కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానంతరం, పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ 13 మే 2023న ఆ పార్టీని అభినందిస్తూ ఒక ట్వీట్ చేశారనే క్లైముతో ఓ స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్ణాటకలో ఇస్లామ్ మతం ప్రభావాన్ని పెంపొందించటానికి, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డిపిఐ)తో కాంగ్రెస్ సహకారం కోసం ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు, ఈ ట్వీటులో ఉంది. అసలు ఈ ట్వీట్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినందుకు అభినందిస్తూ 13 మే 2023న పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ట్వీట్ చేసారు. కర్ణాటకలో ఇస్లాం ప్రభావాన్ని బలోపేతం చేయడానికి SDPIతో కలిసి కాంగ్రెస్ పని చేయవచ్చని తను అందులో చెప్పారు.
ఫాక్ట్(నిజం): 13 మే 2023న గానీ, ఇంకెప్పుడైనా గానీ కర్ణాటకలో కాంగ్రెస్ విజయం లేదా SDPIకి సంబంధించి షాబాజ్ షరీఫ్ ఎటువంటి ట్వీట్ చేయలేదు. కావున పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.
మొదటగా, ఈ క్లెయిమ్ గురించి భారత్ లేదా పాకిస్తాన్‌లోని విశ్వసనీయ మీడియా సంస్థలు ఏమైనా వార్తా కథనాలు ప్రచురించాయా అని ఇంటర్నెట్లో వెతికాము. కానీ మాకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఆ తర్వాత, మేము పాకిస్తాన్ ప్రధాని యొక్క ట్విట్టర్ ఖాతాలో ఈ ట్వీటు కోసం పరిశీలించి చూసాము. కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం గురించి లేదా SDPI గురించి మే 13న గానీ, ఇంకెప్పుడైనా గానీ ఎటువంటి ట్వీట్ ఆయన చేసినట్లు అందులో లేదు.

13 మే నాటి అతని ట్విట్టర్ ప్రొఫైల్ యొక్క ఆర్కైవ్ చేసిన స్నాప్‌షాట్‌లో కూడా అలాంటి ట్వీట్ ఏదీ లభించలేదు.

ఇంకా, ట్రూత్ నెస్ట్ మరియు సోషల్ బ్లేడ్ వంటి సోషల్ మీడియా అనలిటిక్స్ టూల్స్ ఆయన 13 మే 2013న కేవలం మూడు ట్వీట్లు మాత్రమే చేశారని సూచిస్తున్నాయి, అవన్నీ పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాలకు సంబంధించినవి. వైరల్ పోస్టులో చెప్తున్న ట్వీట్ అసలు ఆయన ఎప్పుడూ చేయలేదని ఈ పరిశోధనల ద్వారా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంతే కాక అది ఒకప్పుడు చేసి ఇప్పుడు డిలీట్ చేసారు అనే అవకాసం కూడా లేదు, ఎందుకంటే 13న తను మూడు ట్వీట్లు మాత్రమే చేసారు గనుక.

చివరిగా, పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించినందుకు కాంగ్రెస్ పార్టీని అభినందిస్తూ మరియు SDPIతో సహకారాన్ని ప్రతిపాదిస్తూ ట్వీట్ చేసారని క్లెయిమ్ చేస్తూ, ఈ పోస్టు ఒక నకిలీ స్క్రీన్‌షాట్‌ని షేర్ చేస్తున్నారు.