Fake News, Telugu
 

స్కూల్ ఫీజులను నియంత్రిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసిన చట్టంలో గరిష్టంగా 20,000 ఫీజు అనే ఎటువంటి నిబంధన లేదు

0

‘ఉతరప్రదేశ్‌లో 12వ తరగతి వరకు స్కూల్ ఫీజు, పుస్తకాల ఖర్చులు అన్ని కలిపి 20వేల రూపాయల కంటే ఒక్క పైసా దాటినా ఆ స్కూల్/ కాలేజీ లైసెన్స్ రద్దు చేసే విధంగా’  ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆర్డినెన్స్ జారీ చేసినట్టు చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ విషయానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: 12వ తరగతి వరకు స్కూల్ ఫీజు, పుస్తకాల ఖర్చులు అన్ని కలిపి 20వేల రూపాయలు దాటితే ఆ స్కూల్/ కాలేజీ లైసెన్స్ రద్దు చేసే విధంగా ఆర్డినెన్స్ జారీ చేసారు.

ఫాక్ట్ (నిజం): స్కూల్ ఫీజుల నియంత్రణకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2018లో ‘Uttar Pradesh Self-Financed Independent Schools (Fee Regulation) Act, 2018’ తీసుకొచ్చింది. ఐతే ఈ చట్టంలో స్కూల్ ఫీజు 20,000 కంటే ఎక్కువగా ఉండకూడదని ఎక్కడా చెప్పలేదు. ఈ చట్టం ద్వారా ఫీజు నిర్ణయించుకొనే అధికారం స్కూల్లకే అందించగా, ప్రభుత్వం పాత్ర కేవలం ఫీజు పెంచేటప్పుడు పాటించాల్సిన మార్గదర్శకాలను నిర్దేశించే, మరియు ఫీజుల విషయంలో అవకతవకలు జరిగినప్పుడు చర్యలు తీసుకునే వరకు మాత్రమే పరిమితం. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు మరియు కరోనా లాంటి అసాధారణ/అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వానికి స్కూల్ ఫీజులు నియంత్రించే అధికారం ఉండేలాగా 2018లో చేసిన చట్టానికి కొన్ని సవరణలు చేస్తూ 2020లో ఒక ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారు. ఐతే ఈ ఆర్డినెన్స్‌లో కూడా ఫీజు  20,000 కంటే ఎక్కువగా ఉండకూడదని నిబంధననేది లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

రాష్ట్రంలోని స్కూల్ విద్యార్థుల నుండి భారీగా ఫీజులు వసూలు చేయకుండా నిరోధించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2018లో ‘Uttar Pradesh Self-Financed Independent Schools (Fee Regulation) Act, 2018’ పేరుతో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది.

ఇండిపెండెంట్ ప్రీ- ప్రైమరీ స్కూల్స్‌ను మినహాయిస్తే, మైనారిటీ విద్యాసంస్థలతో పాటు CBSE, ICSE మరియు UP బోర్డ్ ద్వారా గుర్తింపు పొందిన అన్ని ప్రైవేటు స్కూల్స్‌కు ఈ చట్టం వర్తిస్తుంది. అలాగే ఒక విద్యార్థి నుండి సంవత్సరానికి 20,000 రూపాయల కంటే ఎక్కువ ఫీజు వసూలు చేసే ఏదైనా ఇతర బోర్డు (ప్రభుత్వం నోటిఫై చేసిన) గుర్తింపు పొందిన స్కూల్స్‌కు కూడా ఈ చట్టం వర్తిస్తుంది.

ఐతే ఈ చట్టంలో స్కూల్ ఫీజు 20,000 కంటే ఎక్కువగా ఉండకూడదనే నిబందనేది లేదు. పైగా తమకు అయ్యే ఖర్చులు, తాము అందించే సదుపాయాలు, మొదలైన వాటికి అనుగుణంగా ఫీజు నిర్ణయించుకొనే అధికారాన్ని ఈ చట్టం స్కూల్స్‌కు అందిస్తుంది, అయితే స్కూల్స్ చేసే ప్రతిపాదనలను జిల్లా కమిటీ పరిశీలించి ఆమోదిస్తాయి.

అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి స్కూల్ ఫీజు పెంచుకొనే సౌలభ్యం కూడా ఈ చట్టం స్కూల్స్‌కు అందించింది. కాకపోతే ఫీజు పెంపుకు సంబంధించి రెండు మార్గదర్శకాలను పాటించాల్సిందిగా ఈ చట్టంలో పేర్కొన్నారు. అవి,

  • బోధనా సిబ్బంది గత సంవత్సర నెలవారీ జీతంలో సగటు తలసరి పెరుగుదలకు అనుగుణంగా స్కూల్స్ ఫీజు పెంచుకోవచ్చు.
  • కానీ ఫీజు పెరుగుదల (వినియోగదారు ధరల సూచికలో (CPI) వార్షిక పెరుగుదల శాతం+ అప్పటికి విద్యార్థి నుండి వసూలు చేసే ఫీజులో 5%) మించకూడదు

ఐతే ఫీజు పెంపుకు సంబంధించి పైన తెలిపిన నిబంధనలు అంతకు ముందు ఉన్న విద్యార్థులకు కాగా, కొత్తగా అడ్మిషన్ తీసుకునే విద్యార్థులకు ప్రభుత్వ నియమాలకు లోబడి ఫీజులు నిర్ణయించుకొనే అధికారన్ని ఈ చట్టం స్కూల్స్‌కు అందిస్తుంది.

