Fake News, Telugu
 

డబ్బు తిరిగి ఇవ్వమని అడిగినందుకు దళిత మహిళపై దాడి చేసిన ఘటనను శివాలయంలోకి ప్రవేశించినందుకు ఆమెను కొట్టినట్టుగా ప్రచారం చేస్తున్నారు

0

మహారాష్ట్రలో దళిత మహిళ శివాలయంలోనికి ప్రవేశించిందని ఆమెను హిందుత్వ సంస్థల కార్యకర్తలు దారుణంగా కొట్టి చంపేసిన దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మహారాష్ట్రలో శివాలయం లోపలికి ప్రవేశించినందుకు ఒక హిందూ దళిత మహిళను హిందుత్వ సంస్థలు కొట్టి చంపేసిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పశువుల మేత కోసం తాను ఇచ్చిన రూ. 2000లను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసినందుకు దళిత వితంతువు మహిళను నలుగురు వ్యక్తులు దారుణంగా కొట్టిన ఘటనను ఈ వీడియో చూపిస్తుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని పన్వాన్ అనే గ్రామంలో 26 ఆగస్టు 2023 నాడు చోటుచేసుకుంది. ఆలయంలోకి ప్రవేశించినందుకు ఈ దళిత మహిళను కొట్టారని చేస్తున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Mumbai Tak’ వార్తా సంస్థ 28 ఆగస్టు 2023 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఒక దళిత మహిళను నలుగురు వ్యక్తులు దారుణంగా కొట్టిన దృశ్యాలంటూ ఈ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.

మహారాష్ట్రలోని సతారా జిల్లాలో పశువుల మేత కోసం ఇచ్చిన డబ్బుని తిరిగి తనకు ఇవ్వాలని డిమాండ్ చేసినందుకు దళిత మహిళను దారుణంగా కొట్టారంటూ ప్రకాష్ అంబేద్కర్ ఈ వీడియోని 31 ఆగస్టు 2023 నాడు ట్వీట్ పెట్టారు. వంచిత్ బహుజన్ అఖాడి (VBA) ఈ కేసుకి సంబంధించి ఫిర్యాదు కూడా ఇచ్చినట్టు తెలిసింది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుపుతు పబ్లిష్ చేసిన వార్తా కథానాలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ ఘటన మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని పన్వాన్ అనే గ్రామంలో 26 ఆగస్టు 2023 నాడు చోటుచేసుకుందని ఈ వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. పశువుల మేత కోసం తాను ఇచ్చిన రూ. 2000లను తిరిగి ఇవ్వాలని దేవదాస్ నారాలే అనే వ్యక్తిని ఈ దళిత వితంతువు మహిళ అడిగినప్పుడు, అగ్ర కులానికి చెందిన దేవదాస్ నారాలే, మరో ముగ్గురితో కలిసి ఆమెను దారుణంగా గ్రామ ప్రజలందరి ముందు కొట్టినట్టు ఈ వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి.    

ఈ ఘటనకు సంబంధించి సతారా జిల్లాలోని మ్హస్వాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిసింది. ఈ ఘటనలో పాల్గొన్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు పలు వార్తా సంస్థలు రిపొర్ట్ చేశాయి. ప్రస్తుతం ఈ ఎఫ్ఐఆర్ కాపీని మహారాష్ట్ర పోలీస్ వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు. ఎఫ్ఐఆర్ కాపీని మహారాష్ట్ర పోలీస్ వెబ్సైట్లో అందుబాటులోకి ఉంచిన వెంటనే ఈ వెబ్సైటుని అప్డేట్ చేస్తాము.

చివరగా, డబ్బు తిరిగి ఇవ్వమని అడిగినందుకు దళిత మహిళపై దాడి చేసిన ఘటనను శివాలయంలోకి ప్రవేశించినందుకు ఆమెను కొట్టినట్టుగా ప్రచారం చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll