Fake News, Telugu
 

లఖీంపూర్ ఖేరి ఘటనలో పాల్గొన్న ఖలిస్తాన్ మద్దతుదారుల ఆస్తులని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం జప్తు చేసినట్టు షేర్ చేస్తున్న ఈ సమాచారం తప్పు

0

లఖీంపూర్ ఖేరిలో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలో పాల్గొన్న 58 మంది ఖలిస్తాన్ టెర్రరిస్టులని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం గుర్తించి వారి ఆస్తులని జప్తు చేసినట్టు సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. జప్తు చేసిన ఈ ఆస్తులని లఖీంపూర్ ఘటనలో చనిపోయిన 8 మంది అమాయక ప్రజల కుటుంబాలకు ఇవ్వనున్నట్టు ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: లఖీంపూర్ ఖేరిలో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలో పాల్గొన్న 58 మంది ఖలిస్తాన్ టెర్రరిస్టులని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం గుర్తించి వారి ఆస్తులని జప్తు చేసింది.

ఫాక్ట్ (నిజం): లఖీంపూర్ ఖేరిలో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలో ఖలిస్తాన్ మద్దతుదారులు పాల్గొన్నట్టు FIRలో గాని, పోలీస్ విచారణలో గానీ ఇంకా వెల్లడించలేదు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 58 మంది ఖలిస్తాన్ సానుభుతికారుల ఆస్తులని జప్తు చేసి లఖీంపూర్ బాధిత కుటుంబాలకు ఆర్ధిక సహాయం చేస్తున్నట్టు కూడా ఎక్కడా రిపోర్ట్ కాలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం గుగూల్‌లో వెతికితే, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లఖీంపూర్ ఘటనలో పాల్గొన్న ఖలిస్తాని మద్దతుదారుల ఆస్తులని జప్తు చేసినట్టు ఇంటర్నెట్‌లో ఎటువంటి న్యూస్ రిపోర్ట్ అవలేదని తెలిసింది. ఒకవేళ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం లఖీంపూర్ ఖేరి ఘటనలో పాల్గొన్న ఖలిస్తాన్ మద్దతుదారుల ఆస్తులని జప్తు చేసి ఉంటే, ఆ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ వార్తలు వచ్చి ఉండాలి. బబ్బర్ ఖాల్సా సంస్థ మాజీ సభ్యుడు లఖీంపూర్ ఖేరి దుర్ఘటనకు ముందు ‘Lalkar’ అనే పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్‌ని రూపొందించినట్టు ‘News 18’ న్యూస్ సంస్థ 04 అక్టోబర్ 2021 నాడు ట్వీట్ చేసింది. కానీ, ‘News 18’ రిపోర్ట్ చేసిన ఈ వార్త అధికారికంగా ధృవీకరించిన సమాచారం కాదు.

03 అక్టోబర్ 2021 నాడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఖేరిలో రైతులు చేపట్టిన ఆందోళనలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా రైతు ఉద్యమకారులని కార్లతో తొక్కించారని ఆరోపిస్తూ లఖీంపూర్ ఖేరి జిల్లా తికోనియా పోలీస్ స్టేషన్‌లో FIR ఫైల్ చేసారు. ఈ ఘటనలో నలుగురు రైతులతో సహా 9 మంది చనిపోయారని న్యూస్ ఆర్టికల్స్ రిపోర్ట్ చేసాయి. ఆ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. లఖీంపూర్ ఖేరి ఘటనలో ఖలిస్తాని సానుభూతిపరులు పాల్గొన్నట్టు FIRలో గానీ, ఈ న్యూస్ ఆర్టికల్స్ గాని ఎక్కడా తెలుపలేదు.

లఖీంపూర్ ఖేరి కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణ ఎదురుకుంటున్న ఆశిష్ మిశ్రాను ఉత్తరప్రదేశ్ పోలీసులు 09 అక్టోబర్ 2021 నాడు అరెస్ట్ చేసారు. 13 అక్టోబర్ 2021 నాడు ఆశిష్ మిశ్రా ఫైల్ చేసిన బెయిల్ పిటిషన్‌ని కోర్టు కొట్టివేస్తూ ఆశిష్ మిశ్రాకు మరో 14 రోజులు జుడిషియల్ రిమాండ్ విధించింది. లఖీంపూర్ ఖేరి దుర్ఘటనలో ఖలిస్తానిల హస్తం ఉందని ఉత్తరప్రదేశ్ పోలీసులు గానీ లఖీంపూర్ క్రైమ్ బ్రాంచ్ కోర్టు గానీ ఎక్కడా నిర్ధారించలేదు. ఈ వివరాల ఆధారంగా యోగి ఆదిత్యనాథ్ లఖింపూర్ ఖేరి హింసా ఘటనలో పాల్గొన్న 58 మంది ఖలిస్తానిల ఆస్తులు జప్తు చేసిన మాట పూర్తిగా అవాస్తవమని చెప్పవచ్చు. ఘటన జరిగిన తర్వాత ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చనిపోయిన నలుగురు రైతుల కుటుంబాలకు 45 లక్షల పరిహారం ప్రకటించింది.

చివరగా, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఖలిస్తాని మద్దతుదారుల ఆస్తులని జప్తు చేయలేదు; లఖీంపూర్ ఘటనలో ఖలిస్తాన్ నిరసనకారులను గుర్తించి, వాళ్ళ ఆస్తులు జప్తు చేయబోతున్నట్టు ఎక్కడా అధికారిక సమాచారం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll