భారత దేశంలో భారత్ బయోటెక్ ద్వారా తయారు చేయబడుతున్న కరోనా వాక్సిన్ ని 190 దేశాలు ముందుగానే బుక్ చేసుకున్నాయని, ఇదే మోదీ ప్రభుత్వం యొక్క విజయమని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: భారత దేశంలో భారత్ బయోటెక్ ద్వారా తయారు చేయబడుతున్న కరోనా వాక్సిన్ ని 190 దేశాలు ముందుగానే బుక్ చేసుకున్నాయి.
ఫాక్ట్(నిజం): భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న covaxin మాత్రమే భారత దేశంలో తయారుచేయబడుతున్న స్వదేశీ టీకా. Serum Institute of India (SII) కేవలం COVAX ఒప్పందం కింద ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న వాక్సిన్ యొక్క తయారీ భాగస్వామే తప్ప తమ సొంతంగా వాక్సిన్ అభివృద్ధి చేయట్లేదు. ఐతే భారత్ బయోటెక్ COVAX ఒప్పందంలో భాగం కానందున covaxinని ఇతర దేశాలకు పంచాల్సిన అవసరంలేదు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న వాక్సిన్ ని 190 దేశాలు బుక్ చేసుకునట్టు కూడా ఎటువంటి సమాచారం లేదు. 190 దేశాలకు వాక్సిన్ అందించే COVAX ఒప్పందాన్ని భారత్ లో తాయారు చేస్తున్న వాక్సిన్ ని 190 దేశాలు ముందుగానే బుక్ చేసుకున్నట్టు తప్పుగా అర్థం చేసుకున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించేవిధంగా ఉంది.
COVAX:
కోవిడ్-19 వాక్సిన్ ని డెవలప్ చేసి మరియు దానిని ప్రపంచంలోని అందరికి అందించాలనే ఉద్దేశంతో WHO ఏప్రిల్ 2020లో Access to COVID-19 tools (ACT) Accelerator ని ప్రారంభించింది, ఇది అందరికి కోవిడ్-19 టెస్ట్స్, ట్రీట్మెంట్ మరియు వాక్సిన్ అందించడానికి కృషి చేస్తుంది. ACT Accelerator ని డయాగ్నొస్టిక్స్, చికిత్స, వాక్సిన్ మరియు ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం అనే నాలుగు పిల్లర్ల కింద విభజించారు.
ACT Accelerator యొక్క నాలుగు పిల్లర్లలో COVAX ఒకటి. వివిధ COVID-19 వాక్సిన్స్ యొక్క పరిశోధన, అభివృద్ధి మరియు వాటి ధరల విషయాలతో డీల్ చేసే ఉద్దేశంతో WHO, యూరోపియన్ కమిషన్ మరియు ఫ్రాన్స్ దీనిని ప్రారంభించాయి. COVAX ఈ లక్ష్యాలను పూర్తిచేయడానికి Gavi, the Vaccine Alliance, Coalition for Epidemic Preparedness Innovations (CEPI) మరియు WHOతో కలిసి సమన్వయం చేసుకుంటుంది. 2021 చివరి నాటికి 2 బిలియన్ వాక్సిన్ డోసులను అందుబాటులో ఉంచడం COVAX యొక్క మొదటి లక్ష్యం.
COVAX పిల్లర్ లో ఒక భాగమైన Gavi వాక్సిన్ కొనుగోలు మరియు డెలివరీ వంటి అంశాలను చూసుకుంటుంది. ఇందుకోసం Gavi ఒక COVAX Facilityని నెలకొల్పింది. Gavi, COVAX Advance Market Commitment (AMC) ద్వారా COVAX Facilityలో మెంబెర్ అయిన తక్కువ ఆదాయ దేశాలకు వాక్సిన్ అందించేందుకు ఫండింగ్ చేస్తుంది. COVAX పిల్లర్ లో మరొక భాగమైన CEPI వాక్సిన్ రీసెర్చ్ అమరియు డెవలప్మెంట్ కి సంబంధించిన విషయాలను చూసుకుంటుంది. ఇప్పటి వరకు CEPI 10 వ్యాక్సిన్ క్యాండిడేట్స్ లో పెట్టుబడులు పెట్టింది. వీటిలో 9 అభివృద్ధి దశలో ఉండగా, 7 క్లినికల్ ట్రయల్స్ దశ లో ఉన్నాయి.
