మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి గోడ అనుకొని సాంబార్ గిన్నెకి ఒరిగి అందులో పడటంతో చర్మం కాలిపోయి మరణించినట్టు సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం మధురై జిల్లాలోని పలంగానట్టి ప్రాంతంలో చోటుచేసుకున్నట్టు ఈ పోస్టులో తెలిపారు. ఈ వీడియోని ఇదే వివరణతో ‘10TV’ వార్తా సంస్థ కూడా తమ ఫేస్‌బుక్ పేజీలో పబ్లిష్ చేసింది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: తమిళనాడులో మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి గోడ అనుకొని సాంబార్ గిన్నెలో పడి మరణించిన ఘటన యొక్క దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): 29 జులై 2022 నాడు తమిళనాడు మధురై జిల్లాలోని ముత్తుమారియమ్మన్ దేవాలయం సమీపంలో భక్తుల కోసం ప్రసాదం తయారుచేస్తుండగా, ముత్తుకుమారన్ అనే వ్యక్తి స్పృహ తప్పి మరుగుతున్న గంజి గిన్నెలో పడి కాలిపోయాడు. శరీరంపై చాలా వరకు కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన ముత్తుకుమారన్, అదే రోజు రాత్రి 10:30 గంటలకు చికిత్స పొందుతూ మరణించారు. ముత్తుకుమారన్ మూర్ఛ రోగంతో బాధపడుతున్నాడని అతని భార్య తమిళమని పోలీస్ కంప్లైంటులో స్పష్టం చేసింది. ముత్తుకుమారన్ మద్యం మత్తులో మరుగుతున్న గంజి గిన్నెలో పడి మరణించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని షేర్ చేస్తూ ‘ఇండియా టుడే’ వార్తా సంస్థ 02 ఆగష్టు 2022 నాడు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. తమిళనాడు మధురై జిల్లాలోని ముత్తుమారియమ్మన్ దేవాలయం దగ్గర భక్తుల కోసం గంజి ప్రసాదాన్ని తయారుచేస్తున్న సమయంలో ముత్తుకుమారన్ అనే వ్యక్తి స్పృహ తప్పి ప్రమాదవశాత్తు మరుగుతున్న గంజి గిన్నెలో పడినట్టు ఈ ఆర్టికల్‌లో తెలిపారు. ‘ఆడి వెళ్లి’ పండగ సందర్బంగా భక్తులకు గంజి ప్రసాదాన్ని ఇవ్వడం ఆనవాయితీ. ముత్తుమారియమ్మన్ దేవాలయంలో గంజి ప్రసాదం తయారుచేసే పనిని పర్యవేక్షిస్తున్న సమయంలో ముత్తుకుమారన్, స్పృహ తప్పి మరుగుతున్న గంజి గిన్నెలో పడి అతని శరీరం కాలిపోయిన్నట్టు తెలిసింది.
ఈ ఘటనకు సంబంధించిన మరికొన్ని వివరాలని తెలుపుతూ పలు తమిళనాడు వార్తా సంస్థలు ఆర్టికల్స్ మరియు వీడియోలని పబ్లిష్ చేసాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
ఒంటి నిండా కాలిన గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన ముత్తుకుమారన్, అదే రోజు రాత్రి 10:30 నిమిషాలకు మరణించినట్టు ముత్తుకుమారన్ భార్య తమిళమని FIRలో తెలిపింది. తన భర్త మూర్ఛ రోగంతో బాధపడుతూ గత కొన్ని సంవత్సరాలుగా చికిత్స పొందుతున్నాడని, అందులో భాగంగానే స్పృహ తప్పి మరుగుతున్న గంజి పాత్రలో పడినట్టు తమిళమని పోలీస్ కంప్లైంటులో స్పష్టం చేసింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి మద్యం మత్తులో మరుగుతున్న వంట గిన్నెలో పడలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, తమిళనాడులో మూర్ఛ రోగంతో బాధపడుతున్న వ్యక్తి స్పృహ తప్పి మరుగుతున్న గంజి గిన్నెలో పడిన దృశ్యాలని తప్పగా షేర్ చేస్తున్నారు.