Fake News, Telugu
 

KPHB కాలనీ లోని హిందూ దేవాలయం పక్కన స్థలంలో ఉన్నది ముస్లిం జెండా కాదు, బంజారాలది

0

హైదరాబాద్ లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (KPHB) లో హిందూ దేవాలయం పక్కన ఉన్న స్థలాన్ని కబ్జా చేయడానికి ముస్లిం మతస్తులు జెండా పాతారని చెప్తూ, ఒక ఫోటోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులో హిందూ దేవాలయం పక్కన ఉన్న స్థలాన్ని కబ్జా చేయడానికి ముస్లింలు జెండా పాతారు. 

ఫాక్ట్ (నిజం): ఆ ఫోటో కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులో హిందూ దేవాలయం పక్కన ఉన్న స్థలానిదే, కానీ అది ముస్లిం జెండా కాదు. అంతేకాదు, ఆ జెండాని స్థలం కబ్జా చేయడానికి పెట్టలేదు. ప్రతి సంవత్సరం ఆ స్థలంలో బంజారా గిరిజనలు తీజ్ పండుగ (మొలకల పండుగ) మరియు సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు జరుపుకుంటారు. ఆ జెండా వాళ్ళకి సంబంధించినది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.    

పోస్ట్ చేసిన ఫోటోలో చూపెట్టిన స్థలానికి FACTLY బృందం వెళ్లి చూడగా, అక్కడ అలాంటి జెండానే ఉన్నట్టు తెలిసింది. ఆ జెండా గురించి చుట్టుప్రక్కన వారిని అడగగా, దానిని బంజారా గిరిజనలు పెట్టినట్టు తెలిపారు. ఆ గ్రౌండ్ జీహెచ్ఎంసీ (GHMC) వారిది. ప్రతి ఏటా ఆ గ్రౌండ్ లో బంజారా గిరిజనలు తీజ్ పండుగ (మొలకల పండుగ) మరియు సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు జరుపుకుంటారని, ఆ జెండా వాళ్ళకి సంబంధించినదని స్తానికులు తెలిపారు. జెండా ఫోటో తప్పుగా వైరల్ అవ్వడంతో FACTLY వెళ్లేసరికి ఆకుపచ్చ జెండా తీసేసారు, ప్రస్తుతం కేవలం తెల్లజెండా ఉంది. తెల్లజెండా చుట్టుప్రక్కల పూజా సామాగ్రి ఉన్నట్టు ఫోటోలో చూడవొచ్చు. ఒకవేళ ముస్లింలు అక్కడ మసీదు కట్టడానికి జెండా పెడితే, దీపాలు పెట్టి పూజ ఎందుకు చేస్తారు?

18 ఫిబ్రవరి 2020న ఆ గ్రౌండ్ లో సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు జరుపుకున్నట్టు వివిధ వార్త పత్రికల స్థానిక ఎడిషన్ లో వచ్చిన వార్తలను కింద చూడవొచ్చు. ఆ వార్తల్లోని ఫోటోలో ఆకుపచ్చ జెండా కూడా చూడవొచ్చు. అంతేకాదు, వేరేచోట్ల సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో కూడా ఆకుపచ్చ జెండా మరియు చంద్రుడు ఆకారంతో ఉన్న జెండా వాడడం ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు

గ్రౌండ్ ప్రక్కనే ఉన్న దేవాలయం పూజారులతో FACTLY మాట్లాడగా, వారు కూడా ఆ జెండా గిరిజనలు ఉత్సవానికి సంబంధించినదని తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను నమ్మవద్దని, ఆ జెండా వేరే మతస్తులది కాదని వారు తెలుపుతూ FACTLY వారికి ఇచ్చిన వీడియో బైట్లను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. బంజారా వర్గానికి చెందిన నాయకులు కూడా మాట్లాడుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసేజ్ లో నిజం లేదని తెలిపారు. వారు FACTLY తో మాట్లాడిన వీడియోని ఇక్కడ చూడవొచ్చు.

ఆ గ్రౌండ్ లో ఇంతకముందు సంవత్సరాల్లో జరిగిన బంజారా గిరిజనల తీజ్ పండుగకి సంబంధించిన పాంప్లెట్లు మరియు పోలీసు పర్మిషన్ కి సంబంధించిన లెటర్లను కూడా FACTLY సంపాదించింది. వాటిని కింద చూడవొచ్చు.

ఢిల్లీలో అల్లర్లు జరుగుతున్న సంధర్బంగా, హైదరాబద్ లో కూడా మతకల్లోలాలు సృష్టించే విధంగా ఇలాంటి తప్పుడు పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి తప్పుడు వదంతులు షేర్ చేయవద్దని నిన్న హైదరాబాద్ కమీషనర్ కూడా ట్వీట్ చేసారు.

చివరగా, KPHB కాలనీ లోని హిందూ దేవాలయం పక్కన స్థలంలో ఉన్నది ముస్లిం జెండా కాదు. ఆ జెండాని స్థలం కబ్జా చేయడానికి పెట్టలేదు. ఆ జెండా బంజారాలకి సంబంధించింది.

సోషల్ మీడియా లేదా వాట్స్ఆప్ లో ఇలాంటి అనుమానస్పద వార్తలు మీకు వస్తే, షేర్ చేసేముందు FACTLY వాట్సాప్ నెంబర్ 9603132132 కి పంపించండి. వాటిల్లో ఎంతవరకు నిజం ఉందో చెప్పడానికి ప్రయత్నిస్తాము.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll