Fake News, Telugu
 

బార్‌కోడ్ లోని మొదటి మూడు సంఖ్యలను చూసి వస్తువు ఎక్కడ ఉత్పత్తి చేసారో చెప్పలేము

0

బార్‌కోడ్ లోని మొదటి మూడు సంఖ్యలు చూసి, వస్తువులు ఎక్కడ ఉత్పత్తి అయ్యాయో తెలుసుకోవచ్చని చెప్తూ, ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో కొందరు షేర్ చేస్తున్నారు. ‘690’ నుండి ‘699’ మధ్య సంఖ్యతో బార్‌కోడ్ ప్రారంభమైతే ఆ వస్తువు చైనా లో ఉత్పత్తి అయినట్టని, అదే ‘890’ సంఖ్యతో బార్‌కోడ్ ప్రారంభమైతే ఆ వస్తువు భారత్ లో ఉత్పత్తి అయినట్టని పోస్ట్ లో చెప్తున్నట్టు చూడవొచ్చు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బార్‌కోడ్ లోని మొదటి మూడు సంఖ్యలు చూసి వస్తువులు ఎక్కడ ఉత్పత్తి అయ్యాయో తెలుసుకోవొచ్చు. 

ఫాక్ట్ (నిజం): బార్‌కోడ్ లోని మొదటి రెండు నుండి మూడు సంఖ్యలు (‘GS1 Prefix’) చూసి, ఏ ప్రాంతీయ ‘GS 1’ సంస్థ  ఆ బార్‌కోడ్ ని కేటాయించిందో చెప్పొచ్చు, కానీ ‘GS1 Prefix’ చూసి ఒక వస్తువు ఏ దేశంలో ఏ తయారీదారుడిచే తయారు చేయబడిందని చెప్పలేము; ఆ వస్తువు ప్రపంచంలో ఎక్కడైనా ఉత్పత్తి చేసి ఉండవొచ్చు. కావున పోస్ట్ లోని క్లెయిమ్ తప్పు.

బార్‌కోడ్ లోని మొదటి మూడు సంఖ్యలు దేన్ని సూచిస్తాయని వెతకగా, ఫోటోలో ఇచ్చిన నెంబర్లను నిజంగానే ‘GS 1’ అనే సంస్థ చైనా మరియు భారత్ కి కేటాయించినట్టు తెలుస్తుంది. ‘GS 1’ అనే సంస్థ వ్యాపార కమ్యూనికేషన్ కోసం ప్రమాణాలను అభివృద్ధి చేసి, ప్రపంచమంతా నిర్వహిస్తుందని వారి వెబ్సైటులో చూడవొచ్చు. పోస్ట్ లో చెప్పిన బార్‌కోడ్ లోని మొదటి మూడు సంఖ్యలను ‘GS1 Prefix’ అని అంటారు. వివిధ కంపెనీలకు ఆయా దేశాల్లో ఉన్న ప్రాంతీయ ‘GS 1’ సంస్థ బార్‌కోడ్  కేటాయిస్తుంది. ‘690’ నుండి ‘699’ మధ్య సంఖ్యలతో ‘GS1 Prefix’ ఉన్న బార్‌కోడ్ ని ‘GS1 China’ కేటాయిస్తుంది, ‘890’ సంఖ్యతో ‘GS1 Prefix’ ఉన్న బార్‌కోడ్ ని ‘GS1 India’ కేటాయిస్తుంది. కావున, పోస్టులో ఇచ్చిన ఇరు దేశాల సంఖ్యలు కరెక్టే. కానీ, GS1 సభ్య కంపెనీలు ప్రపంచంలో ఎక్కడైనా ఉత్పత్తులను తయారు చేయగలవనీ, ‘GS1 Prefix’ చూసి వస్తువు ఏ దేశంలో  ఉత్పత్తి అయిందో చెప్పలేమని ఉన్నట్టు వారి వెబ్సైటులో చదవొచ్చు.

అంతేకాదు, వారి వెబ్సైటులోని ‘FAQ’ సెక్షన్ లో కూడా ఒక ప్రశ్నకి సమాధానమిస్తూ వారు అదే విషయాన్ని తెలిపారు. బార్‌కోడ్ లోని మొదటి రెండు నుండి మూడు సంఖ్యలు (‘GS1 Prefix’) చూసి, ఏ ప్రాంతీయ ‘GS 1’ సంస్థ  ఆ బార్‌కోడ్ ని కేటాయించిందో చెప్పొచ్చు, కానీ ‘GS1 Prefix’ చూసి ఒక వస్తువు ఏ దేశంలో, ఏ తయారీదారుడిచే తయారు చేయబడిందని చెప్పలేమని; ఆ వస్తువు ప్రపంచంలో ఎక్కడైనా ఉత్పత్తి చేయబడి ఉండవచ్చని చెప్పినట్టు చదవొచ్చు.

