Fake News, Telugu
 

ఇండోనేషియాకు సంబంధించిన వీడియోని దేశంలోని మదర్సాలలో హిందువుల పీకలు ఎలా కొయ్యాలో శిక్షణ ఇస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

మదర్సాలలో హిందువుల పీకలు ఎలా కొయ్యాలో శిక్షణ ఇస్తున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

క్లెయిమ్: దేశంలోని మదర్సాలలో హిందువుల పీకలు ఎలా కొయ్యాలో శిక్షణ ఇస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియోని ఇండోనేషియా దేశం జావా టీముర్ ప్రొవిన్సులోని సెంట్రల్ అల్-హాస్బి మదరసాలో 2019లో తీశారు. అల్- హాస్బి మదర్సాలో ఇచ్చే శిక్షణను ఈ వీడియో చూపిస్తుంది. ఈ వీడియో భారత దేశంలోని మదర్సాలకు సంబంధించినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.   

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ఒక యూట్యూబ్ ఛానెల్ 2019 డిసెంబర్ నెలలో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. సెంట్రల్ అల్-హాస్బి హెడ్ క్వార్టర్స్‌లో అల్-ఇక్దామ్ మదరసా వారియర్స్‌కు శిక్షణ ఇస్తున్న దృశ్యాలంటూ ఈ వీడియో వివరణలో తెలిపారు. ఇండోనేషియా దేశం జావా టీముర్ (ఈస్ట్ జావా) ప్రొవిన్సులోని జెంబర్ నగరంలో అల్-హాస్బి ఇస్లామిక్ శిక్షణ కేంద్రం ఉన్నట్టు ఈ యూట్యూబ్ ఛానెల్ మరొక వీడియో వివరణలో తెలిపింది.  

ఈ వీడియోకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం కీ పదాలను ఉపయోగించి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘అల్-ఇక్దామ్’ యూట్యూబ్ ఛానెల్ 08 ఏప్రిల్ 2019 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. అల్-హాస్బి మదరసాలో అల్-ఇక్దామ్ మదరసా వారియర్స్‌కు ఇచ్చిన వివిధ శిక్షణాలకు సంబంధించిన వీడియోలని ఈ యూట్యూబ్ ఛానెల్‌లో పబ్లిష్ చేశారు. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

అల్-హాస్బి మదర్సాలో ఇచ్చే శిక్షణకు సంబంధించి ఈ యూట్యూబ్ చానెల్ పబ్లిష్ చేసిన ఒక వీడియోలో కనిపిస్తున్న గోడపై, ఈ మదరసా జావా టీముర్ ప్రొవిన్సులోని జెంబర్ మున్సీపాలిటిలో ఉంది అని స్పష్టంగా రాసి ఉంది. జెంబర్ నగరంలోని అల్-హాస్బి ఇస్లాం శిక్షణ కేంద్రానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ దృశ్యాలను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. పై వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో ఇండోనేషియా దేశానికి సంబంధించినదని, భారత దేశ మదర్సాలకు సంబంధించినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.  

చివరగా, ఇండోనేషియాకు సంబంధించిన వీడియోని దేశంలోని మదర్సాలలో హిందువుల పీకలు ఎలా కొయ్యాలో శిక్షణ ఇస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll