Fake News, Telugu
 

పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రం ఆర్జించిన 4.55 లక్షల కోట్లలో రాష్ట్రాలకు నికరంగా 49% వాటా ఉండదు

0

‘2021 ఆర్థిక సంవత్సరంలో పెట్రో ఉత్పత్తుల అమ్మకాలపై కేంద్రానికి 4.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరగా, ఇందులో సగానికి సగం (49%) రాష్ట్ర ప్రభుత్వాలకే వెళ్తుందని’ చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2021 ఆర్థిక సంవత్సరంలో పెట్రో ఉత్పత్తుల అమ్మకాలపై కేంద్రానికి 4.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరగా, ఇందులో సగానికి సగం (49%) రాష్ట్ర ప్రభుత్వాలకే వెళ్తుంది.

ఫాక్ట్(నిజం): 2020-21 సంవత్సరానికి గాను కేంద్ర ఖజానాకి పెట్రోలియం రంగం నుండి 4.55 లక్షల కోట్లు ఆదాయం చేకూరింది. ఇందులో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో కేంద్ర వసూలు చేసింది 3.71 లక్షల కోట్లు. ఇలా ఎక్సైజ్ డ్యూటీ రూపంలో వసూలు చేసిన దాంట్లో రాష్ట్రాల వాటా రూ. 19,972 కోట్లు మాత్రమే. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్కువ శాతం సెస్‌ల రూపంలో వసూలు చేస్తుంది, ఇలా సెస్‌ల రూపంలో వసూలు చేసిన దాంట్లో రాష్ట్రాలకు వాటా ఉండదు, అందుకనే ఎక్సైజ్ డ్యూటీలో రాష్ట్రాల వాటా చాలా తక్కువగా ఉంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇటీవల లోక్‌సభ మరియు రాజ్యసభలో పలువురు ఎంపీలు పెట్రోల్, డీజిల్‌పై విధించే టాక్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్జించిన ఆదాయానికి సంబంధించి ప్రశ్నలు అడగగా, సంబధిత మంత్రులు ఈ వివరాలను అందించారు. ఈ క్రమంలోనే 20 డిసెంబర్ 2021న ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ 2020-21 సంవత్సరానికి గాను కేంద్ర ఖజానాకి పెట్రోలియం రంగం నుండి 4.55 లక్షల కోట్లు ఆదాయం చేకూరిందని పేర్కొన్నారు. పోస్టులో తెలిపిన గణాంకాలు ఈ జవాబు నుండి సేకరించినవే.

పెట్రోలియం మంత్రిత్వ శాఖ అద్వర్యంలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలిసిస్ సెల్ వెబ్సైటులో అందుబాటులో ఉన్న సమాచారం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఐతే కేవలం పెట్రోల్ మరియు డీజిల్‌పై విధించే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ మాత్రమే కాకుండా ఇతర టాక్స్‌లను (కస్టమ్స్ డ్యూటీ, క్రూడ్ ఆయిల్ పైన రాయల్టీ, క్రూడ్ ఆయిల్ పైన సెస్స్, మొదలైన ఇతర టాక్స్‌లు) కలిపితే ఈ 4.55 లక్షల ఆదాయం చేకూరింది.

సాధారణంగా కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 41% వాటా ఉంటుందన్న మాట నిజమైనప్పటికీ, పోస్టులో క్లెయిమ్ చేస్తునట్టు కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పతులపై ఆర్జించిన 4.55 లక్షలలో రాష్ట్రాలకు 49% వాటా చేరదు. ఎందుంటే ఉదాహారణకి ఈ 4.55 లక్షల ఆదాయంలో 3.71 లక్షల కోట్లు పెట్రోల్ మరియు డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో కేంద్రం ఆర్జించింది. ఇదే విషయాన్ని 30 నవంబర్ 2021న పార్లమెంట్‌లో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు ఇచ్చిన జవాబులో పేర్కొన్నారు. కానీ, ఈ జవాబు ప్రకారం  సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో వసూలు చేసిన ఈ మొత్తంలో రాష్ట్రాల వాటా రూ. 19,972 కోట్లు మాత్రమే.

ఐతే పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్టు రాష్ట్రాలకు 49% వాటా ఇస్తే, ఈ మొత్తం 3.71 లక్షల కోట్లలో రాష్ట్రాల వాటా విలువ 1.82 లక్షల కోట్లు అవ్వాలి, కాని నిజానికి పైన తెలిపిన పార్లమెంట్ జవాబు ప్రకారం పెట్రోల్ మరియు డీజిల్‌పై విధించే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీలో రాష్ట్రాలకు చెందే వాటా తక్కువగా (రూ. 19,972 కోట్లు) ఉంటుంది.

ఈ వ్యత్యాసం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్‌పై విధించే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీలో ఎక్కువ శాతం సెస్ రూపంలో వసూలు చేస్తుంది (స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ (సెస్), రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్). సెస్ రూపంలో వసూలు చేసిన వాటిలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి వాటా ఉండదు, ఇవి పూర్తిగా కేంద్ర ఖజానాకే చెందుతుంది. ఇకపోతే బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో విధించే టాక్స్‌లో (రూ.1.40/ లీటర్ పెట్రోల్) మాత్రమే డివిజబుల్ పూల్ ద్వారా రాష్ట్రాలకు వాటా ఉంటుంది. ఇదే విషయం పైన తెలిపిన రాజ్యసభ జవాబులో కూడా స్పష్టంగా ఉంది.

పెట్రోల్ మరియు డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం విధించే టాక్స్‌లలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల వాటాకు సంబంధించి, FACTLY గతంలో కూలంకషంగా వివరిస్తూ కథనాలు రాసింది, ఈ కథనాలు ఇక్కడ, ఇక్కడ  మరియు ఇక్కడ చూడొచ్చు.

దీన్నిబట్టి 2020-21 సంవత్సరానికి పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రం ఆర్జించిన 4.55 లక్షల కోట్లలో రాష్ట్రాలకు నికరంగా 49% వాటా ఉండదు. ఇదే విషయాన్ని ఇటీవల వార్తా కథనాలు కూడా ప్రచురించాయి.

చివరగా, పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రం ఆర్జించిన 4.55 లక్షల కోట్లలో రాష్ట్రాలకు నికరంగా 49% వాటా ఉండదు.

Share.

About Author

Comments are closed.

scroll