పైన చెప్పిన విషయాలను కొన్ని ఉదాహరణలు తీసుకొని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.

ఉదాహరణ 1: షియోమీ ఎంఐ ఫోన్లు : చైనా కంపనీ – భారత్ లో ఉత్పత్తి – చైనా బార్‌కోడ్

షియోమీ ఎంఐ ఫోన్లు భారత్ లో ఉత్పత్తి అయినా, వాటి పై ‘694’ (చైనాకి సంబంధించిన ‘GS1 Prefix’) సంఖ్యతో మొదలైన బార్‌కోడ్ ఉన్నట్టుగా చూడవొచ్చు. భారత్ లో ఆ ఫోన్లను ‘Rising Star Mobile India Pvt Ltd’ వారు ఉత్పత్తి చేసినా, ఆ ఫోన్లపై చైనా బార్‌కోడ్ ఉన్నట్టు చూడవొచ్చు. ఎందుకంటే షియోమీ ఒక చైనీస్ కంపెనీ మరియు బార్‌కోడ్ అనేది ఉత్పత్తి ప్రదేశానికి సంబంధించింది కాదు.

ఉదాహరణ 2: లేస్ చిప్స్ : అమెరికా కంపనీ – భారత్ లో ఉత్పత్తి – భారత్ బార్‌కోడ్

భారత్ లో ప్రజలు తినే లేస్ చిప్స్ ప్యాకెట్ మీద బార్‌కోడ్ చూస్తే, దాని పై ‘890’ (భారత్ కి సంబంధించిన ‘GS1 Prefix’) సంఖ్యతో మొదలైన బార్‌కోడ్ ఉన్నట్టుగా చూడవొచ్చు. కానీ, లేస్ చిప్స్ ని ‘PepsiCo’ అనే అమెరికా సంస్థ భారత్ లో ఉత్పత్తి చేస్తుంది. అమెరికా కంపెనీ ఉత్పత్తి చేసినా భారత్ కి సంబంధించిన బార్‌కోడ్ ఎందుకు ఉందంటే, ‘PepsiCo’ భారత్ లో ‘PepsiCo (India) Holdings Pvt. Ltd’ పేరుతో తన అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. ఆ అనుసంధ సంస్థ కు ‘GS1 India’ భారత్ కి సంబంధించిన ‘GS1 Prefix’ తో బార్‌కోడ్ కేటాయించారు. అందుకే బార్ కోడ్ ‘890’ తో మొదలైంది.  

కొత్త ‘GS1 Prefix’  లేదా మాతృ సంస్థ (ఇక్కడ PepsiCo అమెరికా) ‘GS1 Prefix’ ని అనుబంధ సంస్థ వాడుకోవచ్చని, కానీ అనుబంధ సంస్థ  ‘GS1 Prefix’  ని పేరెంట్ కంపెనీ వాడలేదని ‘GS 1’ వెబ్సైటులో చదవొచ్చు. కావున, ‘PepsiCo (India) Holdings Pvt. Ltd’ సంస్థ ఉత్పత్తి చేసే లేస్ చిప్స్ ప్యాకెట్ మీద భారత్ కి సంబంధించిన బార్‌కోడ్ ఉంటుంది.

ఉదాహరణ 3: ఆపిల్ లాప్టాప్ : అమెరికా కంపనీ – చైనా లో ఉత్పత్తి – అమెరికా బార్‌కోడ్

భారత్ లో కొన్న ఆపిల్ లాప్టాప్ మీద బార్‌కోడ్ చూస్తే, దాని పై ‘190’ సంఖ్యతో మొదలైన UPC బార్‌కోడ్ ఉన్నట్టుగా చూడవొచ్చు. UPC బార్‌కోడ్ (కొన్ని దేశాల్లో వాడే ‘Universal Product Code’) ని EAN బార్‌కోడ్ లోకి మార్చాలంటే ముందు ‘0’ జోడించాలి. కావున, ఇప్పుడు ఆపిల్ లాప్టాప్ మీద EAN బార్‌కోడ్ ‘019’ తో సంఖ్యతో మొదలైనట్టు. ‘019’ అనేది ‘GS1 US’ కి సంబంధించిన ‘GS1 Prefix’. ఆపిల్ లాప్టాప్ ని చైనా లో తయారు చేసి, భారత్ లో అమ్మినా, దాని పై  అమెరికా బార్‌కోడ్ ఉన్నట్టు చూడవొచ్చు.

చివరగా, బార్‌కోడ్ లోని మొదటి మూడు సంఖ్యలను చూసి వస్తువు ఎక్కడ ఉత్పాత్తి చేసారో చెప్పలేము.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll