రిషికేశ్‌లో G20 అతిధులు తలపాగాలు మరియు కాషాయ కండువాలు ధరించి గంగా హారతికి హాజరయిన దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. విదేశీ అతిథులకు తాజ్ మహల్ లాంటి సమాధులు చూపించే రోజులు పోయాయని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: G20 మీటింగ్ కోసం వచ్చిన విదేశీ అతిథులు రిషికేశ్‌లో తలపాగాలు మరియు కాషాయ కండువాలు ధరించి గంగా హారతికి హాజరయిన దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో రిషికేశ్‌లో ఇటీవల G20 అతిధులు తలపాగాలు మరియు కాషాయ కండువాలు ధరించి గంగా హారతికి హాజరయిన దృశ్యాలను చూపిస్తున్న మాట వాస్తవం. కానీ, G20 ప్రతినిధులు ఆగ్రాలోని తాజ్ మహల్, శ్రీనగర్‌లోని ముఘల్ గార్డెన్, లక్నోలోని బర ఇమాంబర వంటి ఇతర ప్రదేశాలను కూడా సందర్శించారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం కీ పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘ANI’ వార్తా సంస్థ 24 మే 2023 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. G20 ప్రతినిదులు రిషికేశ్‌లోని పర్మార్త్ నికేటన్‌లో ‘గంగా హారతి’ పూజకి హాజరయిన దృశ్యాలంటూ ఈ వీడియోని షేర్ చేస్తూ తెలిపారు. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు ఇటీవల వీడియోలు మరియు ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

అయితే, G20 విదేశీ ప్రతినిధుల బృందం ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే తాజ్ మహల్‌ను సందర్శించారు. 12 ఫిబ్రవరి 2023 నాడు G20 ఎంపవర్ ఇన్సెప్షన్ మీటింగ్ ముగించుకున్న తరువాత G20 ప్రతినిధులు తాజ్ మహల్‌ను సందర్శించినట్టు పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

అంతేకాదు, G20 ప్రతినిధుల బృందం లక్నోలోని బర ఇమాంబరను కూడా సందర్శించారు. బర ఇమాంబరలో కూడా అసఫ్ ఉద్-దౌలహ సమాధి ఉంటుంది. G20 ప్రతినిదులు శ్రీనగర్‌లోని మొఘల్ గార్డెన్, అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ మరియు ఇంకెన్నో ప్రదేశాలను సందర్శించారు.
చివరగా, భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్న G20 సమావేశాలలో భాగంగా G20 ప్రతినిధులు రిషికేశ్‌లో గంగా హారతితో పాటు తాజ్ మహల్‌ను కూడా సందర్శించారు.