Fake News, Telugu
 

రహదారి విస్తరణలో భాగంగా UP ప్రభుత్వం ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన మసీదుతో పాటు గుడి మరియు ఇతర కట్టడాలను కూడా కూలుస్తోంది

0

“లక్షలాది హిందువులను భయబ్రాంతులకు గురిచేసి మతం మార్చిన ముజఫర్ ఆలి 300 ఏళ్ళ సమాధిని నేలమట్టం చేసిన యూపీ యోగీ (అదిత్యనాథ్)” అని చెప్తూ మసీదు తరహా నిర్మాణాన్ని బుల్ డోజర్‌లు పడగొడుతున్న వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: లక్షలాది హిందువులను భయబ్రాంతులకు గురిచేసి మతం మార్చిన ముజఫర్ ఆలి 300 ఏళ్ళ సమాధిని నేలమట్టం చేసిన యూపీ ప్రభుత్వం.

ఫాక్ట్: ఉత్తర ప్రదేశ్‌లోని  ముజఫర్ నగర్ జిల్లాలో షేర్ నగర్ గ్రామంలో ఉన్న 300 ఏళ్ల నాటి మసీదుని ‘పానిపట్ – ఖటిమా’ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించినందున ఇటీవల కూల్చి వేశారు. ఈ మసీదును తరలించాలి అని ముందే నోటీసులు ఇచ్చినా కూడా ఎవరూ స్పందించకపోవడంతో ఇలా కూల్చాల్సి వచ్చింది. అక్టోబర్ 2022లో కూడా ఇదే తరహాలో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన రెండు గుళ్లను, ఒక దర్గాను, ప్రభుత్వ పాఠశాల మరియు శ్మశానం యొక్క ప్రహరీ గోడలను కూడా కూల్చి వేశారు. కావున  పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా ఈ సంఘటన గురించి ఇంటర్నెట్లో వెతకగా ‘టైమ్స్ నౌ’ , ‘జన్ సత్తా’, ‘ABP న్యూస్’ వారు ప్రచురించిన కథనాల ప్రకారం, ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో షేర్ నగర్ గ్రామంలో ఉన్న 300 ఏళ్ల నాటి మసీదుని ‘పానిపట్ – ఖటిమా’ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ఇటీవల కూల్చి వేశారు.

ముజఫర్ నగర్ సబ్-కలెక్టర్ ‘పరమానంద ఝా’ మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు, “పానిపట్ – ఖటిమా రహదారి షేర్ నగర్ గ్రామం గుండా వెళ్తుంది. ఈ గ్రామంలో అనేక కట్టడాలు ప్రభుత్వ భూమి పైన అక్రమంగా నిర్మించారు. ఇక్కడ ఉన్న ఈ మసీదు కూడా 1020 చదరపు మీటర్ల ప్రభుత్వ భూమి పైన నిర్మించబడింది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఈ మసీదును వేరే చోటుకి తరలించాలి అని ఇది వరకే చాలా సార్లు నోటీసులు ఇచ్చాము. కానీ, ఎవరూ స్పందించలేదు. ఇచ్చిన గడువు అయిపోవడంతో, ఈ కట్టడాన్ని పడగొట్టవలసి వచ్చింది. ఇదే రహదారి విస్తరణకు అడ్డుగా ఉన్న మరిన్ని మతపరమైన నిర్మాణాలను కూడా కూల్చడానికి సిద్దమవుచున్నాము.” ఇదే విషయాన్ని గురించి ముజఫర్ నగర్ కలెక్టర్ కార్యాలయం వారు చేసిన ట్వీట్ ను ఇక్కడ చూడవచ్చు. 

‘ETV భారత్’ కథనం ప్రకారం, ఈ ఏడాది అక్టోబర్ 2022లో కూడా ఇదే తరహాలో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన రెండు గుళ్లను మరియు ఒక దర్గాను కూడా కూల్చి వేశారు. అంతకుమందు, ప్రభుత్వ పాఠశాల మరియు శ్మశానం యొక్క ప్రహరీ గోడలను కూడా కూల్చారు.

చివరిగా, ముజఫర్ నగర్లో రహదారి విస్తరణలో భాగంగా ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన గుడి, మసీదు, ప్రహరీ గోడలు, మరియు ఇతర కట్టడాలు అధికారులు కూలుస్తున్నారు.   

Share.

About Author

Comments are closed.

scroll