‘కేరళలో 240 పడవలతో నదిలో దీపోత్సవం’, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. కేరళ మీరళం మండిలోని మహంకాళేశ్వర దేవాలయం సమీపంలో ఈ అద్భుతమైన ప్రదర్శన చేసినట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కేరళలో 240 పడవలతో నదిలో దీపోత్సవం నిర్వహించిన దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియో, చైనాలో గ్వాంగ్సీ జువాంగ్ ప్రాంతంలోని యూలంగ్ నదిపై రాత్రి వేళలో నిర్వహించే ప్రత్యేక డ్రాగన్ పడవల షో దృశ్యాలని చూపిస్తుంది. 700 మీటర్ల పొడవైన ఈ డ్రాగన్ ఆకారంలో ఉన్న పడవను 80 వెదురు తెప్పలతో రూపొంధించారు. గ్వాంగ్సీ జువాంగ్ ప్రాంతంలో యాత్రికులను ఆకర్షించేందుకు ఈ ప్రత్యేక ఫాంటసీ డ్రాగన్ పడవ పర్యటనను 2022 మే నెలలో ప్రారంభించారు. ఈ వీడియో కేరళకి సంబంధించినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Xi’s Moments’ అనే ఫేస్బుక్ యూసర్ 25 మే 2022 నాడు షేర్ చేసినట్టు తెలిసింది. చైనాలోని గ్వాంగ్సీ జువాంగ్ ప్రాంతంలో యూలంగ్ నదిపై నిర్వహించే వార్షిక డ్రాగన్ రాఫ్ట్ వేడుక దృశ్యాలని ఈ వీడియో వివరణలో తెలిపారు. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు ఇవే దృశ్యాలు కలిగిన వీడియోలని 2022 మే నెలలో పబ్లిష్ చేశాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
సుమారు 700 మెటర్ల పొడవైన ఈ డ్రాగన్ ఆకారంలో ఉన్న పడవను 80 వెదురు తెప్పలతో రూపొంధించినట్టు తెలిసింది. సౌత్ చైనాలోని గ్వాంగ్సీ జువాంగ్ ప్రాంతంలో యాత్రికులను ఆకర్షించే లక్ష్యంతో ఈ ప్రత్యేక ఫాంటసీ డ్రాగన్ పడవ పర్యటనను 2022 మే నెలలో ప్రారంభించినట్టు CGTN వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ మరికొన్ని వార్తా సంస్థలు కూడా ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి.
240 పడవలతో ఇటీవల కేరళలో దీపోత్సవం నిర్వహించినట్టు ఎక్కడా సమాచారం దొరకలేదు. కేరళలో ఓనమ్ పండగ సందర్భంగా నిర్వహించే పడవ పోటీల దృశ్యాలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
చివరగా, చైనాలోని యూలంగ్ నదిపై నిర్వహించే డ్రాగన్ పడవ పర్యటన దృశ్యాలని కేరళలో 240 పడవలతో నదిలో దీపోత్సవం నిర్వహించిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.