Fake News, Telugu
 

కర్ణాటకలో శక్తి పథకం కింద మహిళలు రాష్ట్రం లోపల ఎంత దూరమైనా ప్రభుత్వ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు

0

కర్ణాటకాలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామని చెప్పి ఇప్పుడు కేవలం 20 కి.మీ వరకే ఉచితంగా ఇస్తామని, అనంతరం సాగే ప్రయాణానికి డబ్బులు చెల్లించాల్సిందేనని అంటుందని చెప్తున్న పోస్ట్‌లు (ఇక్కడ మరియు ఇక్కడ) సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం స్వయంగా వెల్లడించారు అని కూడా ఈ పోస్టులో చెప్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అందించే ఉచిత బస్సు ప్రయాణానికి 20 కిలోమీటర్ల పరిమితి విధించింది.

ఫాక్ట్(నిజం): కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన శక్తి పథకం ద్వారా రాష్ట్రం లోపల ఎంత దూరమైనా ప్రభుత్వ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు. కాగా ఇతర రాష్ట్రాలలోకి ప్రయాణించే విషయానికి సంబంధించి కేవలం కొన్ని రూట్లలో మాత్రమే ప్రయాణం ఉచితం. ఇతర అంతర్రాష్ట్ర రూట్లలో ప్రయాణంలో పొరుగు రాష్ట్రంలోని 20 కి.మీల దూరం వరకు మాత్రమే ఉచితం. ఆ తరవాత ప్రయాణానికి మాత్రం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని తప్పుగా అర్ధం చేసుకొని మొత్తానికే 20 కి.మీలు ఉచితంగా ప్రయాణించవచ్చని కొన్ని కథనాలు రిపోర్ట్ చేసాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టిస్తుంది.

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించే ‘శక్తి యోజనను’ ఈ నెల 11న ప్రారంభించింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాష్ట్ర అసెంబ్లీ ముందు ఈ పథకాన్ని ప్రారంభించారు.

ఐతే పోస్టులో చెప్తున్నట్టు ఈ పథకం ద్వారా మహిళలకు అందించే ఉచిత ప్రయాణం కేవలం 20 కి.మీ మాత్రమే పరిమితం కాదు. రాష్ట్రానికి చెందిన మహిళలు మరియు ట్రాన్స్‌జెండర్లు ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఎంత దూరమైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథానికి సంబంధించి ఇష్యూ చేసిన డిపార్టుమెంట్ సర్కులర్‌లో ఈ విషయం స్పష్టం చేసారు.

అంతర్రాష్ట్ర ప్రయాణానికి పరిమితులు విధించారు:

కాకపొతే ఈ పథకం కింద ఇతర రాష్ట్రాలలోకి (అంతర్రాష్ట్ర) ప్రయాణానికి  సంబంధించి కొన్ని ఎంపిక చేసిన ఇంటర్‌స్టేట్ రూట్లలో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది. ఇతర అంతర్రాష్ట్ర రూట్లలో మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి అనుమతించబదు. మహిళలు ఉచితంగా ప్రయాణించగలిగే కొన్ని ఇంటర్‌స్టేట్ రూట్ల వివరాలు ఇక్కడ చూడవచ్చు.

లిస్టులో ఉన్న ఇంటర్‌స్టేట్ రూట్లు మినహాయిస్తే ఇతర అంతర్రాష్ట్ర ప్రయాణానికి సంబంధించి కర్ణాటక నుండి పొరుగు రాష్ట్రాల లోపల 20 కిలోమీటర్ల వరకు మాత్రమే ప్రయాణం ఉచితం. 20 కిలోమీటర్లు దాటాక ప్రయాణానికి మాత్రం ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.

ఉదాహరణకు బళ్లారి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని 20 కి.మీ వరకు మహిళలు ఉచితంగా వెళ్లవచ్చు. ఆ తరవాత ప్రయాణానికి మాత్రం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ పథకానికి సంబంధించి ఏర్పట్టు చేసిన ప్రెస్ మీట్‌లో స్పష్టం చేసాడు. ఇదే విషయాన్ని రిపోర్ట్ చేసిన వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఐతే పొరుగు రాష్ట్రాల్లో కేవలం 20 కిలోమీటర్ల వరకే ఉచితంగా ప్రయాణించవచ్చు అనే నిబంధనను తప్పుగా అర్ధం చేసుకొని కొన్ని వార్తా సంస్థలు (ఇక్కడ మరియు ఇక్కడ) ఈ పథకం కింద కేవలం 20 కిలోమీటర్ల వరకే ఉచితంగా ప్రయాణించవచ్చు అని రిపోర్ట్ చేయడంతో సోషల్ మీడియాలో ఈ వార్త విస్తృతంగా షేర్ అవుతుంది.

చివరగా, కర్ణాటకలో శక్తి పథకం కింద మహిళలు రాష్ట్రం లోపల ఎంత దూరమైనా ప్రభుత్వ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు.

Share.

About Author

Comments are closed.

scroll