Fake News, Telugu
 

హార్స్‌హెయిర్ వార్మ్ అనే పరాన్నజీవి వీడియోని శివ నాగం చెట్టు అని షేర్ చేస్తున్నారు

0

శివ నాగం అనబడే చెట్టు మూలాన్ని కత్తిరించిన 15 రోజుల వరకు దాని వేర్లు ఇలా బ్రతికే ఉంటాయని ఒక వీడియోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. అవి పాములా మెలితిప్పినట్లు ఉంటాయని పోస్ట్ ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మూలాన్ని కత్తిరించినా కూడా వేర్లు 15 రోజుల వరకు జీవించి ఉండే శివ నాగం చెట్టు వీడియో.

ఫాక్ట్: శివ నాగం చెట్టు, దాని వేర్లు గురించి వెతకగా, అలాంటి ఒక చెట్టు ఉన్నట్టు ఎక్కడా కూడా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. వీడియోలో ఉన్నది హార్స్‌హెయిర్ వార్మ్ అనే పరాన్నజీవి (parasite). ఈ పరాన్నజీవులు ఇతర కీటకాలపై దాడి చేసి వాటి లోపల పెరుగుతాయి. అవి పూర్తిగా ఎదిగిన తరువాత, కీటకాన్ని నీటిలోకి దూకేలా చేసి శరీరం నుండి నిష్క్రమించేలా చేస్తాయి. ‘మలయాళం సమయం’ వారు ఈ వీడియోకు సంబంధించి రాసిన ఆర్టికల్‌లో కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లోని డాక్టర్ సుజనపాలన్ గారిని అడిగినప్పుడు వీడియోలో ఉన్నది ఒక చెట్టుకి సంబంధించిన వేర్లు కాదని, అది హార్స్‌హెయిర్ వార్మ్ అని తేల్చిచెప్పారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.        

శివ నాగం చెట్టు, దాని వేర్లు గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, అలాంటి ఒక చెట్టు ఉన్నట్టు ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లభించలేదు.

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే విజువల్స్‌తో ఉన్న ఒక యూట్యూబ్‌ వీడియో లభించింది. కానీ, వీడియోలో ఉన్నది హార్స్‌హెయిర్ వార్మ్ అనే పరాన్నజీవి (parasite). ఈ పరాన్నజీవులు ఇతర కీటకాలపై దాడి చేసి వాటి లోపల పెరుగుతాయి. అవి పూర్తిగా ఎదిగిన తరువాత, కీటకాన్ని నీటిలోకి దూకేలా చేసి శరీరం నుండి నిష్క్రమించేలా చేస్తాయి. ఈ యూట్యూబ్‌ వీడియోలో నీళ్లల్లో ఎలా బయటికి వస్తాయో చూపించారు.

గోర్డియన్ పురుగులు అని కూడా పిలువబడే హార్స్‌హెయిర్ వార్మ్ నెమటోమార్ఫా సమూహానికి చెందినవి. ఇవి నెమటోడ్ లను పోలి ఉంటాయి, అయితే చాలా పొడవుగా (4 అంగుళాలు లేదా అంతకంటే ఎక్కువ) మరియు చాలా సన్నగా ఉంటాయి (1/80 నుంచి 1/10 అంగుళాల వ్యాసం(diameter)). ఇవి నీరు లేదా తడి ప్రాంతాల్లో బాగా కనిపిస్తాయి.

మలయాళం సమయం వారు ఈ వీడియోకు సంబంధించి రాసిన ఆర్టికల్‌లో కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లోని డాక్టర్ సుజనపాలన్ గారిని అడిగారు. వీడియోలో ఉన్నది ఒక చెట్టుకి సంబంధించిన వేర్లు కాదని, అది హార్స్‌హెయిర్ వార్మ్ అని తేల్చిచెప్పారు.

చివరగా, హార్స్‌హెయిర్ వార్మ్ అనే పరాన్నజీవిని పట్టుకొని మూలాన్ని కత్తిరించినా కూడా వేర్లు 15 రోజుల వరకు జీవించి ఉండే శివ నాగం చెట్టు వీడియో అని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll