Fake News, Telugu
 

దేశం మొత్తంలో మంజూరైన ఇళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 20% కేటాయించారన్న వార్తలో నిజం లేదు

0

‘2014 నుంచి ఇప్పటి వరకు దేశం మొత్తంలో మంజూరైన ఇళ్ళలో 20% ఒక్క APకే ఇచ్చారు. కాని అందులో పూర్తై గృహప్రవేశం చేసిన ఇళ్ళు గత 7 ఏళ్ళలో 1% కూడా లేవు’ అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమెంతో చూద్దాం.

క్లెయిమ్: 2014 నుంచి ఇప్పటి వరకు దేశం మొత్తంలో మంజూరైన ఇళ్ళలో 20% ఒక్క APకే ఇచ్చారు. కాని అందులో పూర్తై గృహప్రవేశం చేసిన ఇళ్ళు గత 7 ఏళ్ళలో 1% కూడా లేవు.

ఫాక్ట్ (నిజం): ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – అర్బన్, గ్రామీణ పథకాల కింద ఇప్పటి వరకు దేశం మొత్తంలో 3,15,82,585 ఇళ్ళు మంజూరు కాగా, ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారు 6.67% ఇళ్ళు అనగా 21,07,415 ఇళ్ళు మంజూరయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరైన వాటిలో ఇప్పటివరకు 5,11,073 ఇళ్ళ నిర్మాణం పూర్తయింది, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేసినదాంట్లో 24.25% ఇళ్ళ నిర్మాణం పూర్తయింది. కాకపోతే పూర్తయిన ఇళ్ళను లబ్దిదారులకు అందించే విషయంలో ప్రస్తుత ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్):

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) వెబ్సైటులో 28 సెప్టెంబర్ 2021 నాటికి ఉన్న సమాచారం ప్రకారం ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మినహాయిస్తే మిగతా అన్ని రాష్ట్రాలకు కలిపి కేంద్ర ప్రభుత్వం 1,08,71,718 ఇళ్ళను మంజూరు చేసింది. ఈ మొత్తంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 20,39,361 ఇళ్ళను మంజూరు చేసింది, అంటే మొత్తం అన్ని రాష్ట్రాల్లో మంజూరు చేసిన దాంట్లో 18.75% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేసింది.

ఐతే దేశం మొత్తంలో మంజురైన దాంట్లో 48,94,190 ఇళ్ళ నిర్మాణం పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇప్పటివరకి 4,64,363 ఇళ్ళ నిర్మాణం పూర్తయింది. అంటే దేశం మొత్తంలో నిర్మాణం పూర్తయిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ వాటా 9.5% కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేసినదాంట్లో 22.77% ఇళ్ళ నిర్మాణం పూర్తయింది.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ):

ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) కింద దేశం మొత్తంలో 2,07,10,867 ఇళ్ళను మంజూరు చేయగా, ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 68,054 ఇళ్ళను మంజూరు చేసింది. అంటే దేశం మొత్తం మంజూరు చేసిన దాంట్లో 0.32% ఇళ్ళను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేసింది.

ఐతే దేశం మొత్తంలో మంజూరైన దాంట్లో 1,60,75,182 ఇళ్ళ నిర్మాణం పూర్తికాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకి 46,710 ఇళ్ళ నిర్మాణం పూర్తయింది. అంటే దేశం మొత్తంలో నిర్మాణం పూర్తయిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ వాటా 0.29%. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేసిన దాంట్లో 68.63% ఇళ్ళ నిర్మాణం పూర్తయింది.

ఐతే పట్టణ, గ్రామీణ ప్రాంతాలు కలుపుకొని దేశంలో మొత్తం 3,15,82,585 ఇళ్ళు మంజూరు కాగా, ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారు 6.67% ఇళ్ళు అనగా 21,07,415 ఇళ్ళు మంజూరయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరైన వాటిలో ఇప్పటివరకి 5,11,073 ఇళ్ళ నిర్మాణం పూర్తయింది, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేసినదాంట్లో 24.25% ఇళ్ళ నిర్మాణం పూర్తయింది. దేశం మొత్తంలో నిర్మాణం పూర్తయిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ వాటా 2.43%.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన ఇళ్ళకు సంబంధించిన వివరాలు పైన తెలిపిన విధంగా ఉండగా, ఈ ఇళ్ళను లబ్దిదారులకు అందించిన విషయానికి సంబంధించిన డేటా మాకు లభించలేదు. కాకపోతే పూర్తయిన ఇళ్ళను లబ్దిదారులకు అందించే విషయంలో ప్రస్తుత ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని, గత ప్రభుత్వ హాయాంలో నిర్మించిన ఇళ్ళను కూడా ఇంకా లబ్దిదారులకు అందించలేదని వార్తా కథనాలు ఉన్నాయి.

ఇందిర ఆవాస్ యోజన:

ఇందిర ఆవాస్ యోజన అనే పేరుతో 1985లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద ప్రజల కోసం ఇళ్ళ నిర్మించి ఇచ్చే ఒక పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం మొదలుపెట్టినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 32,62,184 ఇళ్ళను నిర్మించారు.

ఐతే మోదీ మొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ పథకానికే కొన్ని మార్పులు ద్వారా రీడిజైన్ చేసి 2016లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన- గ్రామీణ పేరుతో ఒక పథకాన్ని మొదలుపెట్టారు. అలాగే పట్టణ ప్రాంతాల్లోని పేదల కోసం  ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – అర్బన్ పేరుతో 2015లో ఇల్లు నిర్మించి ఇచ్చే పథకాన్ని ప్రారంభించారు.

చివరగా, దేశం మొత్తంలో మంజూరైన ఇళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 20% కేటాయించారన్న వార్తలో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll