Fake News, Telugu
 

పంజాబ్‌కి (భారత్) సంబంధించిన వీడియోని పాకిస్థాన్‌లో ఒక సిక్కు వ్యక్తిని కొడుతున్నట్టు షేర్ చేస్తున్నారు

0

పాకిస్థాన్‌లో సిక్కుల పరిస్థితిని చూపెడుతున్నట్టు చెప్తూ, ఒక వీడియోని సోషల్ మీడియాలో కొంత మంది పోస్ట్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని రక్తం వచ్చేలా కొడుతున్నట్టు చూడవచ్చు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: పాకిస్థాన్‌లో ఒక సిక్కు వ్యక్తిని కొడుతున్న వీడియో.

ఫాక్ట్: పోస్ట్‌లోని వీడియో పాకిస్థాన్ దేశానికి సంబంధించింది కాదు. వీడియోలోని ఘటన భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లోని వీడియో గురించి ఇంటర్నెట్‌లో కొన్ని పంజాబీ పదాలతో వెతకగా, అలాంటి వీడియోనే ఒకటి దొరుకుతుంది. ఒక యూట్యూబ్ ఛానల్ వారు ఆ వీడియోని పోస్ట్ చేసి, వీడియోలోని ఘటన పంజాబ్‌లోని లుథియానాలో, టిబ్బా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్టు చెప్పారు.

‘సిఖ్ సంగత్ ఉత్తరాఖండ్’ ఫేస్బుక్ పేజీ వారు వీడియోలోని ఘటనపై 05 మార్చి 2022న ఒక లైవ్ వీడియో పెట్టినట్టు ఇక్కడ చూడవచ్చు. ఆ వీడియోలో యాంకర్‌తో పంజాబ్ పోలీసు వారు మాట్లాడుతూ, వీడియోలోని ఘటన 01 మార్చి 2022న టిబ్బా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని చెప్పినట్టు వినవచ్చు. ఆ ఘటనకి సంబంధించిన FIR కాపీని ఇక్కడ చూడవచ్చు. వీడియోలో దెబ్బలు తింటున్న వ్యక్తి ఫోన్ దొంగలించడానికి ప్రయత్నించినట్టు తెలిసింది.

అయితే, వీడియోలో సిక్కు వ్యక్తిని రక్తం వచ్చేలా కొడుతున్న వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్తూ కొందరు సిక్కులు కోరుతున్నారు. ఆ అభ్యర్థనలకు సంబంధించిన వీడియోలను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు. 

చివరగా, పంజాబ్‌కి (భారత్) సంబంధించిన వీడియో పెట్టి, పాకిస్థాన్‌లో ఒక సిక్కు వ్యక్తిని కొడుతున్నట్టు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll