తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల నేపధ్యంలో “భద్రాచలంలో వరద నీటి ప్రవాహం, #floods2022” అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా ప్రచారంలో ఉంది. ఈ పోస్టులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: 2022 భద్రాచలం వరదలకు సంబంధించిన వీడియో.
ఫాక్ట్ (నిజం): 19 నవంబర్ 2021న కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగిపోవడం వల్ల దిగువన ఉన్న గ్రామలలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వీడియోలో ఉన్న దృశ్యాలు ఈ ఘటనకు సంబంధించినవి, ఇప్పటి భద్రాచలం వరదలకు సంబంధం లేదు. కావున, పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
వీడియోలో ఉన్న దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సర్చ్ చేస్తే, ఇదివరకే ఈ వీడియోను “తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు” అని ఒక యూట్యూబ్ ఛానెల్ 20 నవంబర్ 2021లో అప్లోడు చేసింది. ఇదే వీడియోను వేరే యూట్యూబ్ ఛానెళ్ళు కూడా అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించిన వీడియోగా అప్లోడు చేశాయి. వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
వివరాల్లోకి వెళ్తే, నవంబర్ 2021లో కురిసిన భారీ వర్షాలకు కడప జిల్లాలో ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగిపోయింది. దానివల్ల దిగువ ఉన్న గ్రామాలకు భారీగా వరద నీరు వచ్చింది. దానికి సంబంధించిన వార్తా కథనాలను ఇక్కడ చూడవచ్చు.
అయితే, 2022 జులైలో భద్రాచలంలో భారీ వర్షాలు పడుతున్నప్పటికీ, వైరల్ అవుతున్న వీడియో భద్రాచలానికి సంబంధించినది కాదు. భద్రాచలం వరదలకు సంబంధించిన వార్తా కథానాలని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, 2021లో కడపలోని అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగడం వల్ల వచ్చిన వరదకు సంబంధించిన వీడియోని, 2022 భద్రాచలం వరద వీడియో అంటూ ప్రచారం చేస్తున్నారు.