COVAX అర్హత కలిగిన 190 దేశాలకు 2021 మొదటి అర్ధభాగంలో దాదాపు 2 బిలియన్ డోసుల వాక్సిన్ టీకాలను అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు Gavi COVAX AMC కింద 92 అర్హతగల ఆర్థిక వ్యవస్థలకు కనీసం 1.3 బిలియన్ వాక్సిన్ డోసులను అందించాలని Gavi లక్ష్యంగా పెట్టుకుంది.
భారత దేశంలో తయారవుతున్న భారత్ బయోటెక్ వాక్సిన్ :
భారతదేశం యొక్క Drug Controller General of India (DCGI) 20 జనవరి 2021 న ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా మరియు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన COVID-19 వ్యాక్సిన్లను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి అనుమతిచ్చింది. ఐతే Serum Institute of India (SII) ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ యొక్క 200 మిలియన్ డోసులను తయారు చేయడానికి COVAX Facility కింద Gavi మరియు Bill & Melinda Gates Foundationతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం Serum Institute of India (SII) తాము తయారీ చేసే వాక్సిన్ ని 190 దేశాలకు సరఫరా చేయాలి. దీన్నిబట్టి SII కేవలం COVAX ఒప్పందం కింద ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకాకు తయారీ భాగస్వామే తప్ప తమ సొంతంగా వాక్సిన్ అభివృద్ధి చేయట్లేదని స్పష్టమవుతుంది.
ICMR మరియు National Institute of Virology (NIV) సహకారంతో భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవాక్సిన్ మాత్రమే భారత దేశంలో పరిశోధన చేసి తయారుచేయబడుతున్న స్వదేశీ టీకా. ఐతే భారత్ బయోటెక్ COVAXతో గాని లేదా CEPIతో గాని తాము తాయారు చేస్తున్న వాక్సిన్ కి సంబంధించి ఎటువంటి ఒప్పందం చేసుకోలేదు. కావున భారత్ బయోటెక్ తయారు చేస్తున్న వాక్సిన్ ని ఇతర దేశాలకు పంచాల్సిన అవసరం లేదు.
ఇటీవల బ్రెజిల్ కి చెందిన Brazilian Association of Vaccine Clinics (ABCVAC) భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న వాక్సిన్ (covaxine) కొనుగోలు చేసేందుకు MoU కుదుర్చుకుందని తమ వెబ్సైటులో రాసుకుంది, ఐతే చివరి డీల్ మాత్రం బ్రెజిల్ హెల్త్ రెగ్యులేటర్ Anvisa ఆమోదానికి లోబడి ఉంటుంది అని పేర్కొంది. ఐతే ఈ విషయంపై భారత్ బయోటెక్ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదికాక భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న వాక్సిన్ ని 190 దేశాలు బుక్ చేసుకునట్టు ఎటువంటి సమాచారం లేదు. దీన్నిబట్టి SII భాగమైన 190 దేశాలకు వాక్సిన్ పంచే COVAX ఒప్పందాన్ని భారత్ లో తాయారు చేస్తున్న వాక్సిన్ని 190 దేశాలు ముందుగానే బుక్ చేసుకున్నాయని తప్పుగా అర్థం చేసుకున్నట్టు చెప్పొచ్చు.
చాలా వరకు దేశాలు తమ ప్రజలకు కోవిడ్ వాక్సిన్ అందించడానికి సిద్దమవుతున్న నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
చివరగా, 190 దేశాలకు వాక్సిన్ అందించే COVAX ఒప్పందాన్ని భారత్ లో తాయారు చేస్తున్న వాక్సిన్ ని 190 దేశాలు ముందుగానే బుక్ చేసుకున్నట్టు తప్పుగా అర్థం చేసుకున్నారు.