“విజయవాడ ఆంధ్రా ఆసుపత్రిలో 28-11-25 నుండి 05-12-25 తేది వరకు ఇంగ్లాండ్ నుండి వస్తున్న 8 మంది వైద్యులచే 18 సం. లోపు చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్ చేయబడును” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 28 నవంబర్ 2025 నుండి 05 డిసెంబర్ 2025వ తేదీ వరకు విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్‌లో గుండె జబ్బులతో బాధపడుతున్న 18 సంవత్సరాల లోపు చిన్నారులకు ఇంగ్లాండ్‌కు చెందిన వైద్యులు ఉచిత గుండె ఆపరేషన్లు నిర్వహిస్తారు.
ఫాక్ట్(నిజం): లండన్‌కు చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్ (HLH), సినీహీరో మహేష్ బాబుకు చెందిన స్వచ్ఛంద సంస్థ వంటి పలు సంస్థల సహకారంతో ఆంధ్ర హాస్పిటల్స్ వారు చిన్న పిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్లు చేస్తున్నా, పోస్టులో ప్రచారం చేసినట్టు 28 నవంబర్ 2025 నుండి 05 డిసెంబర్ 2025 తేదీ వరుకు చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయటం లేదు. విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ వర్గాలు ఈ విషయాన్ని మాకు (Factly) స్పష్టం చేశాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా, విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ 28 నవంబర్ 2025 నుండి 05 డిసెంబర్ 2025వ తేదీ వరకు పిల్లలకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు నిర్వహిస్తుందా? అని తెలుసుకోవడానికి మేము (Factly), ఆంధ్ర హాస్పిటల్స్ యాజమాన్యాన్ని సంప్రదించగా, ఈ వార్త ఫేక్ అని, ఆంధ్ర హాస్పిటల్స్ ఈ తేదీలలో పిల్లలకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు నిర్వహించడం లేదని, కానీ వారి ఆసుపత్రులు ఇలాంటి కార్యక్రమాలను చాలాసార్లు నిర్వహించాయని వారు చెప్పారు.
02 ఆగస్టు 2025న ప్రచురితమైన ‘ETV భారత్’ వార్తా కథనం ప్రకారం, UK స్వచ్ఛంద సంస్థ అయిన హీలింగ్ లిటిల్ హార్ట్స్ సౌజన్యంతో విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్‌లో 28 జూలై 2025 నుండి 02 ఆగస్టు 2025 వరకు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు జరిగాయి.

పలు రిపోర్ట్స్ ప్రకారం, హీలింగ్ లిటిల్ హార్ట్స్ (HLH), సినీహీరో మహేష్ బాబుకు చెందిన స్వచ్ఛంద సంస్థ వంటి పలు సంస్థల సహకారంతో ఆంధ్రా హాస్పిటల్స్ చాలా సంవత్సరాలుగా చిన్న పిల్లలకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు చేస్తోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).

2019 లో కూడా విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ 28 నవంబర్ 2019 నుండి 05 డిసెంబర్ 2019 వరకు చిన్న పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేస్తుందని ప్రచారం కాగా, అప్పుడు కూడా ఆ వార్తలో నిజం లేదని Factly ఫాక్ట్-చెక్ కథనాన్ని ప్రచురించింది.
చివరగా, పోస్టులలో ప్రచారం చేసినట్టు, విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ 28 నవంబర్ 2025 నుండి 05 డిసెంబర్ 2025 వరకు చిన్న పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయడం లేదు.

