‘RSS పాఠశాలలో ఎంత గొప్పగా బోధిస్తున్నారో చుడండి’ అంటూ, ఒక అధ్యాపకుడు విద్యార్థిని కొడుతున్న వీడియో షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న వాస్తవం ఏంటో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: ఇది RSS పాఠశాలలో అధ్యాపకుడు విద్యార్థిని కొడుతున్న దృశ్యం.
ఫాక్ట్(నిజం): ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం సిధౌలీలోని కిశోరీ బాలిక విద్యాలయ్ అనే ప్రైవేటు పాఠశాలలో చోటు చేసుకుంది. ఇది RSS పాఠశాల కాదు. కావున ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఈ దృశ్యం గురించి వివరాలు తెలుసుకునేందుకు కీ వర్డ్ సెర్చ్ ద్వారా ఇంటర్నెట్లో వెతకగా, పలు వార్త పత్రికలు దీని గురించి ప్రచురించడం గమనించాం (ఇక్కడ మరియు ఇక్కడ). ఇది సీతాపూర్ జిల్లాలోని ఛాజ్జన్ అనే ప్రాంతంలో ఉన్న ఒక పాఠశాలలో జరిగింది. సతీష్ జోషి అనే అధ్యాపకుడు, ఒక విద్యార్థి పాఠశాల నుంచి పారిపోయినందువల్ల కొట్టాడని మరియు సతీష్ జోషి పై పాఠశాల మేనేజర్ పోలీస్ కంప్లైంట్ చేసాడు అని తెలిసింది.
ఈ వివరాల ఆధారంగా ఉత్తర్ ప్రదేశ్ పోలీస్ వెబ్సైటులో ఈ సంఘటన గురుంచి FIR డౌన్లోడ్ చేసాము. FIR ప్రకారం ఈ సంఘటన సిధౌలీలోని కిశోరీ బాలిక విద్యాలయ్ అనే పాఠశాలలో చోటు చేసుకుంది, ఈ విద్యార్థి పేరు దీపక్.
తదుపరి మేము క్లైములో చెప్పిన విధంగా ఈ పాఠశాల RSSకు సంబంధించిందేనా అని తెలుసుకోవటానికి సిధౌలీ పోలీస్ స్టేషన్ మరియు కిశోర బాలిక విద్యాలయ్ పాఠశాలను సంప్రదించగా, ఇది ప్రైవేట్ స్కూల్ అని, ఎటువంటి మతానికి సంబంధించిన పాఠశాల కాదు అని చెప్పడం జరిగింది. అయితే, పాఠశాల సిబ్బంది, ఈ పాఠశాలలో ‘పౌరాణిక్ శిక్ష’ అనే ఒక కోర్స్ ఉందని, దానిలో ఉన్న విద్యార్థుల్లో దీపక్ ఒకడు అని, సతీష్ జోషి ఆ శిక్షణ ఇచ్చే ఆచార్యుడు అని చెప్పడం జరిగింది.
ఈ స్కూల్ వివరాలను మినిస్ట్రీ అఫ్ ఎడ్యుకేషన్ వెబ్సైటులో వెతకగా, ఇది ఒక గుర్తింపు పొందిన (recognized) ప్రైవేటు పాఠశాల అని నిర్ధారించడం జరిగింది.
చివరిగా, ఒక అధ్యాపకుడు విద్యార్థిని కొడుతున్న ఈ సంఘటన జరిగింది RSS పాఠశాలలో కాదు.