Fake News, Telugu
 

పశ్చిమ బెంగాల్‌లో యువతిని అత్యాచారం చేసి చంపిన ఘటనను తప్పుడు కథనంతో ప్రచారం చేస్తున్నారు

0

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి ఓటు వేసి సపోర్ట్ చేసినందుకు వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాకు కు చెందిన 20 సంవత్సరాల యువతిని TMC కార్యకర్తలు అత్యాచారం చేసి చంపినట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ఆ రాష్ట్రంలోని పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో బీజేపీకి ఓటు వేసినందుకు వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాకి చెందిన 20 సంవత్సరాల యువతిని TMC కార్యకర్తలు అత్యాచారం చేసి చంపేసారు.

ఫాక్ట్ (నిజం): పశ్చిమ బెంగాల్ రాష్ట్రం వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని పింగ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న 21 సంవత్సరాల యువతిని, ఇటీవల ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు అత్యాచారం చేసి చంపేసారు. TMC పార్టీ కార్యకర్తలకు ఈ ఘటనతో ఎటువంటి సంబంధం లేదు. ఆ సంఘటనకు రాజకీయ కారణాలు ఉన్నట్టు కూడా ఎటువంటి ఆధారాలు లేవు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.  

పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కు సంబంధించిన వివరాల కోసం కీ పదాలు ఉపయోగించి గూగుల్ లో వెతికితే, ఈ ఘటనకి సంబంధించి ‘Hindustan Times’ న్యూస్ సంస్థ 05 మే  2021 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం వెస్ట్ మిడ్నాపూర్ జిల్లా పింగ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న 21 సంవత్సరాల యువతిని ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు అత్యాచారం చేసి చంపినట్టు ఈ ఆర్టికల్ రిపోర్ట్ చేసింది. ఈ ఘటన 03 మే 2021 మధ్యాహ్నం చోటుచేసుకున్నట్టు ఈ ఆర్టికల్ ద్వారా తెలిసింది. డెబ్ర కాలేజీ లో చదువుకుంటున్న ఈ యువతిని, తన ఇంటి పక్కన నిర్మిస్తున్న భవనంలో కూలీ పని చేస్తున్న ఇద్దరు అత్యాచారం చేసి చంపారని యువతి తండ్రి పోలీసులకి ఫిర్యాదు చేసారు. పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఆ ఇద్దరిని మరియు వారికి సహాయం చేసిన ఒక మహిళను అరెస్ట్ చేసినట్టు ఈ ఆర్టికల్ తెలిపింది.

ఈ ఘటనకి సంబంధించి బంగ్లా లోకల్ వార్తా సంస్థ పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. ఈ యువతిని తాము అత్యాచారం చేసినట్టు నేరస్తులలో ఒకరు ఒప్పుకున్నారని ఈ ఆర్టికల్ తెలిపింది. ఈ కేసుకి సంబంధించి జరిపిన విచారణలో యువతిని ఆ ఇద్దరు భవన నిర్మాణ కార్మికులే అత్యాచారం చేసి చంపారని నిర్ధారణ అయినట్టు ఖరగ్పూర్ ASP రానా ముఖర్జీ మీడియాకి తెలిపారని ఈ ఆర్టికల్ రిపోర్ట్ చేసింది. చనిపోయిన ఈ యువతికి న్యాయం చేయాలని కాలేజీ యువకులు చేసిన ధర్నాని ఇక్కడ చూడవచ్చు. యువతిని అత్యాచారం చేసి చంపిన ఇద్దరు కార్మికులు TMC పార్టీ కార్యకర్తలని ఎవరూ రిపోర్ట్ చేయలేదు. అంతే కాదు, ఈ హత్యకి రాజకీయ కారణాలు ఉన్నట్టు కూడా ఎవరూ రిపోర్ట్ చేయలేదు.

ఈ అమ్మాయి తరపు బంధువులు బూమ్ సంస్థతో మాట్లాడుతూ, ఈ అమ్మాయిని బీజేపీకి ముడిపెడుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలు తప్పని తెలిపారు. ఈ సంఘటనకు ఎటువంటి రాజకీయ కోణం లేదు అని కూడా స్పష్టం చేసారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ఆ రాష్ట్రంలోని పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నట్టు పలు న్యూస్ సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. TMC కార్యకర్తలు బీజేపీ మహిళా కార్యకర్తలతో అనుచితంగా ప్రవర్తించారని బీజేపీ నాయకులు ఆరోపిస్తూ వీడియోలు షేర్ చేస్తున్నారు. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ హింసాత్మక ఘటనల్లో పలువురు చనిపోయారని కూడా వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి.

చివరగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం వెస్ట్ మిడ్నాపూర్ కి చెందిన యువతిని ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు అత్యాచారం చేసి చంపిన ఘటనని ప్రస్తుత బెంగాల్ హింసతో ముడిపెడుతున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll