మానవులు కోతి నుండి పరిణామం చెందలేదని అమెరికాలోని యేల్ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారంటూ సోషల్ మీడియాలో ఒక వార్తా కథనం స్క్రీన్ షాట్ షేర్ అవుతోంది. ఇస్లాం మత గ్రంధం ఖురాన్ 1400 సంవత్సరాలకు ముందు కనుగొన్న విషయాన్ని ఆధునిక సైన్స్ ఇప్పుడు కనుగొనగలిగిందని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: మానవులు కోతి నుండి పరిణామం చెందలేదని యేల్ యూనివర్సిటీ పరిశోధకులు దృవీకరించారు.
ఫాక్ట్ (నిజం): మానవ పూర్వీకులుగా భావించే ప్రైమేట్ జాతుల (కోతి, చింపాంజీ మొదలగు) మెదడు కన్నా మనుషుల మెదడు ఉన్నతమైన జన్యువు, ఇతర లక్షణాలు కలిగి ఉంటాయని మాత్రమే యేల్ యూనివర్సిటీ పరిశోధనలో తెలిపారు. కోతి మరియు చింపాంజీల మెదడు కన్నా మనుషుల మెదడు మూడింతలు పెద్దదని, విభిన్నమైన జన్యువులను కలిగి ఉంటుందని యేల్ యూనివర్సిటీ పరిశోదకులు తెలిపారు. చార్లెస్ డార్విన్ థియరీని తోసిపుచ్చుతూ మానవులు కోతి నుండి పరిణామం చెందలేదని యేల్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వార్తా కథనం ఫోటో 2017 డిసెంబర్ నెల నుండి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్టు తెలిసింది. పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం వెతికితే, మనుషుల మెదడుకి, మానవుల పూర్వీకులుగా భావించే ప్రైమేట్ జాతుల (కోతి, చింపాంజీ మొదలగు) మెదడుకి గల విభిన్నమైన తేడాలను తెలుపుతూ యేల్ యూనివర్సిటీ పరిశోధకులు 23 నవంబర్ 2017 నాడు ఒక జర్నల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. మనిషి, చింపాంజీ మరియు కోతి కణజాలలపై జరిపిన విశ్లేషణలో, మానవ మెదడు తమ పూర్వీకుల ప్రైమేట్ జాతుల మెదడు కంటే మూడింతలు పెద్దదని, విభిన్నమైన లక్షణాలు కలిగి ఉంటుందని కనుగొన్నట్టు యేల్ యూనివర్సిటీ పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో తెలిపారు.
కోతి మరియు చింపాంజీల మెదడులో ఉండని కొన్ని ప్రత్యేకమైన జన్యువులను మనిషి మెదడులోని స్ట్రియాటమ్ మరియు సెరిబెల్లం (చిన్న మెదడు) భాగాలలో కనుగొన్నట్టు యేల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. డోపమైన్ ఉత్పత్తికి ఉపయోగపడే TH జన్యువు మనిషి మెదడులోని హ్యూమన్ నియోకార్టెక్స్ మరియు స్ట్రియాటమ్‌లో అత్యధికంగా పెంపొంధించబడుతుందని, ఈ జన్యువు చింపాంజీల నియోకార్టెక్స్‌లో ఉండదని పరిశోధకులు తెలిపారు. ఈ జన్యువు యొక్క నియోకార్టికల్ వ్యక్తీకరణ, పూర్వీకుల ప్రైమేట్ జాతులలో అంతరించిపోయి, తిరిగి మళ్ళీ మనుషులలో కనిపించిన అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు.
అయితే, మానవ మెదడులోని అన్ని ప్రాంతాలలో, తమ ప్రైమేట్ జాతుల మెదడుల మాదిరిగానే పరమాణు సంతకాలను కలిగి ఉన్నాయని ఈ విశ్లేషణలో తెలిపారు. మెదడు పరిమాణంలో తేడాలు ఉన్నప్పటికీ, మనిషి మెదడులోని 16 ప్రాంతాలలో జన్యు వ్యక్తీకరణ, తమ ప్రైమేట్ జాతుల జన్యు వ్యక్తీకరణతో పోలి ఉన్నాయని ఈ పరిశోధనలో తెలిపారు. మనుషులకి తమ ప్రైమేట్ జాతులకి గల వ్యత్యాసన్ని తెలుపుతూ యేల్ యూనివర్సిటీ 2022 ఆగస్టు నెలలో మరో జర్నల్ పబ్లిష్ చేసింది. మనుషుల మెదడు తమ ప్రైమేట్ జాతుల మెదడు కన్నా ఉన్నతమైన లక్షణాలు మరియు జన్యువులు కలిగి ఉంటాయని మాత్రమే యేల్ యూనివర్సిటీ పరిశోధనలో తేలిపింది. చార్లెస్ డార్విన్ థియరీని తోసిపుచ్చుతూ మానవులు కోతి నుండి పరిణామం చెందలేదని యేల్ యూనివర్సిటీ పరిశోధకులు ఎప్పుడూ ప్రకటించలేదు.
చివరగా, మానవులు కోతి నుండి పరిణామం చెందలేదని యేల్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించలేదు.