వర్గాలుగా విభజించవచ్చు :
1. నెహ్రూ మరియు ఇస్లామిక్ వంశం:
పోస్ట్‌లో, నెహ్రూ యొక్క అసలు తల్లిదండ్రులు ముబారక్ అలీ మరియు తుసు రెహ్మాన్ బాయి అని పేర్కొన్నారు. కానీ మథాయ్ రాసిన పుస్తకాలలో ఆ పేర్లను వెతికినప్పుడు, అలాంటి పేర్లు ఎక్కడ కనబడలేదు. మథాయ్ తన పుస్తకాలలో వారి గురించి ఏమీ రాయలేదు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వెబ్‌సైట్‌లో, జవహర్‌లాల్ నెహ్రూ 1889 లో మోతీలాల్ మరియు స్వరూప్ రాణి తుసు దంపతులకు జన్మించినట్లు చూడవచ్చు. అలాగే, నెహ్రూ యొక్క ఆత్మకథలో (టువర్డ్ ఫ్రీడమ్) తల్లిదండ్రుల పేర్లు ‘పండిట్ మోతీలాల్ నెహ్రూ’ మరియు ‘స్వరూప్ రాణి నెహ్రూ’ గా ఇవ్వబడ్డాయి (పుస్తకం యొక్క ఆర్కైవ్ చేసిన టెక్స్ట్ వెర్షన్ ఇక్కడ చదవవచ్చు).
నెహ్రూ యొక్క పూర్వీకులు ఇస్లాం అనుచరులు కావడం గురించి మథాయ్ ఏమీ వ్రాయలేదు. పోస్ట్‌లో, మోతీలాల్ తండ్రి అసలు పేరు గియాసుద్దీన్ అని, తరువాత అతను తన పేరును గంగాధర్ నెహ్రూగా మార్చుకున్నాడు అని పేర్కొన్నారు. కానీ, జవహర్‌లాల్ నెహ్రూ తన యొక్క ఆత్మకథలో తన తాత కాకుండా, తన పూర్వీకుడు రాజ్ కౌల్ తన కుటుంబ శ్రేణికి ‘నెహ్రూ’ (నహర్ నుండి, ఒక కాలువ) అనే పేరు పెట్టారు అని రాశారు. రాజ్ కౌల్ కూడా ముస్లిం కాదని, జవహర్ లాల్ నెహ్రూ యొక్క తాత పేర్లలో ‘పండిట్’ మరియు ‘నెహ్రూ’ ఉన్నాయని గమనించాలి. జవహర్‌లాల్ నెహ్రూ తాత పేరు ‘పండిట్ గంగా ధార్ నెహ్రూ’.
పోస్ట్‌లో, నెహ్రూ కుటుంబం 1857 తరువాత కాశ్మీర్‌కు వలస వెళ్లిందని పేర్కొన్నారు. ఈ వలసపై మథాయ్ తన పుస్తకంలో ఏమీ వ్రాయలేదు. నెహ్రూ తన యొక్క ఆత్మకథలో, అతని కుటుంబం 1857 తిరుగుబాటు తరువాత కాశ్మీర్‌కు కాకుండా ఆగ్రాకు వలస వెళ్లిందని రాశారు.
2. ఫిరోజ్ గాంధీ ముస్లిం:
మథాయ్ తన పుస్తకం ‘రెమినిసెన్సెస్ ఆఫ్ ది నెహ్రూస్ ఏజ్’ లోని 17వ చాప్టర్లో , ఫిరోజ్ గాంధీని ఒక పార్శి యొక్క కుమారుడు మరియు అతని తండ్రి అలహాబాద్ లో ‘లిక్కర్ యొక్క ప్రొవిజన్ వ్యాపారి’ అని వివరించారు. ఆయన తన పుస్తకాలలో ఫిరోజ్ గాంధీని ముస్లిం అని ఎక్కడా వర్ణించలేదు. మథాయ్, ఇందిరా గాంధీ పిల్లల ముస్లిం పేర్ల గురించి కూడా ఏమీ వ్రాయలేదు.
3. మహమ్మద్ అలీ జిన్నా మరియు షేక్ అబ్దుల్లా మోతీలాల్ నెహ్రూ కుమారులు:
పోస్ట్‌లో, మహమ్మద్ అలీ జిన్నా మోతీలాల్ యొక్క 4వ భార్యకు మరియు షేక్ అబ్దుల్లా మోతీలాల్ యొక్క 5వ భార్యకు జన్మించారు అని పేర్కొన్నారు. ఈ వాదనలు ఏవి మథాయ్ పుస్తకాలలో ప్రస్తావించబడలేదు. మోతీలాల్ మరియు జిన్నా జన్మించిన తేదీని పరిశీలిస్తే, మోతీలాల్ 1876లో కేవలం 15సంవత్సరాలు (జిన్నా జన్మించినప్పుడు) అని తెలుసుకోవచ్చు, కాని జిన్నా మోతీలాల్ యొక్క 4వ భార్యకు జన్మించాడని పోస్ట్ పేర్కొంది. ఇది అర్ధం లేని వాదనగా అనిపిస్తుంది. జిన్నా తండ్రి వివరాల కోసం చూసినప్పుడు, పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో జిన్నా తండ్రి జిన్నాభాయి పూంజా అని కనుక్కోబడింది . కావున, ఈ వాదనలు కూడా నిజం కాదు.
మథాయ్ తన పుస్తకాలలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నది నిజం అయినా , ఈ పోస్ట్‌లోని వాదనలు ఏవీ అతని పుస్తకాలలో కనిపించవు. అలాగే, పుస్తకం యొక్క రివ్యూల లో దేంట్లోను పోస్ట్‌లోని విషయాలు ప్రస్తావించలేదు (పుస్తకాలపై రివ్యూలు ఇక్కడ మరియు ఇక్కడ చదవవచ్చు).
కావున, ఎం. ఓ. మథాయ్ తన పుస్తకాలలో నెహ్రూ కుటుంబం గురించి పోస్ట్ లో పేర్కొన్న వ్యాఖ్యలు ఏవీ చేయలేదు.
మీరు ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా కొత్త వీడియో చూసారా?