Fake News, Telugu
 

భారతదేశంలోని హిందువులకు తెలియకుండా మీడియా దాచేసిన విషయాలంటూ ఈ పోస్టులో చెప్తున్న విషయాలన్నీ దాదాపు అసత్యాలు మరియ నిరాధార ఆరోపణలు మాత్రమే.

0

భారతదేశంలోని హిందువులకు తెలియకుండా మీడియా దాచేసిన విషయాలంటూ పలు అంశాల గురించి ప్రస్తావించిన  పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ‘గాంధీ అనుకుంటే భగత్ సింగ్ ను కాపాడగలిగే వారు. కానీ ఎందుకు కాపాడ లేదు; భారత్‌లో 1947లో సమయంలో 7.88 శాతం ముస్లింలు మాత్రమే ఉండే వారు, ప్రస్తుతం వారు 18.8 శాతం ఉన్నారు; జవహర్లాల్ నెహ్రూ తాత ఒక ముస్లిం (ఘియాషుద్దీన్ గాజీ)  కానీ మనకు చరిత్రలో తప్పుగా చూపించారు’. ఇలా అనేక అంశాల గురించి ఈ పోస్టులో ప్రస్తావించారు. అలాగే గాంధీ కుటుంబానికి సంబంధించి ఎవరికీ తెలియని నిజాలంటూ సోనియా, రాహుల్ మరియు ప్రియాంకా గాంధీకి సంబంధించి పలు  అంశాల గురించి కూడా ఈ పోస్టులో ప్రస్తావించారు. ఈ కథనం ద్వారా పోస్టులో చెప్తున్న వివిధ అంశాలలో నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: భారతదేశంలోని హిందువులకు తెలియకుండా మీడియా దాచేసిన విషయాలు.

ఫాక్ట్(నిజం): హిందువులకు తెలియకుండా మీడియా దాచేసిన విషయాలంటూ వైరల్ పోస్టులో ప్రస్తావించిన అనేక అంశాలలో చాలావరకు పూర్తి అవాస్తవాలు కాగా, కొన్ని వ్యతిగత అభిప్రాయాలు మాత్రమే. ఈ అభిప్రాయాలు నిజమనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఆలాగే పోస్టులో గాంధీ పరివారం గురించి చేసిన క్లెయిమ్స్ కూడా అవాస్తవాలు మరియు ఊహాగానాలు మాత్రమే. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో హిందువులకు తెలియకుండా మీడియా దాచేసిన విషయాలంటూ అనేక అంశాల గురించి ప్రస్తావించారు. ఐతే వీటిలో కొన్ని పూర్తిగా అవాస్తవాలు కాగా, చాలావరకు వ్యక్తిగత అభిప్రాయాలే. ఈ అభిప్రాయాలకు మద్దతుగా ఎటువంటి ఆధారాలు లేవు. పోస్టులో పేర్కొన్న కొన్ని అంశాల గురించి  కింద క్లుప్తంగా చూద్దాం.

రాజ్యాంగం ప్రకారం 10% కంటే తక్కువ ఉన్న వారినే  అల్ప సంఖ్యాకులు అంటారు:

కేవలం 10% కన్నా తక్కువ ఉన్న వారినే అల్ప సంఖ్యాకులుగా (మైనారిటీస్) పరిగణించాలని రాజ్యాంగంలో ఎక్కడ కూడా పేర్కొనలేదు. నిజానికి పలు ఆర్టికల్స్‌లో మైనారిటీలు అనే పదం వాడారే తప్ప, రాజ్యాంగంలో మైనారిటీలు అనే పదాన్ని ఎక్కడ నిర్వచించలేదు.

ప్రస్తుతానికి, జాతీయ మైనారిటీ కమిషన్ చట్టం,1992లోని సెక్షన్ 2(సి) కింద కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన వర్గాలను మాత్రమే మైనారిటీలుగా పరిగణిస్తున్నారు.

ఈ సెక్షన్ కింద 1993లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు మరియు పార్సీలను గుర్తించింది. తిరిగి 2014లో జైనులను ఈ జాబితాలోకి చేర్చింది. ప్రస్తుతం ఈ వార్గాలనే మైనారిటీలుగా పరిగణిస్తారు.

