అఫ్గానిస్తాన్‌ని తాలిబన్ కైవసం చేసుకున్న నేపథ్యంలో లండన్‌లో రాహుల్ గాంధీ మొదలైన కాంగ్రెస్ నాయకులు తాలిబన్‌తో చర్చలు జరిపారని చెప్తూ కొందరు సిక్కులు భారత దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వీడియోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: లండన్‌లో రాహుల్ గాంధీ మొదలైన కాంగ్రెస్ నాయకులు తాలిబన్‌తో చర్చలు జరిపిన వీడియో.
ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో షేర్ చేసిన వీడియో 2018లో లండన్‌లోని రుయిస్లిప్‌లో ప్రవాస భారతీయులతో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో నలుగురు ఖలిస్తాని మద్దతుదారులు ప్రవేశించి భారత్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఘటనకి సంబంధించింది. ఈ వీడియోకి అఫ్గానిస్తాన్‌కి లేదా తాలిబన్‌కి ఎటువంటి సంబంధంలేదు. పైగా రాహుల్ గాంధీ లేదా మరే ఇతర కాంగ్రెస్ నాయకులు లండన్‌లో కాని ఇతర ప్రాంతంలో కాని తాలిబన్‌తో చర్చలకు కలిసినట్టు ఎటువంటి సమాచారం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వీడియోకి సంబంధించి మరింత సమాచారం కోసం గూగుల్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని 2018లో రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనం మాకు దొరికాయి. ఈ కథనాల ప్రకారం 2018లో లండన్‌లోని రుయిస్లిప్‌లో ప్రవాస భారతీయులతో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో నలుగురు ఖలిస్తాని మద్దతుదారులు ప్రవేశించి భారత్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేయగా పోలీసులు వారిని అక్కడి నుండి పంపించేసారు. పోస్టులోని వీడియో ఈ ఘటనకి సంబంధించిందే. ఐతే ఈ మీటింగ్‌లో రాహుల్ గాంధీ ప్రసంగించాల్సి ఉండగా, రాహుల్ గాంధీ మీటింగ్‌కి రాకముందే ఈ ఘటన చోటుచేసుకుంది.
అంతకు ముందు రాహుల్ గాంధీ 1984 సిక్కు అల్లర్లలో కాంగ్రెస్ పాత్రపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఇలా నిరసన తెలిపినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. ఈ వీడియోని రిపోర్ట్ చేసిన మరొకొన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ కథనాల ప్రకారం ఈ వైరల్ వీడియో 2018లో జరిగిన ఘటనకి సంబంధించిందని, ఈ వీడియోకి అఫ్గానిస్తాన్‌కి లేదా తాలిబన్‌కి ఎటువంటి సంబంధంలేదని స్పష్టంగా అర్ధమవుతుంది.
పైగా రాహుల్ గాంధీ లేదా మరే ఇతర కాంగ్రెస్ నాయకులుగాని లండన్‌లో లేదా మరే ఇతర ప్రాంతంలో తాలిబన్లను కలిసినట్టు ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే ఇలా జరిగి ఉంటే, వార్తా సంస్థలు ఈ విషయాన్ని ప్రచురించేవి, అటువంటి రిపోర్ట్స్ కూడా ఏమీ లేవు.
చివరగా, 2018లో లండన్ లో జరిగిన కాంగ్రెస్ మీటింగ్ కి సంబంధించిన వీడియోని కాంగ్రెస్ – తాలిబన్ల మధ్య చర్చలంటూ షేర్ చేస్తున్నారు.