ఇటీవలే హైదరాబాద్ దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిపై జరిగిన మొదటి ఆక్సిడెంట్ అని చెప్తూ ఒక ఆక్సిడెంట్ వీడియో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: హైదరాబాద్ దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిపై జరిగిన మొదటి ఆక్సిడెంట్ కి సంబంధించిన వీడియో.
ఫాక్ట్(నిజం): తెలంగాణ స్టేట్ పోలీస్ వారు ట్విట్టర్ ద్వారా ఈ వీడియోలో చూపిస్తున్న ఆక్సిడెంట్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై జరగలేదని తేల్చి చెప్పారు. పైగా ఈ వీడియో చాలా సంవత్సరాల నుండే ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోని 2017లో షేర్ చేసిన సోషల్ మీడియా పోస్టులు కొన్ని మాకు లభించాయి. దీన్నిబట్టి ఈ ఆక్సిడెంట్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై జరగలేదని కచ్చితంగా చెప్పొచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
పోస్టులో వీడియో యొక్క కీ ఫ్రేమ్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని కొన్ని సంవత్సరాలకు ముందే షేర్ చేసిన సోషల్ మీడియా పోస్టులు కనిపించాయి. ఇందులో కొన్ని 2017కి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి. ఈ వీడియోని షేర్ చేసిన పోస్టులు ఇక్కడ , ఇక్కడ చూడొచ్చు. దీన్నిబట్టి ఈ వీడియో ఇప్పటిది కాదని, చాలా సంవత్సరాల ముందు నుండే ఇంటర్నెట్ లో చెక్కర్లు కొడుతుందని కచ్చితంగా చెప్పొచ్చు.
ఈ వీడియో గురించి మరింత సమాచారం వెతికే క్రమంలో ఈ వీడియోపై వివరణ ఇస్తూ తెలంగాణ స్టేట్ పోలీస్ చేసిన ట్వీట్ ఒకటి మాకు కనిపించింది. ఈ ట్వీట్ ప్రకారం ఈ వీడియో జరిగిన ఆక్సిడెంట్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై జరగలేదని, ఈ వార్త ఫేక్ అని పోలీస్ వారు నిర్ధారించారు.
చివరగా, పాత ఆక్సిడెంట్ వీడియోని చూపిస్తూ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై జరిగిందని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.