గాంధీ అనుకుంటే భగత్ సింగ్‌ను కాపాడగలిగే వారు, కానీ కాపాడలేదు:

భగత్ సింగ్‌కు విధించిన ఉరి శిక్షను రద్దు చేయడానికి గాంధీ ప్రయత్నించలేదన్నది తప్పుడు వాదన. భగత్ సింగ్‌కు విధించిన ఉరి శిక్షను రద్దు చేయాలని కోరుతూ గాంధీ పలు సార్లు బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖలు రాసారు.

మరణశిక్ష అనేది వ్యక్తి మారడానికి అవకాశం ఇవ్వదని, భగత్ సింగ్‌కి విధించిన ఉరి శిక్షని సస్పెండ్ చేయాలనీ కోరుతూ, అక్టోబర్ 1930లో గాంధీ ఇర్విన్‌తో అన్నాడు.

భగత్ సింగ్‌ని ఉరి తీసే రోజు కొన్ని గంటల ముందు కూడా గాంధీ భగత్ సింగ్‌ ఉరి శిక్షని ఆపడానికి ప్రయత్నం చేసాడు, ఉరి శిక్షను రద్దు చేయాలని కోరుతూ అప్పటి వైస్రాయ్‌ లార్డ్ ఇర్విన్‌కు లేఖ రాసాడు.

జవహర్‌లాల్ నెహ్రూ తాత ఒక ముస్లిం (ఘియాషుద్దీన్ గాజీ)  కానీ మనకు చరిత్రలో తప్పుగా చూపించారు

జవహర్‌లాల్ నెహ్రూ 1889లో మోతీలాల్ మరియు స్వరూప్ రాణి తుస్సు దంపతులకు జన్మించారు. అలాగే జవహర్‌లాల్ నెహ్రూ తాత పేరు ‘పండిట్ గంగాధర్ నెహ్రూ’. నెహ్రూ ఒక హిందూ కుటుంబంలో జన్మించాడు. జవహర్‌లాల్ నెహ్రూ ఆటోబయోగ్రఫీలో ఈ విషయాలు స్పష్టంగా పేర్కొన్నారు.

పోస్టులో చెప్తున్నట్టు నెహ్రూ పూర్వికులు ముస్లింలన్నది పూర్తిగా అవాస్తవం, దీనికి ఎటువంటి ఆధారాలు లేవు. నెహ్రూ పూర్వికులు ముస్లింలని, నెహ్రూ తాత ఘియాషుద్దీన్ గాజీ అని 2015లో జవహర్‌లాల్ నెహ్రూ వికీపీడియా పేజీలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఎడిట్ చేసారు. ఐతే ఈ ఎడిట్ చేసింది ప్రభుత్వానికి చెందిన IP అడ్రస్ నుండి కావడంతో అప్పట్లో ఒక వివాదం జరిగింది. ఐతే నెహ్రూ పూర్వికులు ముస్లింలన్న వాదన అవాస్తవం.

భారత్‌లో 1947లో సమయంలో 7.88% ముస్లింలు మాత్రమే ఉండే వారు, ప్రస్తుతం వారు 18.8% ఉన్నారు

దేశ విభజన సమయంతో పోల్చుకుంటే దేశంలో ముస్లింల జనాభా పెరిగిన మాట నిజమైనప్పటికి, వారి జనాభాకు సంబంధించి పోస్టులో తెలిపిన వివరాలు కరెక్ట్ కాదు.

సాధారణంగా జనాభా వివరాలకు సంబంధించిన వ్యవహారాలకు పదేళ్ళ కొకసారి నిర్వహించే జనాభా లెక్కలే (సెన్సస్) ప్రాతిపదిక. ఐతే దేశంలో మొదటిసారిగా 1951లో నిర్వహించిన సెన్సస్ లెక్కల ప్రకారం ఆ సమయంలో దేశ జనాభాలో ముస్లింల వాటా 9.4% కాగా, చివరిసారిగా 2011లో నిర్వహించిన సెన్సస్ లెక్కల ప్రకారం ముస్లింల వాటా 14.2%.

ఐతే పైన చెప్పినట్టు స్వతంత్ర వచ్చిన సమయంతో పోల్చుకుంటే దేశంలో ముస్లింల జనభా పెరిగినప్పటికీ, వైరల్ పోస్టులో తమ వాదనకు అనుకూలంగా ముస్లింల జనాభా వివరాలను కాస్త ఎక్కువ చేసి చూపించారు.

