గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాశ్మీర్‌లో ఎప్పుడు అల్లర్లు జరుగుతుండేవి, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పే ఉద్దేశంతో కాశ్మీర్‌కు సంబంధించిన రెండు ఫోటోలను పోలుస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఒక ఫోటోలో అమ్మాయిలు రాళ్లు రువ్వుతున్న ఫోటో కాంగ్రెస్ హయాంలో కాశ్మీర్ పరిస్థితిని చూపిస్తుంటే, కాశ్మీరీ అమ్మాయిలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న ఫోటో బీజేపీ హయాంలోని పరిస్థితిని తెలుపుతుందని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కాంగ్రెస్ మరియు బీజేపీ హయాంలలో కాశ్మీర్ పరిస్థితులను చూపిస్తున్న ఫోటోలు.
ఫాక్ట్(నిజం): ఈ రెండు ఫోటోలు బీజేపీ అధికారంలో ఉన్నపుడు పరిస్థితులను సూచిస్తున్నవే. అమ్మాయిలు రాళ్లు రువ్వుతున్న ఫోటో ఏప్రిల్ 2017లో పోలీసులకు మరియు విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణ సమయంలో తీసిన ఫోటో కాగా, మరొక ఫోటో ఇటీవల కాశ్మీర్‌లో జరిగిన G20 సమావేశాల సందర్భంలో తీసింది. కాబట్టి రెండు ఫోటోలు కూడా బీజేపీ హయాంలో కాశ్మీర్ పరిస్థితులను చూపిస్తున్నవే. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ రెండు ఫోటోలూ కాశ్మీర్‌కు సంబంధించినవే అయినా పోస్టులో చెప్తున్నదానికి వ్యతిరేకంగా ఈ రెండు ఫోటోలు బీజేపీ హయాంలో జరిగిన ఘటనలకు సంబంధించినవే. ఈ రెండు ఫోటోలకు సంబంధించి వివరాలు కింద చూద్దాం.
ఫోటో 1:
స్కూల్ డ్రెస్‌లో హిజాబ్ ధరించిన అమ్మాయిలు రాళ్లు విసురుతున్న ఈ ఫోటో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఘటనకు సంబంధించిందే. ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోను 2017లో రిపోర్ట్ చేసిన చాలా వార్తా కథనాలు మరియు స్టాక్ ఫోటోలు మాకు కనిపించాయి.
ఈ కథనాలలోని వివరణ ప్రకారం ఈ ఫోటో 22 ఏప్రిల్ 2017న శ్రీనగర్‌లో తీసింది. శ్రీనగర్‌లో కాశ్మీరీ విద్యార్థులకు మరియు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణ సమయంలో తీసిన ఫోటో. అంతకుముందు పుల్వామాలోని ఒక కళాశాలపై భద్రతా దళాలు చేసిన దాడిలో విద్యార్థులు గాయపడడంతో రాష్ట్రంలో అల్లర్లు మొదలైయ్యాయి.
ఈ ఫోటోను 2017లో జరిగిన అల్లర్లకు సంబంధించింది అంటూ రిపోర్ట్ చేసిన మరికొన్ని వార్తా కథనాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. దీన్నిబట్టి, ఈ ఫోటో బీజేపీ ప్రభుత్వ హయాంలో కాశ్మీర్ పరిస్థితులను చూపిస్తుందని స్పష్టంగా తెలుస్తుంది.
ఫోటో 2:
కాగా కాశ్మీరీ అమ్మాయిలు సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఈ ఫోటో ఇటీవల కాశ్మీర్‌లో జరిగిన G20 సమావేశాల సందర్భంలో తీసింది. ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఫోటోకు సంబంధించిన దృశ్యాలను ప్రచారం చేసిన ఒక న్యూస్ రిపోర్ట్ మాకు కనిపించింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఈ దృశ్యాలు ఇటీవల కాశ్మీర్‌లో జరిగిన G20 సమావేశాలకు సంబంధించినవి.
ఈ ఫోటో G20 సమావేశాలలో భాగంగా జరిగిన డిన్నర్ ఈవెంట్ సందర్భంలో తీసిందని సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా షేర్ అయ్యాయి. దీన్నిబట్టి, వైరల్ పోస్టులో షేర్ చేసిన రెండు ఫోటోలు బీజేపీ ప్రభుత్వ హయాంలో కాశ్మీర్ పరిస్థితులను చూపిస్తున్నాయని స్పష్టమవుతుంది.
చివరగా, ఈ రెండూ ఫోటోలూ కూడా బీజేపీ హయాంలో కాశ్మీర్ పరిస్థితులను చూపిస్తున్నవే.