పైగా రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో జిల్లా మేజిస్ట్రేట్ నేతృత్వంలో ఒక జిల్లా ఫీ నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలని ఈ చట్టం సూచిస్తుంది. స్కూల్స్‌ ఇష్టానుసారంగా ఫీజులు పెంచకుండా ఈ కమిటీ చర్యలు తీసుకుంటాయి, అలాగే ఈ చట్టాన్ని సరిగ్గా అమలు చేయని స్కూల్స్‌కు లక్ష నుండి ఐదు లక్షల వరకు ఫైన్ విధించే మరియు స్కూల్ లైసెన్స్ రద్దు చేయాలనీ బోర్డుకు ప్రతిపాదించే అధికారం ఈ కమిటీలకు అందించారు. కమిటీ నిర్ణయంతో ఏకీభవించనివారు 30 రోజులలోపు తీర్పును అప్పీల్ చేసుకోవడానికి స్టేట్ సెల్ఫ్ ఫైనాన్స్ ఇండిపెండెంట్ స్కూల్ అప్పీలేట్ అథారిటీ (SSFISA)ని ఏర్పాటు చేసారు.

ఈ చట్టం ద్వారా ఫీజు నిర్ణయించుకొనే అధికారం స్కూల్లకే అందించగా, ప్రభుత్వం పాత్ర కేవలం ఫీజు పెంచేటప్పుడు పాటించాల్సిన మార్గదర్శకాలను నిర్దేశించే, మరియు ఫీజుల విషయంలో అవకతవకలు జరిగినప్పుడు చర్యలు తీసుకునే వరకు మాత్రమే పరిమితం.

The Uttar Pradesh Self-Financed Independent Schools (Fee Regulation) (Amendment) Ordinance, 2020 :

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2020 కరోనా సమయంలో స్కూల్స్ ఇష్టానుసారం ఫీజులు పెంచకుండా 2018లో చేసిన చట్టానికి కొన్ని సవరణలు చేస్తూ ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు మరియు కరోనా లాంటి అసాధారణ/అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వానికి స్కూల్ ఫీజులు నియంత్రించే అధికారం ఉండేలాగా ఈ  ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారు.

అలాగే 2018 చట్టంలో పేర్కొన్న  SSFISA స్థానంలో డివిజనల్ సెల్ఫ్-ఫైనాన్స్డ్ ఇండిపెండెంట్ స్కూల్ అప్పిలేట్ అథారిటీ (DSFISA)ను ఏర్పాటు చేసారు.

ఐతే ఈ ఆర్డినెన్స్‌ ద్వారా ఫీజు నియంత్రించే అధికారం ప్రభుత్వం పొందినప్పటికీ, స్కూల్ ఫీజు గరిష్టంగా 20,000 కంటే ఎక్కువగా ఉండకూడదని ఈ ఆర్డినెన్స్‌ ద్వారా ప్రభుత్వం ఎటువంటి నిబంధనను విధించలేదు. అలాగే కరోనా సమయంలో స్కూల్ ఫీజు గరిష్టంగా 20,000 కంటే ఎక్కువగా ఉండకూడదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ఆర్డర్ కూడా జారీ చేయలేదు. 2018లో చేసిన చట్టంలో కూడా ఇలాంటి నిబంధనేది లేదు.

2018 చట్టంలో పేర్కొన్న 20,000 స్కూల్ ఫీజు అన్న అంశాన్ని మరియు ఇష్టానుసారం ఫీజులు పెంచకుండా 2020లో తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌లోని అంశాలను తప్పుగా అర్థం చేసుకొని ఉండవచ్చు. అందుకే సోషల్ మీడియాలో 20,000 కంటే ఎక్కువ ఫీజు వసూలు చేస్తే స్కూల్ లైసెన్స్ రద్దు చేస్తారని తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తున్నారు. కాని నిజానికి ఇలాంటి నిబంధనేది ప్రభుత్వం తీసుకురాలేదు.

చివరగా, స్కూల్ ఫీజుల నియంత్రణకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసిన చట్టంలో ఫీజు ఇరవై వేల కంటే ఎక్కువగా ఉండకూడదని ఎటువంటి నిబంధన లేదు.

Share.

About Author

Comments are closed.

scroll