Fake News, Telugu
 

అప్పుడే పుట్టిన పిల్లల ఫోటోలను సంబంధంలేని ఒక పాత కథకి ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు.

0

జోధ్‌పూర్‌లో ఒక మహిళ 11 ఏళ్ల తర్వాత తల్లి అయ్యే భాగ్యాన్ని పొందిందని, ఐతే తల్లి లేదా బిడ్డలో ఒకరే బతికే అవకాశం ఉన్నప్పుడు ఆ మహిళ తన కూతురిని రక్షించాలని నిర్ణయించుకొని, కూతురు పుట్టిన తర్వాత ఆ తల్లి కూతుర్ని కౌగిలించుకుని శాశ్వతంగా కన్ను మూసింది అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోస్టులో ఆ మహిళ ఫోటోతో పాటు మరొక ఫోటో కూడా షేర్ చేసారు. ఇదే కథని గుజరాత్‌లోని ఒక మహిళకు ఆపాదిస్తూ, కొన్ని ఫోటోలు షేర్ చేసిన మరొక పోస్టు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఐతే కథనం ద్వారా ఆ రెండు పోస్టులో షేర్ చేసిన ఫోటోలకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: జోధ్‌పూర్‌లో, గుజరాత్‌లో ఒక మహిళ ఒక బిడ్డకు జన్మనిచ్చి తను చనిపోయిన ఘటనకు సంబంధించిన ఫోటోలు.

ఫాక్ట్: జోధ్‌పూర్‌కి చెందిన సుహాని చోప్రా అనే మహిళ ఒక పాపకి జన్మనిచ్చిన తర్వాత మరణించింది. వైరల్ అయిన మహిళ ఫోటో సుహానిదే. సుహాని మరణించిన తరవాత తన కుటుంబం ఆమె రెండు కళ్ళని దానం చేసింది. ఐతే ఈ ఘటనకు సంబంధించి పోస్టులో చెప్తునట్టు ‘తల్లి లేదా బిడ్డలో ఒక్కరే బతికే అవకాశమున్న సందర్భంలో, ఆ మహిళ తన బిడ్డకి జన్మనిచ్చి తను చనిపోయిందన్న’ నేపథ్యమేది లేదు, 11 ఏళ్ళ తర్వాత తల్లి అయింది అన్నది కూడా తప్పే, అదంతా కల్పితం. ఈ కథ చాలా సంవత్సరాల నుండి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంది. ఇకపోతే ఈ పోస్టులో, ఇంకో పోస్టులో షేర్ చేస్తున్న అప్పుడే పుట్టిన పిల్లల ఫోటోలు చాలా రోజుల నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి ప్రసవానికి సంబంధించిన క్షణాలను వీడియో/ఫోటో తీసే కొన్ని ఫోటోగ్రఫీ సంస్థలు తమ ఫేస్‌బుక్‌ పేజీలలో ఈ ఫోటోలను షేర్ చేసాయి. ఈ ఫోటోలకు భారత దేశానికి ఎటువంటి సంబంధంలేదు.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్ట్ 1:

ఇటీవల జోధ్‌పూర్‌కి చెందిన సుహాని చోప్రా అనే మహిళ ఒక పాపకి జన్మనిచ్చిన తర్వాత మరణించింది. పోస్టులో వైరల్ అయిన ఫోటోలో ఉన్నది తనే. సుహాని మరణించిన తరవాత తన కుటుంబం ఆమె రెండు కళ్ళని దానం చేసింది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా ట్వీట్ చేసాడు.ఈ ఘటనకి సంబంధించిన వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు.

ఐతే ఈ ఘటనకు సంబంధించి పోస్టులో చెప్తునట్టు ‘తల్లి లేదా బిడ్డలో ఒక్కరే బతికే అవకాశమున్న సందర్భంలో, ఆ మహిళ తన బిడ్డకి జన్మనిచ్చి తను చనిపోయిందన్న’ నేపథ్యమేది లేదు, అదంతా కల్పితం మాత్రమే. అలాగే, 11 ఏళ్లుగా తనకు పిల్లలు లేరు అని కూడా ఎక్కడా లేదు. ఇదే కథ చాలా సంవత్సరాల నుండే ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంది. ఈ కథకి, జోధ్‌పూర్‌లో జరిగిన ఘటనకి ఎటువంటి సంబంధంలేదు.

ఇకపోతే ఈ పోస్టులో షేర్ చేసిన అప్పుడే పుట్టిన ఒక బిడ్డ ఫోటో చాలా రోజుల నుండి ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. ప్రత్యేకించి, ప్రసవానికి సంబంధించిన క్షణాలను వీడియో/ఫోటో తీసే ఒక ఫోటోగ్రఫీ సంస్థ తమ ఫేస్‌బుక్‌ పేజీలో ఈ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోకి మరియు జోధ్‌పూర్‌లో జరిగిన ఘటన/ వైరల్ కథకి ఎటువంటి సంబంధంలేదు.

పోస్ట్ 2:

ఈ పోస్టులో ఉన్న అప్పుడే పుట్టిన పిల్లల ఫోటోలు చాలా రోజుల నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి ప్రసవానికి సంబంధించిన క్షణాలను వీడియో/ఫోటో తీసే కొన్ని ఫోటోగ్రఫీ సంస్థలు తమ ఫేస్‌బుక్‌ పేజీలలో ఈ ఫోటోలను షేర్ చేసాయి (ఇక్కడ మరియు ఇక్కడ). ఈ ఫోటోలకు, గుజరాత్/ జోధ్‌పూర్‌కు ఎటువంటి సంబంధంలేదు. అదే విధంగా ఈ ఫోటోలకు పోస్టులో చెప్పిన కథకి కూడా ఎటువంటి సంబంధంలేదు. పైన చెప్పినట్టు ఆ కథ చాలా సంవత్సరాల నుండి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంది.

ఇక ఈ పోస్టులో సర్జికల్ ఆప్రాన్ ధరించి ఏడుస్తున్న వ్యక్తి ఫోటో కూడా చాలా సంవత్సరాల నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోటో మొదట 2017లో ‘ozgemetinphotography’ అనే బేబీ ఫోటోగ్రఫీ  ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది.

ఈ ఎకౌంటు నిర్వహిస్తున్న వ్యక్తి ఈ ఫోటోకి కింద వచ్చిన ఒక కామెంట్‌కి స్పందిస్తూ, ఈ ఫోటో తానే తీసానని, ఫోటోలో ఉన్న వ్యక్తి బిడ్డ ఆరోగ్యంగా పుట్టినందుకు ఏడుస్తున్నాడని, భార్య చనిపోయినందుకు కాదని స్పష్టం చేసాడు. పైగా ఈ ఫోటోకి ఆపాదిస్తూ వైరల్ అవుతున్న కథ తప్పని కూడా స్పష్టం చేసాడు. ఈ ఫోటోలకు, గుజరాత్/ జోధ్‌పూర్‌కు గాని ఎటువంటి సంబంధంలేదు.

చివరగా, అప్పుడే పుట్టిన పిల్లల ఫోటోలను సంబంధంలేని ఒక పాత కథకి ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll