Fake News, Telugu
 

బంగ్లాదేశ్ కి సంబంధించిన వీడియోని బెంగాల్ లో హిందూ అమ్మాయిపై TMC కార్యకర్తల దాడి అని షేర్ చేస్తున్నారు

0

కొందరు వ్యక్తులు ఒక అమ్మాయిని ఎత్తుకెళ్తున్న ఒక 25 సెకండ్స్ నిడివి గల ఒక వీడియోని షేర్ చేస్తూ, పశ్చిమ బెంగాల్ లో TMC కార్యకర్తలు ఒక హిందూ అమ్మాయిని బలాత్కరించి చంపిన సంఘటనదని చెప్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పశ్చిమ బెంగాల్ లో TMC కార్యకర్తలు ఒక హిందూ అమ్మాయిని ఎత్తుకెళ్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియో బంగ్లాదేశ్ లోని భోలా జిల్లాలోని దౌలత్ఖాన్ ప్రాంతంలో జరిగిన ఒక సంఘటనకి సంబంధించింది. ముస్లిం వ్యక్తిని ప్రేమించి ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఆ అబ్బాయిని పెళ్ళిచేసుకొన్న ఒక హిందూ అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు పోలీసుల సహాయంతో తీసుకెళ్తున్న సందర్భంలో తీసింది ఈ వీడియో. ఈ వీడియోలకి పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన హింసకి గాని లేక TMC కార్యకర్తలకి గాని ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వీడియో కి సంబంధించి మరింత సమాచారం కోసం గూగుల్ లో వెతకగా ఇదే ఘటనకి సంబంధించి ఎక్కువ నిడివి గల ఒక వీడియో ఫేస్ బుక్ లో షేర్ చేసిన ఒక పోస్టు కనిపించింది. ఈ పోస్ట్ లో చెప్తున్న దాని ప్రకారం ఈ వీడియో బంగ్లాదేశ్ లోని భోలా జిల్లాలోని దౌలత్ఖాన్ ప్రాంతంలో జరిగిన ఒక సంఘటనకి సంబంధించింది. హిందూ మతానికి చెందిన ఒక అమ్మాయి ముస్లిం మతానికి చెందిన ఒక అబ్బాయిని ప్రేమించి, తను ఇంట్లోనుండి వెళ్ళిపోయి ఇస్లాం మతానికి మారి ఆ ముస్లిం అబ్బాయిని పెళ్ళిచేసుకొంది. ఈ వీడియో పెళ్లి ఇష్టం లేని ఆ అమ్మాయి తల్లిదండ్రులు తనని ఆ అబ్బాయి దగ్గర నుండి తీసుకెళ్తున్న సందర్భంలో తీసింది.

పైన తెలిపిన పోస్టులో చెప్పిన దాని ఆధారంగా గూగుల్ లో వెతకగా ఈ ఘటనకి సంబంధించి ప్రచురించిన బంగ్లాదేశ్ వార్తా కథనాలు మాకు లభించాయి. ఈ కథనాలు కూడా పైన తెలిపిన ప్రేమ విషయాన్నే ధ్రువీకరించాయి. కాకపోతే ఈ కథనాల ప్రకారం ఆ అమ్మాయి యొక్క జనన ధృవీకరణ పత్రం, స్కూల్ సర్టిఫికేట్ ప్రకారం ఆ అమ్మాయి ఇంకా మైనర్ అయినందున అమ్మాయి కి సంబంధించిన మత మార్పిడి మరియు పెళ్లి చెల్లవని, అందుకే పోలీసులు ఆ అమ్మాయిని ఆమె తల్లిదండ్రులకి అప్పగించారని ఉంది.

ఈ ఘటనకి సంబంధించిన మరొక బంగ్లాదేశ్ వార్తా కథనం కూడా పైన తెలిపిన విషయాన్నే ధృవీకరిస్తుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ వీడియోకి, పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన హింసకి ఎటువంటి సంబంధంలేదని స్పష్టంగా చెప్పొచ్చు.

ఇదే వీడియోని షేర్ చేస్తూ కొందరు బెంగాల్ లో ఇటీవల జరిగిన ఒక యువతి అత్యాచారం మరియు హత్యకు ముడిపెడ్తున్నారు. ఈ సంఘటను సంబంధించి FACTLY ప్రచురించిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్ ఇక్కడ చదవొచ్చు.

ఇటీవల 02 మే 2021న వెలువడ్డ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరిగినట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేసిన నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. 

చివరగా, బంగ్లాదేశ్ కి సంబంధించిన ఒక వీడియోని బెంగాల్ లో TMC కార్యకర్తలు హిందూ అమ్మాయిపై దాడి చేసారంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

ఈ ఫాక్ట్-చెక్ భారత దేశంలోని ఆరు ఫాక్ట్-చెక్ సంస్థల సహకారంతో ఏర్పడ్డ ‘ఏక్తా న్యూస్ కూటమి‘ లో భాగంగా ప్రచురించబడింది.

Share.

About Author

Comments are closed.

scroll