అలాగే పోస్టులో గాంధీ కుటుంబం (రాజీవ్, సోనియా, ప్రియాంక మొదలైన) గురించి అనేక క్లెయిమ్స్ చేసారు. ఐతే వీటిలో కూడా చాలా వరకు అసత్యాలు కాగా, కొన్ని అంశాలకు సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం గాని లేదా డాక్యుమెంటరీ ఆధారాలుగానీ లేవు. వీటిని పూర్తిగా ఊహాగానాలుగానే పరిగణించాల్సి ఉంటుంది.

రాజీవ్‌గాంధీ హత్యలో కాంగ్రెస్‌కి చెందిన ఒక్క లీడరు కూడా చనిపోలేదు/గాయపడలేదు

రాజీవ్‌గాంధీ హతమార్చేందుకు జరిగిన దాడిలో మొత్తం 14 మంది మరణించారు. ఐతే ఈ 14 మందిలో కనీసం ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. సంథానీ బేగం (దక్షిణ చెన్నై మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు), పి. మునుసామి (తమిళనాడు శాసన మండలి సభ్యుడు), లతా కన్నన్ ( మహిళా కాంగ్రెస్ కార్యకర్త), వీరు ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారే.

అసలు రాజీవ్ గాంధీ ఎన్నికల ప్రచారం కోసం శ్రీపెరంబుదూర్ వెళ్ళాడు. ఐతే అప్పుడు జరిగిన దాడిలో కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి మరగతం చంద్రశేఖర్, ఎవరికోసమైతే రాజీవ్ గాంధీ ప్రచారం చేయడానికి వెళ్ళాడో, ఆమె కూడా ఈ ఘటనలో గాయపడింది.

కేవలం రాజీవ్ గాంధీపై దాడి జరిగిన మీటింగ్ మినహాయిస్తే మిగత అన్ని మీటింగ్‌లలో రాజీవ్‌తో పాటు సోనియా పాల్గొంది

పోస్టులో రాజీవ్ గాంధీ తన జీవిత కాలంలో మొత్తం 181 పబ్లిక్ మీటింగ్‌లలో పాల్గోనట్టు పేర్కొన్నారు. కాని ఈ వాదనను సమర్ధించడానికి ఎటువంటి ఆధారాలు లేవు. రాజీవ్ గాంధీ ఎన్ని మీటింగ్‌లలో పాల్గోన్నాడనే వివరాలు ఎక్కడా రికార్డు అయ్యి లేవు.

అలాగే రాజీవ్ గాంధీ పాల్గొన్న అన్ని మీటింగ్‌లలో ఆయనతో పాటు సోనియా గాంధీ కూడా ఉండేది అనడానికి కూడా ఎటువంటి ఆధారాలు లేవు.

పార్లమెంట్ మీద దాడి జరిగిన రోజు సోనియా గాంధీ పార్లమెంట్‌కు వెళ్ళలేదు:

2001లో పార్లమెంట్‌పై తీవ్రవాద దాడి జరిగిన రోజు నిజానికి సోనియా గాంధీ పార్లమెంట్‌కు హాజరైయ్యారు. కాని దాడి జరిగే సమయానికి ముందే ఆమె వెళ్ళిపోయినట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి.

దాడి జరిగే సమయానికన్నా ముందే అప్పటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మరియు ప్రతిపక్ష నేత సోనియా గాంధీ వెళ్లిపోయారని వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఒకవేళ పోస్టులో ఆరోపిస్తున్నట్టు ఈ దాడిలో సోనియా గాంధీ ప్రమేయం ఉంది ఉంటే, దాడికి సంబంధించిన విచారణలో ఈ విషయం తెలిసేది, కాని ఈ దాడితో సోనియా గాంధీకి సంబంధం ఉన్నట్టు ఎటువంటి రిపోర్ట్స్ గానీ, ఆధారాలు గానీ లేవు.

చివరగా, గాంధీ కుటుంబం గురించి మరియు భారతదేశంలోని హిందువులకు తెలియకుండా మీడియా దాచేసిన విషయాలంటూ ఈ పోస్టులో చెప్తున్న విషయాలన్నీ అసత్యాలు మరియ నిరాధార ఆరోపణలు మాత్రమే.

Share.

About Author

Comments are closed.

scroll