Fake News, Telugu
 

సంబంధం లేని పాత వీడియోని ఢిల్లీ JNU విధ్యార్ధులు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలోని దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఢిల్లీ JNUలోని కమ్యూనిస్ట్ విధ్యార్ధులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలోని దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. బహిరంగ ప్రదేశంలో యువతీ యువకులు ముద్దులాడుతూ ఒకరినొకరు హగ్ చేసుకుంటున్న నిరసన చేస్తున్న దృశ్యాలను మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఢిల్లీ JNUలోని కమ్యూనిస్ట్ విధ్యార్ధులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలోని దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): 2014లో పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం కోల్‌కతాలో జరిగిన ‘కిస్ ఆఫ్ లవ్’ నిరసన కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. మోరల్ పొలిసింగ్, లింగ వివక్షకు వ్యతిరేకంగా కోల్‌కతాలోని విశ్వవిధ్యాలయాలకు చెందిన విధ్యార్ధులు ఈ ‘కిస్ ఆఫ్ లవ్’ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది, ఢిల్లీ JNUకి సంబంధించినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ఒక యూట్యూబ్ ఛానెల్ 05 నవంబర్ 2014 నాడు షేర్ చేసినట్టు తెలిసింది. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం కోల్‌కతాలోని జాదవ్‌పుర్ యూనివర్సిటీలో నిర్వహించిన ఓపెన్ కిస్ నిరసన కార్యక్రమంలోని దృశ్యాలంటూ ఈ వీడియో వివరణలో తెలిపారు.

ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, ఇవే దృశ్యాలను చూపిస్తున్న వీడియోని ‘ABP Ananda’ వార్తా సంస్థ 06 నవంబర్ 2014 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. కోల్‌కతాలో మోరల్ పోలీసింగ్‌కు వ్యతిరేకంగా విధ్యార్ధులు చేపట్టిన నిరసన కార్యక్రమంలోని దృశ్యాలంటూ ఈ ABP వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. ఇదే విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ఇతర వార్తా సంస్థలు కూడా 2014 నవంబర్ నెలలో వీడియోలు మరియు ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి.

మోరల్ పొలిసింగ్, లింగ వివక్షకు వ్యతిరేకంగా కోల్‌కతాలోని విశ్వవిధ్యాలయాలకు చెందిన విధ్యార్ధులు ఈ ‘కిస్ ఆఫ్ లవ్’ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిసింది. కేరళలో మోరల్ పొలిసింగ్‌కు వ్యరతిరేకంగా నిర్వహించిన కిస్ ఆఫ్ లవ్ నిరసనకు మద్దతు పలుకుతూ కోల్‌కతా విధ్యార్ధులు ఈ నిరసన చేపట్టినట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి.

చివరగా, సంబంధం లేని పాత వీడియోని ఢిల్లీ JNU విధ్యార్ధులు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఇటీవల నిర్వహించిన నిరసన కార్యక్రమంలోని దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll