ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అధిత్యనాథ్ ప్రైవేటు విద్యా సంస్థల్లో SC, ST లకు ఉచితంగా ప్రవేశాలు పొందే వ్యవస్థను రద్దు చేసాడని అర్ధం వచ్చేలా ఇదే టైటిల్ ఉన్న ఒక హిందీ వార్తా పత్రిక క్లిప్పింగ్ కి యోగి ఆదిత్యనాథ్ ఫోటో జత చేసిన ఫోటోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అధిత్యనాథ్ ప్రైవేటు విద్యా సంస్థల్లో SC, ST లకు ఉచితంగా ప్రవేశాలు పొందే వ్యవస్థను రద్దు చేసాడు.
ఫాక్ట్ (నిజం): ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల్లో SC, ST విద్యార్థులకు ఉచిత అడ్మిషన్ పద్ధతి రద్దు చేయలేదు. ప్రైవేటు విద్యాసంస్థలు నకిలీ SC, ST సర్టిఫికెట్స్ సమర్పించి ప్రభుత్వం నుండి అక్రమంగా అడ్మిషన్ ఫీజు వసూలు చేస్తుండడంతో ఈ పద్ధతి స్థానంలో ఫీజు రీయింబర్స్మెంట్ పద్దతిని ప్రవేశ పెట్టింది. ఈ కొత్త పద్ధతి ద్వారా SC, ST విద్యార్థులు ముందున్న ఉచిత అడ్మిషన్ అవకాశాన్ని కోల్పోలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
పోస్టులో పత్రికా కథనం లో ఉన్న టైటిల్ ఆధారంగా కీవర్డ్ సెర్చ్ చేయగా ఈ కథనానికి సంబంధించి ‘అమర్ ఉజాల’ 06 అక్టోబర్ 2019న ప్రచురించిన ఆన్లైన్ కథనం మాకు కనిపించింది. ఐతే ఈ కథనం ప్రకారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల్లో SC,ST విద్యార్థులు ఫీజు చెల్లించకుండా ఫ్రీగా అడ్మిషన్ పొందే పద్దతిని రద్దు చేసి, దాని స్థానం అడ్మిషన్ ఫీజు చెల్లించి అడ్మిషన్ పొందే కొత్త పద్దతిని ప్రవేశపెట్టింది. ఐతే కొత్త పద్ధతిలో విద్యార్థులు మొదట చెల్లించిన అడ్మిషన్ ఫీజు ప్రభుత్వం వారికి రీయింబర్స్ చేస్తుంది.
2002-03 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఎయిడెడ్ మరియు ప్రైవేట్ విద్యాసంస్థలలో SC మరియు ST చెందిన విద్యార్థులకు వంద శాతం ఉచిత ప్రవేశం కల్పించే విధానాన్ని అమలు చేసింది. ఐతే ప్రైవేటు విద్యాసంస్థలు నకిలీ SC, ST సర్టిఫికేట్స్ సమర్పించి ప్రభుత్వం నుండి అడ్మిషన్ ఫీజు వసూలు చేస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ కొత్త ఫీజు రీయింబర్స్మెంట్ పద్దతిని ప్రవేశ పెట్టిందని ఈ కథనంలో పేర్కొన్నారు. దీన్నిబట్టి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం SC, ST లకు సంబంధించిన ఉచిత అడ్మిషన్ స్కీంని రద్దు చేయలేదని, కేవలం ఇంతకు ముందున్న పద్ధతి స్థానంలో ఫీజు రీయింబర్స్మెంట్ పద్దతిని ప్రవేశపెట్టిందని అర్డంచేసుకోవచ్చు. కొత్త పద్ధతి ద్వారా SC, ST విద్యార్థులు ముందున్న ఉచిత అడ్మిషన్ అవకాశాన్ని కోల్పోలేదు. ఇదే వార్తని ప్రచురించిన మరొక కథనం ఇక్కడ చూడొచ్చు, ఈ కథనంలో కూడా పైన తెలిపిన విషయాన్నే దృవీకరిస్తుంది. ఆజ్ తక్ సంస్థ ఇదే విషయానికి సంబంధించిన రాసిన ఫాక్ట్-చెక్ లో పోస్టులో ఉన్న అమర్ ఉజాలా వార్తా పత్రిక క్లిప్పింగ్ ని షేర్ చేసింది, దీనిని ఇక్కడ చూడొచ్చు. ఈ క్లిప్పింగ్ లో కూడా పైన తెలిపిన విషయమే రాసి ఉండడం చూడొచ్చు.
చివరగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల్లో SC, ST విద్యార్థులకు ఉచిత అడ్మిషన్ పద్ధతి రద్దు చేయలేదు, దీని స్థానంలో ఫీజు రీయింబర్స్మెంట్ పద్దతిని ప్రవేశ పెట్టింది.