ప్రఖ్యాత యునాని మందుల కంపెనీ హమ్‌దర్ద్‌లో ఒక్క హిందూ యువకుడికి కూడా ఉద్యోగం లభించదు అని చెప్తూ ఉన్న పలు పోస్టులు (ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ప్రఖ్యాత యునాని మందుల కంపెనీ అయిన హమ్‌దర్ద్‌లో ఒక్క హిందువు కూడా ఉద్యోగం పొందలేడు.
ఫాక్ట్(నిజం): హమ్‌దర్ద్ కంపెనీ వెబ్‌సైట్‌లో, లీడర్‌షిప్ (నాయకత్వం) విభాగం పరిశీలించగా, ఉన్నత స్థాయి మేనేజ్మెంట్ నిర్వహించే వ్యక్తులలో హిందువులు, ముస్లిములు కూడా ఉన్నారని తెలుస్తుంది. అంతేకాకుండా, 2022లో మానేసర్ హమ్‌దర్ద్ యూనిట్ లో స్థానిక హిందువులకు 50% ఉద్యోగ అవకాశాలు కలిపించాలని కోరుతూ స్థానికులు అధ్వర్యంలో మహాపంచాయత్ ఏర్పాటు చేసి నిరసనలు తెలపగా, మానేసర్‌లోని హమ్‌దర్ద్ కంపెనీ యూనిట్ యొక్క ఆపరేషన్స్ చీఫ్ శైలేష్ తివారీ ‘ది ట్రిబ్యూన్‌తో’ వార్త సంస్థతో మాట్లాడుతూ, “నేను ఇక్కడ యూనిట్‌కు నాయకత్వం వహిస్తున్న హిందువుని, మా రిక్రూట్‌మెంట్ పాలసీని నేను బహిర్గతం చేయలేను కానీ మా ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి మతపరమైన నిబంధనలు లేవు అని చెప్పగలను” అని తెలిపారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ క్లెయిమ్‌కి సంబంధించిన సమాచారం కోసం మేము ముందుగా హమ్‌దార్ద్ యునాని కంపెనీ యొక్క వెబ్‌సైట్‌లో, ఈ కంపెనీ యొక్క లీడర్‌షిప్ (నాయకత్వం) విభాగం పరిశీలించగా, ఉన్నత స్థాయి మేనేజ్మెంట్ చేసే వ్యక్తులలో హిందువులు, ముస్లిములు కూడా ఉన్నారని తెలసింది.
అలాగే మేము పలు సోషల్ నెట్‌వర్క్ సైట్లలో కీవర్డ్ సెర్చ్ చేయగా,ఈ కంపెనీకి సంబంధించిన పలువురు ముస్లిమేతర ఉద్యోగులకు చెందినా పలు సోషల్ మీడియా అకౌంట్లు కూడా కనుగొన్నాము (ఇక్కడ, ఇక్కడ).
అంతేకాకుండా, మేము వైరల్ పోస్టులో చెప్పినట్లుగా ఎప్పుడు అయిన హమ్‌దర్ద్ సంస్థ ముస్లిమేతర వ్యక్తులకు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించిన ఘటనలను ఉన్నాయా లేదా కేవలం ముస్లిం మతం వారికే ఉద్యోగ ప్రకటనలు ఇచ్చిందా? అని ఇంటర్నెట్‌లో వెతకగా, అలాంటి ఘటనలను రిపోర్ట్ చేస్తున్న ఎలాంటి వార్త కథనాలు దొరకలేదు. హమ్‌దర్ద్ అనేది ఒక పెద్ద, ప్రసిద్ధ సంస్థ, ఒక వేళ వైరల్ పోస్టులో చెప్పినట్లు ఏదైనా ఘటన జరిగి ఉంటే ఖచ్చితంగా పలు మీడియా సంస్థలు రిపోర్ట్ చేసి ఉండేవి.
ఈ క్రమంలోనే మాకు 08 జూలై 2022న “గురుగ్రామ్: ఫార్మా కంపెనీలో 50 శాతం రిజర్వేషన్ కోసం మహాపంచాయత్”( తెలుగు అనువాదం) అనే శీర్షికతో ‘ది ట్రిబ్యూన్’( The Tribune)( ఆర్కైవ్డ్ లింక్) సంస్థ పబ్లిష్ చేసిన వార్త కథనం ఒకటి లభించింది. ఈ కథనం ప్రకారం, 07 జూలై 2022న గురుగ్రామ్ లోని, మానేసర్ గ్రామంలోని యునాని ఫార్మాస్యూటికల్ కంపెనీ హమ్‌దర్ద్‌లో స్థానానికి హిందువులకు 50% ఉద్యోగ అవకాశాలు కలిపించాలని కోరుతూ స్థానికుల అధ్వర్యంలో మహాపంచాయత్ ఏర్పాటు చేసి నిరసనలు తెలిపారు. అలాగే హమ్‌దర్ద్‌లో ఖాళీలు ఉన్నా, స్థానికులు ఎవరైనా తగిన సమర్థత, అర్హత ఉండి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న, అతనికి అవకాశం ఇవ్వరు అని నిరసనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే, మానేసర్‌లోని హమ్‌దర్ద్ కంపెనీ యూనిట్ యొక్క ఆపరేషన్స్ చీఫ్ శైలేష్ తివారీ ‘ది ట్రిబ్యూన్‌తో’ వార్త సంస్థతో మాట్లాడుతూ, “నేను ఇక్కడ యూనిట్‌కు నాయకత్వం వహిస్తున్న హిందువుని, మా రిక్రూట్‌మెంట్ పాలసీని నేను బహిర్గతం చేయలేను కానీ మా ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి మతపరమైన నిబంధనలు లేవు అని చెప్పగలను, ఈ ఆరోపణలు అన్నీ నిరాధారమైన ప్రచార స్టంట్‌లు” అని ఖండించారు.
చివరగా, యునాని మందుల కంపెనీ హమ్‌దార్ద్‌లో ఒక్క హిందూ యువకుడికి కూడా ఉద్యోగం లభించదు అని చెప్తున్న ఈ పోస్ట్ ఫేక్.