Fake News, Telugu
 

బ్రెజిల్‌కి సంబంధించిన వీడియోని శ్రీనగర్‌ పోలీసులు ఉగ్రవాదిని పట్టుకుంటున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు

0

జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలోని శ్రీనగర్‌లో పోలీసులు ఒక ఉగ్రవాదిని పట్టుకుంటున్న లైవ్ దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. భారత ఆర్మీ జవాన్లు ఇటీవల హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థకు చెందిన ఒక ఉగ్రవాదిని జమ్మూ కాశ్మిర్‌లో అరెస్ట్ చేసిన నేపథ్యంలో, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: శ్రీనగర్‌ పోలీసులు ఒక ఉగ్రవాదిని పట్టుకుంటున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్న ఘటన 01 ఆగష్టు 2021 నాడు బ్రెజిల్ దేశంలోని పేరోలా నగరంలో చోటుచేసుకుంది. పేరోలా నగరంలో మిలిటరీ పోలీసులు పాట్రోలింగ్ నిర్వహిస్తుండగా, బైక్ పై ప్రయాణిస్తున్న 17 సంవత్సరాల ఒక యువకుడు, పోలీసుల ఆదేశాలను లెక్కచేయకుండా వారి నుంచి వేగంగా  తప్పించుకున్నాడు. అనుమానాస్పదంగా కనిపించిన ఆ యువకుడిని పోలీసులు చేదించి ఇలా పట్టుకున్నారు. ఈ ఘటన భారతదేశంలోని శ్రీనగర్‌లో చోటుచేసుకోలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Paraná no Ar’ అనే న్యూస్ ఛానల్ 03 ఆగష్టు 2021 నాడు తమ యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోలో కనిపిస్తున్న ఘటన 01 ఆగష్టు 2021 నాడు బ్రెజిల్ దేశంలోని పేరోలా నగరంలో చోటుచేసుకున్నట్టు వివరణలో తెలిపారు. పోలీసుల ఆదేశాలను లెక్కచేయకుండా బైక్ మీద వేగంగా తప్పించుకొని వెళ్ళిన ఒక యువకుడిని, పేరోలా పోలీసులు చేదించి పట్టుకుంటున్న దృశ్యాలని ఈ వీడియోలో తెలిపారు.  

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలని తెలుపుతూ బ్రెజిల్ దేశానికి చెందిన ‘ricmais’ న్యూస్ సంస్థ 02 ఆగష్టు 2021 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసింది. పేరోలా నగరంలో మిలిటరీ పోలీసులు పాట్రోలింగ్ నిర్వహిస్తుండగా, బైక్ పై ప్రయాణిస్తున్న 17 సంవత్సరాల ఒక యువకుడు, పోలీసుల ఆదేశాలను లెక్కచేయకుండా వారి నుంచి వేగంగా  తప్పించుకొని వెళ్లినట్టు ఈ ఆర్టికల్‌లో తెలిపారు. అనుమానాస్పదంగా కనిపించిన ఆ యువకుడిని పోలీసులు కారులో చేదించి పేరోలా నగరంలోని ‘Pearl Avenue Byington’ జంక్షన్ దగ్గర పట్టుకున్నట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. ఆ యువకుడు మళ్ళీ పోలీసుల నుండి తప్పించుకోవాలని ప్రయత్నించడంతో, పెరోలా పోలిస్ ఒకరు అతన్ని ఇలా గాలిలో ఎగిరి తన్నిన్నట్టు ఈ ఆర్టికల్‌లో స్పష్టంగా తెలిపారు.

లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం, స్టాప్ ఆర్డర్‌లను బేఖాతరు చేయడం, ప్రమాదకరమైన డ్రైవింగ్, తప్పుడు మార్గంలో డ్రైవింగ్ చేయడం వంటి కారణాల కింద ఆ యువకుడిని పెరోలా పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ ఘటనకు సంబంధించి పబ్లిష్ అయిన మరికొన్ని న్యూస్ అర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోలోని ఘటన బ్రెజిల్ దేశంలో చోటుచేసుందని, భారత దేశంలోని శ్రీనగర్‌లో జరగలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, బ్రెజిల్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన ఒక యువకుడిని చేదించి పట్టుకున్న వీడియోని శ్రీనగర్‌ పోలీసులు ఒక ఉగ్రవాదిని పట్టుకుంటున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll