Fake News, Telugu
 

అఖిలేష్ యాదవ్ 15,000 కోట్లుగా నిర్ణయించిన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే వ్యయాన్ని యోగి ఆదిత్యనాథ్ 3,400 కోట్లకు సవరించాడన్న వాదన పూర్తిగా అవాస్తవం

0

‘పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ హైవేను గత ప్రభుత్వ హాయాంలో అఖిలేష్ యాదవ్ 15,200 కోట్ల రూపాయలకు ఒక కాంట్రాక్టర్‌కి ఇవ్వగా, ఆ కాంట్రాక్ట్ ను యోగి ఆదిత్యనాథ్ రివ్యూ చేసి కేవలం 3,400 కోట్లకు ఇతర కాంట్రాక్టర్‌తో చేయిస్తున్నారని’ చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఒక కాంట్రాక్టర్‌కి అఖిలేష్ యాదవ్ ఇచ్చిన 15,200 కోట్ల పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే కాంట్రాక్టుని, యోగి ఆదిత్యనాథ్ రివ్యూ చేసి ఇతర  కాంట్రాక్టర్‌కి కేవలం 3,400 కోట్లకే ఇచ్చాడు.

ఫాక్ట్ (నిజం): గతంలో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ హైవే వ్యయాన్ని సుమారు 19,500 కోట్లగా తీర్మానించి, 6 కంపెనీలను పనుల కోసం టెండర్ల ద్వారా సెలెక్ట్ చేసింది. ఐతే ఈ కంపెనీలకు టెండర్లు అందించేలోపే ఎలక్షన్ కోడ్ మొదలు కావడంతో ఆ ప్రక్రియ అక్కడికే ఆగిపోయింది. ఆ తర్వాత వచ్చిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం జారీ చేసిన టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్ల ద్వారా వేరే కంపెనీలను ఈ ప్రాజెక్ట్ పనుల కోసం సెలెక్ట్ చేసింది. పైగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కాబినెట్ తీర్మానం ద్వారా ఈ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే వ్యయాన్ని సుమారు 23,000 కోట్లుగా నిర్ణయించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఈశాన్య ప్రాంతాన్ని రాష్ట్ర రాజధాని లక్నోతో అనుసంధానించే ఉద్దేశంతో రాష్ట్రంలోని బల్లియా-లక్నో వరకి సుమారు 350 కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్ వేని నిర్మంచాలని ఇంతకు ముందున్న అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే 30 మార్చ్ 2016న ఉత్తర్ ప్రదేశ్ కాబినెట్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ ప్రాజెక్ట్‌ని 8 ప్యాకేజీల కింద విభజించి, సుమారు 19,500 కోట్ల వ్యయంతో EPC (ఇంజనీరింగ్, ప్రోక్యూర్మెంట్, కన్‌స్ట్రక్షన్, PPP) పద్ధతిలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలని ఈ తీర్మానం యొక్క సారాంశం. ఈ ప్రాజెక్ట్‌కి సమాజ్‌వాది పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే అని పేరు పెట్టగా, ఉత్తరప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వేస్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (UPEIDA)ని నోడల్ ఏజెన్సీగా నియమించారు.       

అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం 2015లో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియని మొదలుపెట్టి 2016 చివరిలో ఈ 8 ప్యాకేజీల నిర్మాణం కోసం టెండర్ పద్ధతి ద్వారా 6 సంస్థలను సెలెక్ట్ చేసింది. ఇంతలోపే ఎలక్షన్ కోడ్ అమలుకావడంతో ఈ సంస్థలకు టెండర్లను అందించలేదు, ఆ ప్రక్రియ అక్కడితో ఆగిపోయింది. దీన్నిబట్టి అఖిలేష్ యాదవ్ 15,200 కోట్ల పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ హైవే కాంట్రాక్టుని ఒక కాంట్రాక్టర్‌కి ఇచ్చాడన్న వాదన పూర్తిగా అవాస్తవం అని స్పష్టంగా తెలుస్తుంది.

ఐతే ఆ తర్వాత వచ్చిన ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌కి అవసరమైన స్థల సేకరణ ఇంకా జరగలేదన్న కారణంతో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం జారీ చేసిన టెండర్లను 2017లో రద్దు చేసి కొత్త టెండర్లను జారీ చేసి, 2018లో కొత్త టెండర్ల ద్వారా వేరే సంస్థలను ఈ ప్రాజెక్ట్ పనుల కోసం సెలెక్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే 2018లో ఒక కాబినెట్ తీర్మానం ద్వారా ఈ ప్రాజెక్ట్ పేరుని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేగా మర్చి, ప్రాజెక్ట్ వ్యయాన్ని సుమారు 23,000 కోట్లుగా నిర్ణయించింది.

ఉత్తర ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వేస్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (UPEIDA) వెబ్సైటులో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి భూ సేకరణ, వ్యయం, పనుల కరెంటు స్టేటస్, మొదలైన సమగ్ర సమాచారం అందుబాటులో ఉంది. ఐతే ఈ వెబ్సైటులో ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ. 22,500 కోట్లని స్పష్టంగా పేర్కొన్నారు. దీన్నిబట్టి యోగి ఆదిత్యనాథ్ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే కాంట్రాక్టుని 3,400 కోట్లకి సవరించిందన్న వాదన కూడా పూర్తిగా అవాస్తవం అని అర్ధమవుతుంది.

చివరగా, అఖిలేష్ యాదవ్ 15,000 కోట్లుగా నిర్ణయించిన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే వ్యయాన్ని యోగి ఆదిత్యనాథ్ 3,400 కోట్లకు సవరించాడన్న వాదన పూర్తిగా అవాస్తవం.

Share.

About Author

Comments are closed.

scroll