బాబ్రీ మసీదు కూల్చివేత దృశ్యాలను భారీ స్క్రీన్‌లపై బంగ్లాదేశ్‌లో చూపిస్తున్నారు అని చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). బంగ్లాదేశ్‌లో మతవిద్వేషాలను రెచ్చగొట్టడానికి ఇలా చేస్తున్నారని క్లెయిమ్ చేస్తూ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు యూజర్లు. ఈ కథనం ద్వారా ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలను తెలుసుకుందాం.
క్లెయిమ్: బాబ్రీ మసీదు కూల్చివేత వీడియోని బంగ్లాదేశ్‌లో భారీ స్క్రీన్‌లపై ప్రదర్శిస్తున్నారు. ఈ వీడియోలో అటువంటి సంఘటనని చూడవచ్చు.
ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియో మహారాష్ట్రలోని థానేలోని ముంబ్రాలో జరిగిన ఒక ప్రదర్శనను చూపిస్తుంది, బంగ్లాదేశ్‌లో కాదు. బంగ్లాదేశ్‌లో ఇలాంటి ప్రదర్శనలు జరుగుతున్నాయని ఎటువంటి వార్తా కథనాలు లేవు. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.
వైరల్ అవుతున్న ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో సెర్చ్ చేశాము. కానీ ఈ సెర్చ్‌లో హిందువులపై హింసను ప్రేరేపించేందుకు బంగ్లాదేశ్‌లో బాబ్రీ మసీదు కూల్చివేత వీడియోని ప్రదర్శిస్తున్నారు అని చెప్పడానికి ఎటువంటి విశ్వసనీయ సమాచారం లేదా వార్తా కథనాలు లభించలేదు.
వైరల్ వీడియోలోని ఫుటేజీని చూస్తున్నప్పుడు, బాబ్రీ మసీదు వీడియో ప్రదర్శించబడుతున్న స్క్రీన్ కింద భాగంలో ఆంగ్లంలో ‘సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా,’ అని రాసి ఉండడం గమనించాము. ఇది ఒక భారతీయ రాజకీయ పార్టీ. వీడియో తీసిన లొకేషన్‌లో SDPI జెండాలు కూడా ఉంచడం మేము గమనించాము.
SDPI వారి సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఈ వీడియోను వాళ్లు అప్‌లోడ్ చేశారో లేదో అని చెక్ చేయడానికి ఇంటర్నెట్‌లో ఒక కీవర్డ్ సెర్చ్ చేసాము. ఈ సెర్చ్ ద్వారా వైరల్ వీడియో కనిపిస్తున్న విజువల్స్ ఉన్న వీడియో ఒకటి SDPI ముంబ్రా కల్వా (థానేలోని ప్రాంతాలు) వారి Instagram పేజీలో దొరికింది.
ఈ పోస్ట్ యొక్క వివరణ ప్రకారం, ఈ వీడియో ముంబ్రాలోని దారుల్ ఫలహ్‌లో నిర్వహించిన ‘బాబ్రీ మసీద్ టైమ్‌లైన్ ఎగ్జిబిషన్’ని చూపిస్తుంది. అలాగే, SDPI ముంబ్రా యొక్క Facebook పేజీలో ఇదే వీడియో మాకు కనిపించింది. అదనంగా, వారి YouTube ఛానెల్ మరియు Facebook పేజీలో వైరల్ వీడియోని అప్‌లోడ్ చేశారని కూడా మేము కనుగొన్నాము.
SDPI చేసిన పోస్ట్‌లలో పేర్కొన్న లొకేషన్‌ను నిర్ధారించడానికి, దారుల్ ఫలాహ్, ముంబ్రా కోసం మేము Google Mapsలో సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ ద్వారా ఇది మంబ్రాలో ఉన్న ఒక మసీదు అని తెలుసుకున్నాము. ఇదే మసీదును మనం వైరల్ వీడియోలో కూడా చూడవచ్చు.
చివరిగా, భారతదేశంలోని థానేలో ప్రదర్శించబడుతున్న ‘బాబ్రీ మసీదు’ యొక్క వీడియోని బంగ్లాదేశ్‌లో జరిగిన సంఘటన అని తప్పుగా షేర్ చేస్తున్నారు.