ఇటీవల గోవాలో ఒక పడవ మునిగిపోయింది అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో చాలా మంది ప్రయాణికులతో కూడిన పడవ మునిగిపోవడాన్ని మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: ఇటీవల గోవాలో జరిగిన ఒక పడవ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోతో గోవాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ వైరల్ వీడియో 03 అక్టోబర్ 2024న డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని గోమా పోర్టు వద్ద కివు సరస్సుపై జరిగిన పడవ ప్రమాద దృశ్యాలను చూపిస్తుంది. ఈ వీడియోను గోవాకు ఆపాదిస్తూ పలువురు సోషల్ మీడియాలో షేర్ చేయగా, వాటి పై గోవా రాష్ట్ర పోలీసులు వారి అధికారిక X(ట్విట్టర్)లో స్పందిస్తూ, ఈ వైరల్ వీడియోకు గోవాకు ఎలాంటి సంబంధం లేదని, ఈ ఘటన ఆఫ్రికాలోని కాంగోలోని గోమాలో చోటుచేసుకుందని స్పష్టం చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను కలిగిన ఒక వీడియోను ‘అసోసియేటెడ్ ప్రెస్ (Associated Press)’ సంస్థ యొక్క అధికారక యుట్యూబ్ ఛానల్ 04 అక్టోబర్ 2024న షేర్ చేసింది. ఈ వీడియో వివరణ ప్రకారం, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని కివు సరస్సులో ఇటీవల జరిగిన పడవ ప్రమాదం దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది.
దీని ఆధారంగా ఈ పడవ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతకగా, ఈ దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ అయిన పలు వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, 03 అక్టోబర్ 2024న కాంగోలోని గోమా పోర్టు వద్ద కివు సరస్సుపై ఈ పడవ ప్రమాదం జరిగింది. దక్షిణ కివు ప్రావిన్స్ గవర్నర్ జీన్-జాక్వెస్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో పడవలో సుమారు 278 మంది ప్రయాణిస్తున్నారు, అలాగే ఈ ప్రమాదంలో కనీసం 78 మంది మునిగిపోయారని ఆయన తెలిపారు.
అలాగే ఈ పడవ ప్రమాద దృశ్యాలను గోవాకు ఆపాదిస్తూ పలువురు సోషల్ మీడియాలో షేర్ చేయగా, వాటి పై గోవా రాష్ట్ర పోలీసులు వారి అధికారిక X(ట్విట్టర్)లో స్పందిస్తూ, ఈ వైరల్ వీడియోతో గోవాకు ఎలాంటి సంబంధం లేదని, ఈ ఘటన ఆఫ్రికాలోని కాంగోలోని గోమాలో చోటుచేసుకుందని పేర్కొన్నారు. అలాగే గోవా తీరంలో ఇటీవల పడవ ప్రమాదం జరిగినట్లు ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్టులు లేవు.
చివరగా, 03 అక్టోబర్ 2024న కాంగో దేశంలో జరిగిన పడవ ప్రమాద దృశ్యాలను గోవాలో పడవ ప్రమాదం దృశ్యాలని తప్పుగా షేర్ చేస్తున్నారు.