ఇటీవల 01 మార్చి 2025న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశా వర్కర్ల గరిష్ఠ వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచుతూ, మొదటి రెండు ప్రసవాలకు ఇకపై వారికి 180 రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇస్తామని ప్రకటించింది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). అయితే, వేతనాలు పెంపు, రిటైర్మెంట్ వయసు పెంపుకు సంబంధించిన జీవోలను వెంటనే విడుదల చేయడం వంటి పలు డిమాండ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు 06 మార్చి 2025న ‘ఛలో విజయవాడ’ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు (ఇక్కడ, ఇక్కడ). ఆశా వర్కర్లు చలో విజయవాడకు సంబంధించి పలు రిపోర్ట్స్ పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో “చలో విజయవాడ ధర్నాకు తరలివస్తున్న ఆశా వర్కర్లను పోలీసులు ఎక్కడిక్కడ అరెస్ట్ చేస్తున్నారు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). చంద్రబాబు నేతృత్వంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆశా వర్కర్ల పట్ల కఠినంగా వ్యవహరించిందని చెబుతూ ఈ వీడియో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 06 మార్చి 2025న జరిగిన ‘చలో విజయవాడ’ ధర్నాకు వెళ్తున్న ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో ఇటీవలిది కాదు. ఈ వైరల్ వీడియో 08 ఫిబ్రవరి 2024న, ఆశా వర్కర్ల ‘చలో విజయవాడ’ కార్యక్రమంలో భాగంగా విజయవాడ-గుంటూరు రహదారిపై ఆందోళన చేపట్టిన ఆశా వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేసిన దృశ్యాలను చూపిస్తుంది. ఈ ఘటన YSRCP అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వైరల్ వీడియోలోని దృశ్యాలనే కలిగిన ఉన్న అధిక నిడివి గల వీడియోను 08 ఫిబ్రవరి 2024న పలువురు ఫేస్‌బుక్‌లో షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోను “గుంటూరు విజయవాడ హైవేని బ్లాక్ చేసిన ఆశ వర్కర్లు, హైవేపై బైఠాయించి నిరసన తెలుపుతున్న ఆశ వర్కర్లు” అనే శీర్షికతో షేర్ చేశారు. వైరల్ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలను ఈ వీడియోలో టైంస్టాంప్ 0:54 నుండి మనం చూడవచ్చు.

వైరల్ వీడియోను ఈ ఫేస్‌బుక్ వీడియోతో పోల్చి చూస్తే ఈ రెండు వీడియోలు ఒకే సంఘటనను చూపిస్తున్నాయని మనం నిర్ధారించవచ్చు. వైరల్ వీడియో, 2024 నాటి ఫేస్‌బుక్ వీడియో మధ్య పోలికలను క్రింద చూడవచ్చు:

తదుపరి ఈ ఫిబ్రవరి 2024 నాటి ఆశా వర్కర్ల ధర్నాకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, 08 ఫిబ్రవరి 2024న, ‘చలో విజయవాడ’ కార్యక్రమంలో భాగంగా విజయవాడ-గుంటూరు రహదారిపై ఆందోళన చేపట్టిన ఆశా వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేసారని పేర్కొంటూ పలు మీడియా సంస్థలు ప్రసారం చేసిన వీడియో కథనాలు (ఇక్కడ, ఇక్కడ), వార్తాకథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ). ఈ సమాచారం ఆధారంగా ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు అప్పటి YSRCP ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు 08 ఫిబ్రవరి 2024న చేపట్టిన ‘చలో విజయవాడ’ సంబంధించినవి అని మనం నిర్ధారించవచ్చు.
అంతేకాకుండా ఈ వీడియో వైరల్ కాగా, ఈ వీడియోపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వా ఫ్యాక్ట్ చెక్ విభాగం X(ట్విట్టర్)లో స్పందిస్తూ, “రాష్ట్రంలో ఆశా వర్కర్లని పోలీసులు అరెస్ట్ చేసారు అంటూ, కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియో, ఫిబ్రవరి 8, 2024లోని వీడియో. ఏడాది క్రితం వీడియో తీసుకుని వచ్చి, ఇప్పటి ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు. అది ఫేక్ ప్రచారం,” అని పేర్కింది.
ప్రస్తుత టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 04 జూన్ 2024న అధికారంలోకి వచ్చింది, ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న ఆశా వర్కర్ల అరెస్ట్ ఘటన 08 ఫిబ్రవరి 2024న జరిగింది, అంటే ఈ వైరల్ వీడియోలో చూపిస్తున్న ఘటన YSRCP అధికారంలో ఉన్నప్పుడు జరిగింది.
06 మార్చి 2025న జరిగిన ‘చలో విజయవాడ’ ధర్నాకు ఆశా వర్కర్లు వెళ్లకుండా పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకున్నట్లు పలు రిపోర్ట్స్ పేర్కొన్నాయి (ఇక్కడ & ఇక్కడ).
చివరగా, ఫిబ్రవరి 2024లో ఆశా వర్కర్ల ‘చలో విజయవాడ’ ధర్నా సందర్భంగా ఆశా వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేసిన దృశ్యాలను 06 మార్చి 2025న జరిగిన ఆశా వర్కర్ల ‘చలో విజయవాడ’ ధర్నాకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.