Fake News, Telugu
 

మెక్సికోలో జరిగిన పాత హింసాత్మక ఘటన వీడియోని కేరళలో ముస్లింలు హిందువులని చంపుతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

కేరళలో ముస్లింలు హిందువులని దారుణంగా హింసించి చంపుతున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. కాళ్ళు, చేతులు నరికేసి క్రూరంగా ఒక మనిషిని విచారిస్తున్న దృశ్యాలని మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోకి సంబంధించి వివరణ కోరుతూ మా వాట్సాప్ టిప్‌లైన్‌కు (+91 9247052470) చాలా అభ్యర్ధనలు వచ్చాయి. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కేరళలో ముస్లింలు హిందువులని దారుణంగా హింసించి చంపుతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్న ఘటన 2018లో మెక్సికో దేశంలోని చాహుటీస్ టౌన్లో చోటుచేసుకుంది.  పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది, ఇంకా కేరళ రాష్ట్రానికి సంబంధించినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘ShockGore.com’ వెబ్సైటులో 08 ఆగష్టు 2018 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. వీడియోలో కనిపిస్తున్న ఘటన మెక్సికో దేశంలోని చాహుటీస్ టౌన్లో చోటుచేసుకుందని ఈ వెబ్సైటులో తెలిపారు. ఈ వీడియోని ఇదే వివరణతో మరికొన్ని వెబ్సైట్లు కూడా పబ్లిష్ చేసాయి.

ఈ వివరాల ఆధారంగా వీడియోలోని ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం వెతకగా, ఈ ఘటనకు సంబంధించి ‘Diario Extra’ అనే వార్తా సంస్థ 06 ఆగష్టు 2018 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఓక్సాకా నగరం సమీపంలోని చాహుటీస్ టౌన్లో ఈ ఘటన చోటుచేసుకుందని, మెక్సికో పోలీసులు ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు మొదలు పెట్టారని ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. దుండగులు బాధితుడి కాళ్ళు చేతులు నరికేసి జువానిటో కాస్టెల్లానోస్ అనే వ్యక్తిని ఎవరు హత్య చేసారని విచారించినట్టు ఈ ఆర్టికల్‌లో తెలిపారు. ఈ ఘటనకి సంబంధించి పబ్లిష్ చేసిన మరికొన్ని ఆర్టికల్స్ ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో మెక్సికో దేశంలో చోటుచేసుకున్న ఒక పాత హింస ఘటనకు సంబంధించిందని, ఈ వీడియోకి కేరళ రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, మెక్సికో దేశంలో చోటుచేసుకున్న ఒక పాత హింసాత్మక ఘటన వీడియోని కేరళ రాష్ట్రంలో ముస్లింలు హిందువులని దారుణంగా హింసించి చంపుతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.  

Share.

About Author

Comments are closed.

scroll