ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే 2024 అసెంబ్లీ & లోక్‌సభ ఎన్నికల కోసం టీడీపీ, జనసేన మరియు బీజేపీలు కూటమిగా ఏర్పడ్డాయి. పొత్తు తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి ‘ఆత్మీయ సమ్మేళనం’ పేరుతో పలు ప్రాంతాల్లో సమావేశాలు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయవాడ ఆత్మీయ సమావేశంలో కుర్చీలతో ముష్టి యుద్ధం చేసుకుంటున్న కార్యకర్తలు అని చెప్తూ పలు పోస్టులు(ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి మద్దతుగా ఒక గొడవకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తున్న వీడియో ఒకటి జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: టీడీపీ, జనసేన, బీజేపీల ‘ఆత్మీయ సమ్మేళనం’ లో జరిగిన గొడవ దృశ్యాలను చూపిస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోకు ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సంబంధం లేదు. న్యూస్18 ఛానల్ తమిళనాడులోని కాంచీపురంలో 06 ఏప్రిల్ 2024న ‘మక్కల్ సభై’ అనే పేరుతో ఎన్నికలకు సంబంధించిన చర్చ కార్యక్రమం నిర్వహించింది. ఈ చర్చ కార్యక్రమంలో డీఎంకే, బీజేపీ మద్దతుదారుల వాగ్వాదానికి దిగడంతో గొడవ మొదలైంది, ఇరు వర్గాల నేతలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోవడం జరిగింది. వైరల్ వీడియో ఈ గొడవ దృశ్యాలనే చూపిస్తున్నది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ముందుగా వైరల్ పోస్టులో చెప్పినట్లు, ఇటీవల ఏదైనా టీడీపీ, జనసేన, బీజేపీల ‘ఆత్మీయ సమ్మేళనం’లో గొడవ జరిగిందా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఎటువంటి రిపోర్ట్స్ లభించలేదు. ఒకవేళ నిజంగానే ఇలాంటి గొడవ జరిగి ఉంటే.. తప్పకుండా చాలా మీడియా సంస్థలు ఆ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేవి.
ఈ వైరల్ వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే దాడికి సంబంధించిన దృశ్యాలను చూపిస్తున్న వీడియోని ‘UUUFacts’ అనే యూట్యూబ్ ఛానెల్‌లో 07 ఏప్రిల్ 2024న “కుర్చీ కోసం పోరాడుదాం. కుర్చీలు విసిరి కొట్లాడి పోదామా? #న్యూస్18తమిళనాడు” (తమిళం నుండి తెలుగులోకి అనువదించగా) అనే శీర్షికతో అప్‌లోడ్ చేసినట్టు తెలిసింది.
ఈ వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే, తమిళ భాషలో స్టేజీ మీద బ్యానర్లను ఉండటం మనం చూడొచ్చు. అలాగే యూట్యూబ్ వీడియో శీర్షికలో #News 18 తమిళనాడు అని ఉండడాన్ని మనం చూడొచ్చు. ఈ సమాచారం ఆధారంగా మేము ఇంటర్నెట్‌లో వెతకగా, ‘The commune’ అనే వెబ్‌సైట్ ఇదే వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్‌షాట్ రిపోర్ట్ చేస్తు ప్రచురించిన ఒక వార్త కథనం లభించింది. ఈ కథనం ప్రకారం, “న్యూస్ 18 తమిళనాడు రాష్ట్రంలోని వివిధ నగరాల్లో “మక్కల్ సభై” పేరుతో ఎన్నికలకు సంబంధించిన చర్చలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. న్యూస్18 తమిళనాడు 06 ఏప్రిల్ 2024న కాంచీపురంలోని ఉమా మురుగన్ మహల్‌లో “మక్కల్ సభై”నిర్వహించింది . ఈ చర్చకి డీఎంకే నుండి ఎమ్మెల్యే ఎహిలరాసన్, బీజేపీ నుంచి ఎస్‌జీ సూర్య, సీపీఎం నుంచి భారతి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రిపోర్టర్ బాలవేల్ చక్రవర్తి హోస్ట్‌గా వ్యవహరించారు.ఈ చర్చా కార్యక్రమంలో డీఎంకే, బీజేపీ మద్దతుదారుల వాగ్వాదానికి దిగడంతో ఆ హాల్ లో గొడవ మొదలైంది. ఇరు వర్గాల నేతలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోవడం జరిగింది.”
తర్వాత మేము న్యూస్ 18 తమిళనాడు 06 ఏప్రిల్ 2024న కాంచీపురంలో నిర్వహించిన ఈ ‘మక్కల్ సభ’ చర్చ కార్యక్రమాన్ని “LIVE: మక్కల్ సబాయి | లోక్‌సభ ఎన్నికల ఫీల్డ్ 2024 – చివరి రౌండ్‌లో ఎవరు లీడ్ చేస్తారు?” అనే శీర్షికతో వీడియోను లైవ్ స్ట్రీమ్ చేసినట్లు తెలిసింది. ఈ వీడియోలో గొడవకు సంబంధించిన ఎలాంటి దృశ్యాలు లేవు, కానీ వైరల్ వీడియోలోని దృశ్యాలను మరియు ఈ వీడియోలోని దృశ్యాలను పోల్చి చూస్తే రెండు ఒకే సభకు సంబంధించినవని అని మనం నిర్థారించవచ్చు.
ఈ ఘటనకు సంబంధించి ఈ చర్చలో ఫాల్గొన్న బీజేపీ నాయకుడు ఎస్‌జి సూర్య చేసిన ట్వీట్‌ను (ఆర్కైవ్) కూడా మేము గుర్తించాం. కాంచీపురంలో జరిగిన కార్యక్రమంలో డీఎంకే కార్యకర్తలు బీజేపీ సభ్యులపై కుర్చీలు విసరడమే కాకుండా అసభ్య పదాలను ఉపయోగిస్తు దాడి చేసారని ఆయన X(ట్విట్టర్) పోస్టులో ఆరోపించారు.
చివరగా, న్యూస్ 18 తమిళనాడు నిర్వహించిన చర్చలో డీఎంకే, బీజేపీ మద్దతుదారుల మధ్య జరిగిన గొడవ వీడియోను టీడీపీ, జనసేన, బీజేపీల ‘ఆత్మీయ సమ్మేళనం’లో గొడవ జరిగిందని చెప్తూ తప్పుగా చేస్తున్నారు.