Fake News, Telugu
 

ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ఒక ముస్లిం యువకుడిని కొట్టి చంపిన ఘటనకు ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాతో ఎటువంటి సంబంధంలేదు

0

కాశ్మీర్ ఫైల్స్ సినిమా యొక్క ప్రభావం వల్ల ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం యువకుడిని దారుణంగా కొట్టి చంపారని ఒక పోస్ట్ సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. మరొక వ్యక్తి ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడని పోస్టులో అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ప్రభావం వల్ల ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ముస్లిం యువకుడిని దారుణంగా కొట్టి చంపారు.

ఫాక్ట్: ఉత్తరప్రదేశ్‌లో, ఒక వ్యక్తి జనాలను తుపాకీతో కాల్చడంతో , అక్కడి వారు ఒక ముస్లిం యువకుడిని కొట్టి చంపారు, అతని అన్నయ్య తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరాడు. కానీ, దీనికి ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాతో ఎటువంటి సంబంధంలేదు. ఒక అమ్మాయి కోసం ఆ ముస్లిం యువకుడు తరచూ భిర్పూర్ గ్రామానికి వెళ్ళేవాడని, దానితో గ్రామస్తులు ఆ అబ్బాయికి హెచ్చరిక కూడా చేసారు. ఒకరోజు అలానే వెళ్లిన యువకుడు అక్కడ జరిగిన గొడవలో చనిపోయాడు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ప్రభావం వల్ల ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ముస్లిం యువకుడిని దారుణంగా కొట్టి చంపారని ఎక్కడా ఆధారాలు లేవు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.   

పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, అటువంటి సంఘటన ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగినట్టు ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే అలా జరిగుంటే, ప్రముఖ వార్తాపత్రికలు దాని గురించి ప్రచురించేవి.

ఉత్తరప్రదేశ్‌లో, ఒక వ్యక్తి జనాలను తుపాకీతో కాల్చడంతో, అక్కడి వారు ఒక ముస్లిం యువకుడిని కొట్టి చంపారని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. మరొక వ్యక్తి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరాడని తెలిపారు. ఒక అమ్మాయి కోసం ఆ ముస్లిం యువకుడు తరచూ భిర్పూర్ గ్రామానికి వెళ్ళేవాడని, దానితో గ్రామస్తులు ఆ అబ్బాయికి హెచ్చరిక కూడా చేసారని పిప్రి పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ ఇన్‌స్పెక్టర్‌ ఆదిత్య విక్రం సింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపాడు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా యొక్క ప్రభావం వల్ల జరిగిన సంఘటన అని ఎక్కడా రిపోర్ట్ అవలేదు, ఆధారాలు కూడా లేవు.

ఇదే విషయాన్ని కౌశాంబి పోలీస్ వారు ప్రెస్ నోట్ విడుదల చేసారు. ఈ ఘటనలో ఎటువంటి మతపరమైన కోణం లేదని తెలిపారు.

కొన్ని వీడియోలను షేర్ చేస్తూ, అవి ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా యొక్క ప్రభావం వల్ల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సంఘటనలంటూ బాగా షేర్ చేస్తుండటంతో ఉత్తరప్రదేశ్‌ పోలీస్ ఫాక్ట్ చెక్ వారు, ట్విట్టర్ ద్వారా ఫాక్ట్-చెక్ చేసారు. ఇవే వీడియోలు ఇంతకముందు 2020లో తప్పుగా షేర్ చేసినప్పుడు, Factly ఫాక్ట్-చెక్ ఆర్టికల్ రాసింది.

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాకి సంబంధించి ముస్లిం వ్యతిరేక నినాదాలు జరిగినట్టు రిపోర్ట్ అయ్యాయి. ‘కాశ్మీర్ ఫైల్స్’ ప్రభావం వల్ల ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ముస్లిం యువకుడిని దారుణంగా కొట్టి చంపారని చెప్పడానికి ఎక్కడా ఆధారాలు లేవు.

చివరగా, ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ఒక ముస్లిం యువకుడిని కొట్టి చంపిన ఘటనకు ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాతో ఎటువంటి సంబంధంలేదు.

Share.

About Author

Comments are closed.

scroll