Fake News, Telugu
 

గత సంవత్సరం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో మానసిక స్థితి బాగోలేని వ్యక్తి EVM కంట్రోల్ యూనిట్‌ను ధ్వంసం చేసిన వీడియోను ప్రస్తుత ఎన్నికలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

0

కర్ణాటకలోని ఒక పోలింగ్ బూత్‌లో కాంగ్రెస్ కార్యకర్త ఒకరు ఓటమి భయంతో పోలింగ్ చీటీల కట్టను నేలకేసి కొట్టాడంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది (ఇక్కడ & ఇక్కడ). ఈ వీడియోలో ఒక వ్యక్తి బ్యాలెట్‌ యూనిట్‌ను ధ్వంసం చేయడం చూడొచ్చు. ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కర్ణాటకలో జరుగుతున్న 2024 ఎన్నికల్లో ఒక పోలింగ్ బూత్‌లో కాంగ్రెస్ కార్యకర్త ఒకరు ఓటమి భయంతో బ్యాలెట్‌ యూనిట్‌ను నేలకేసి కొట్టిన వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ ఘటన 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా మైసూర్ జిల్లాలోని చాముండేశ్వరి అసెంబ్లీ నియోజకవర్గంలోని హూటగల్లిలో పోలింగ్ బూత్‌లో జరిగింది. ఓటు వేయడానికి వచ్చిన శివమూర్తి అనే వ్యక్తి EVM కంట్రోల్ యూనిట్‌ను ధ్వంసం చేసే ప్రయత్నం చేసాడు. పోలీసుల విచారణలో అతని మానసిక స్థితి బాలేదని తెలిసింది. ఆ వ్యక్తిను ఏ రాజకీయ పార్టీకు చెందిన వాడు కాదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్నట్టు ఒక వ్యక్తి బ్యాలెట్‌ యూనిట్‌ను నేలకేసి కొట్టిన విషయం నిజమే అయినప్పటికీ, ఈ ఘటన 2023లో జరిగింది. పైగా ఆ వ్యక్తికి కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి సంబంధం లేదు. ఈ వీడియోకు సంబంధించి మరింత సమాచారం కోసం వీడియో స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదే వీడియోను రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి.

ఈ కథనాల ప్రకారం ఈ ఘటన గత సంవత్సరం జరిగిన కర్ణాటక ఎన్నికల సందర్బంగా మైసూర్ జిల్లాలో జరిగింది.  చాముండేశ్వరి అసెంబ్లీ నియోజకవర్గంలోని హూటగల్లిలో పోలింగ్ బూత్‌లో శివమూర్తి అనే వ్యక్తి ఓటు వేయడానికి వచ్చి EVM కంట్రోల్ యూనిట్‌ను ద్వంసం చేసాడు (ఇక్కడ & ఇక్కడ).

విచారణలో ఆ వ్యక్తి మానసిక స్థితి బాలేదని తెలిసిందని, పోలీసులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారని, తర్వాత అతను బెయిల్‌పై విడుదలయ్యాడని పోలీసులు తెలిపినట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేశాయి. ఈ సమాచారాన్ని బట్టి ఈ వీడియోలోని ఘటనకు ప్రస్తుత ఎన్నికలు/కాంగ్రెస్ పార్టీకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టమవుతుంది. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో షేర్ అవుతుండడంతో ఎన్నికల కమిషన్ కూడా ఇది పాత వీడియో అని స్పష్టం చేసింది.

చివరగా, 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో మానసిక స్థితి బాగోలేని వ్యక్తి EVM కంట్రోల్ యూనిట్‌ను ధ్వంసం చేసిన వీడియోను ప్రస్తుత ఎన్నికలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll