Fake News, Telugu
 

ఎడిట్ చేసిన వీడియోను కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ప్రజలు ‘మోదీ మోదీ’ అని నినాదాలు చేస్తున్నట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు

0

కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ‘రాహుల్ గాంధీ జిందాబాద్’ అని నినాదాలు చేయమని కోరగా సభలోని ప్రజలు ‘మోదీ మోదీ’ అని నినాదాలు చేసారని క్లెయిమ్ చేస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ప్రచారం అవుతోంది. ఈ క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం.

ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ప్రజలు ‘మోదీ మోదీ’ అని నినాదాలు చేస్తున్న వీడియో. 

ఫాక్ట్ (నిజం): ఇది ఎడిట్ చేసిన వీడియో. ఈ వీడియోలో  ప్రజలు ‘రాహుల్ గాంధీ జిందాబాద్’ అని నినాదాలు చేసారు, ‘మోదీ మోదీ’ అని నినాదాలు చేయలేదు. ఈ వీడియో గుజరాత్ రాష్ట్రానికి చెందిన MLA, అల్పేష్ ఠాకూర్ 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు తీశారు. కావున, ఈ క్లెయిమ్ తప్పు

ఈ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు అల్పేష్ ఠాకూర్, ఈయన గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఒక MLA. కాంగ్రెస్ ర్యాలీలో ఈయన ప్రసంగిస్తున్న వీడియోల కోసం యూట్యూబ్ లో వెతికితే వైరల్ అవుతున్న వీడియో క్లిప్పింగ్  ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు తీసిన వీడియోలో నుంచి తీసుకున్నట్టు తెలుస్తుంది. 

ఈ సమాచారంతో యూట్యూబ్ లో అల్పేష్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు తీసిన వీడియోల గురించి వెతికితే, దానికి సంబంధించిన ఒరిజినల్ వీడియో కనిపించింది. 

ఈ ఒరిజినల్ వీడియోలో (ఆర్కైవ్) 23:20 సమయం దగ్గర అల్పేష్ ఠాకూర్ ‘రాహుల్ గాంధీ’ పేరు చెప్పగానే ప్రజలు ‘జిందాబాద్  జిందాబాద్’ అనే నినాదాలు చేయడం చూడవచ్చు. కానీ, వైరల్ వీడియోలో మాత్రం ప్రజలు ‘జిందాబాద్’’ కాకుండా ‘మోదీ మోదీ’ అని నినాదాలు చేస్తున్నట్టు ఎడిట్ చేశారు. అంతేకాక, అల్పేష్ ఠాకూర్ తన ప్రసంగానికి ముందు ప్రజలని  మౌనంగా ఉండమని కోరాడు,  దీనిని వైరల్ వీడియోలో ప్రజలు నినాదాలు చేసిన తరువాత పెట్టి అల్పేష్ ఠాకూర్ జనాలను మోదీకి అనుకూలంగా నినాదాలు చేయకుండా ఆపుతున్నట్టు చూపించారు. 

చివరగా, ఎడిట్ చేసిన వీడియోను కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ప్రజలు ‘మోదీ మోదీ’ అని నినాదాలు చేస్తున్నట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll